Menu

అభ్యంగన స్నానం

అభ్యంగన స్నానం

అభ్యంగన స్నానం

మానవుడికి స్నానం అనునది ఒక భోగం. ఒక యోగం. స్నానాన్ని ఏదో ఒళ్లు తడిపాము అన్నట్లుకాక తనువు మనసు తడిచేలా అనుభూతి చెందుతూ స్నానం ఆచరించాలి. చన్నీటి స్నానం శిరస్సు నుంచి ప్రారంభించాలి. వేడి నీటి స్నానం పాదాల నుంచి ప్రారంభించి తరువాత శరీరం తడపాలి. పురుషులు విధిగా రోజూ శిరస్నానం ఆచరించాలి. పర్వదినాలలోనూ, జన్మదినముననూ, విశేష క్రతువుల ప్రారంభంలోనూ అభ్యంగన స్నానాన్ని తప్పకుండా ఆచరించాలి.

తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి. శరీరానికి తైలాన్ని (నువ్వులనూనెను) బాగా రాసి మర్దన చేసి నలుగు పిండితో ఒళ్ళు రుద్దుకుని గోరువెచ్చటి నీటితో స్నానం చేయడాన్ని ‘అభ్యంగన(తలంటి)స్నానం’ అంటారు. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి. కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి, గంగా దేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు.

‘అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం’ (అభ్యంగన స్నానం అన్ని అవయవాలూ పుష్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్ట్యా అభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మిక రీత్యా తైలభ్యంగనానికీ రీతిగా విశేష ప్రాధాన్యమీయబడింది.

అయితే అభ్యంగన స్నానం నిత్యం చేయకూడదు. శ్రాద్ధ దినములయందు, ఆది, మంగళ వారములు, పాడ్యమి, చవితి, షష్ఠి, అష్టమి, నవమి, చతుర్ధశి తిధులయందు అభ్యంగన స్నానం చేయకూడదు. అనివార్యమై చేయవలసి వచ్చినప్పుడు ఈ కింద సూచించిన విధము చేయడం వలన దోషము తొలిగి శుభం కలుగుతుంది.

అభ్యంగన స్నాన వారదోషములు

ఆదివారం      – తాపము. నివారణకు నూనెలో పుష్పములు.
సోమవారం    –   కాంతి, మనోల్లాసము.
మంగళవారం – మృతి. నివారణకు నూనెలో మన్ను.
బుధవారం    – లక్ష్మీ కటాక్షము.
గురువారం     – ధన నాశం. నివారణకు నూనెలో గరిక.
శుక్రవారం     – విపత్తు. నివారణకు నూనెలో గోమయం.
శనివారం       – భోగము

అయితే పండుగ, శుభదినములకు ఈ దోషము వర్తించదు. స్త్రీలకు గురు, శుక్రవారములు శుభములు.