Menu

Monthly Archives: March 2015

Ashwini

అశ్వని నక్షత్రం – గుణగణాలు, ఫలితాలు
    అశ్విని నక్షత్ర అధిదేవత అశ్వినీ దేవతలు. సూర్య భగవానుడి భార్య సజ్ఞాదేవికి, సూర్య భవానుడికి పుట్టిన వారు అశ్వినీ దేవతలు. ప్రాథమికంగా అశ్వనీ నక్షత్రం సన్య నక్షత్రంగా పురుష లక్షణంతో క్షిపుతారగా గుర్తింపు పొందింది. దీనికి అధిపతి కేతువు. ఈ నక్షత్రంలో జన్మించినవారు శివుడి అర్చన చేసి వైడూర్యాన్ని ధరించవలసి ఉంటుంది.
అశ్వని నాలుగు పాదాలు మేష రాశిలోనే ఉన్నాయి
  • మొదటి పాదం 
అశ్వినీ నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు. వీరు శక్తికి మించిన సామర్థ్యం ప్రదర్శించాలని ప్రయత్నిస్తారు. అస్థిర చిత్తంతో ఉంటారు. కొన్ని సార్లు రాజీ ధోరణితో ఉండాల్సి ఉంటుంది. అనవసర విషయాలపై దృష్టి పెట్టడం జరుగుతుంది. పనికి రాని ఆలోచనలు బుర్రను తొలుస్తుంటాయి. సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం పొందాలన్న తాపత్రయపడతారు.
గ్రహ దశలు
పుట్టినప్పటి నుంచి కేతు మహర్దశ ఏడు సంవత్సరాలు, శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు, రవి మహర్దశ ఆరు సంవత్సరాలు, చంద్ర మహర్దశ పది సంవత్సరాలు, కుజ మహర్దశ ఏడు సంవత్సరాలు అనుభవిస్తారు.
  • రెండో పాదం 
అశ్వినీ నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు నవాంశ రాశ్యధిపతి శుక్రుడు. దీంతో వీరు పట్టుదల గల వారు. ఎదుటి వ్యక్తుల స్వభావాన్ని త్వరగా గ్రహిస్తారు. చాలా విషయాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. తలపెట్టిన కార్యాన్ని సాధించడంలో అనుకూలమైన మార్గాన్ని ఎంచుకుంటారు. ప్రాజ్ఞులు, దక్షులుగా గుర్తింపు పొందుతారు. మంచి ఆత్మవిశ్వాసం గలవారై ఉంటారు.
గ్రహ దశలు 
వీరు పుట్టినప్పటి నుంచి కేతు దశ ఐదు సంవత్సరాల మూడు నెలలు. శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు. రవి మహర్దశ ఆరు సంవత్సరాలు. చంద్ర మహర్దశ పది సంవత్సరాలు, కుజ మహర్దశ ఏడు సంవత్సరాలు అనుభవిస్తారు.
  • మూడో పాదం  
అశ్వని మూడో పాదంలో జన్మించిన వారికి ప్రాచీన శాస్త్రాలను ఇష్టపడుతారు. ముఖ్యంగా జ్యోతిష్య, తర్క శాస్త్రాలపై మక్కువ ఉంటుంది. చక్కటి సలహాలు ఇవ్వడంలో నేర్పరులు.  అయితే ఆ సలహాల వల్ల తమకు తాము ఎలాంటి లాభాన్ని పొందలేరు. నలుగురిలో కలిసేందుకు ఇష్టపడరు.
గ్రహ దశలు  
పుట్టినప్పటి నుంచి కేతు మహర్దశ మూడున్నర సంవత్సరాలు, శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు. రవి మహర్దశ ఆరు సంవత్సరాలు. చంద్ర మహర్దశ పది సంవత్సరాలు, కుజ మహర్దశ ఏడు సంవత్సరాలు, రాహు దశ 18 సంవత్సరాలు అనుభవిస్తారు.
  • నాలుగో పాదం  
అశ్వని నాలుగో పాదంలో జన్మించిన వారు కళాత్మకంగాను, అలంకార ప్రియులుగానూ, నిదానమైన ప్రవర్తనతోనూ ఉంటారు. గాఢమైన ఆలోచనలు కలిగి మేధావులుగా గుర్తింపు పొందుతారు. నిరంతరం కొత్త విషయాలపై ఆసక్తి కనబరుస్తారు. లక్ష్యసాధనలో వెనుకడుగు వేయరు. అయితే వీరికి ఫలితం సునాయాసంగా అందదు. శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది.
గ్రహ దశలు   
పుట్టినప్పటి నుంచి కేతు మహర్దశ 7 సంవత్సరాల 9 నెలలు, శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు. రవి మహర్దశ ఆరు సంవత్సరాలు. చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, కుజ మహర్దశ ఏడు సంవత్సరాలు, రాహు దశ 18 సంవత్సరాలు అనుభవిస్తారు.
ఈ నక్షత్ర జాతకుల గుణగణాలు
అశ్వినీ నక్షత్ర జాతకులు అశ్వం వలే ఉరిమే ఉత్సాహంతో కనిపిస్తారు. తెలివి, జ్ఞాపకశక్తి, సామర్థ్యం, చైతన్యవంతమైన, విశాలమైన కళ్ళు కలిగివుంటారు. పోటీ మనస్తత్వం ఉంటుంది. క్రీడల యందు ఆసక్తి అధికం. అశ్వినీదేవతలు శసత్రచికిత్స, ఆయుర్వేద వైద్యములో నిపుణులు కనుక అశ్వినీ నక్షత్రజాతకులు ఆయుర్వేదం వంటి వైద్యం యందు ఆసక్తితో ఉంటారు. వీరు ఉద్రేకపూరిత మనస్తత్వం కలిగి ఉంటారు. రాశ్యాధిపతి కుజుడు కనుక వీరికి ధైర్యసాహసాలు అధికం. ఎటువంటి పరిస్థితులనైనా మనోస్థైర్యంతో ఎదుర్కొనగలరు. ఓర్పు, నేర్పు, సామర్ధ్యంతో కార్యనిర్వహణ పూర్తి చేస్తారు. తనను నమ్ముకున్న వారిని ఆపదలో కాపాడుట వీరి విశిష్ట గుణం.
ఈ నక్షత్ర జాతకులు వీరు ఇతరుల సలహాలు స్వీకరించినా.. చివరకు తమకు నచ్చినట్లు నిర్ణయం తీసుకుంటారు. ఈ నక్షత్రము దేవగణ నక్షత్రము కనుక న్యాయం, ధర్మము పాటిస్తారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక రాజకీయనాయకులుగా, అధికారులుగా చక్కగా రాణిస్తారు. నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యం, దైవోపాసనా, భక్తి వంటి లక్షణాలు వీరికి అధికం. కొంత అలసత్వము కలిగి ఉండడము సహజమే. తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల ఉంటుంది. ఇతరులకు కింద పనిచేయడం వీరికి నచ్చదు. అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వం కలిగి ఉంటారు.
క్రీడాకారులుగా, వైద్యులుగా, సైనికపరమైన ఉద్యోగులుగా చక్కగా రాణించగలరు. ఇవి అశ్వినీ నక్షత్రజాతకుల సాధారణ గుణాలు. అయితే జాతకచక్రం, లగ్నం, పుట్టిన సమయం, మాసముల వలన గుణగణాలలో కొద్దికొద్దిగా మార్పులు ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులకు 45 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. బాల్యము నుంచి యుక్తవయస్కులు అయ్యే వరకు వీరికి జీవితం వీరికి ఆనందదాయకముగా జరుగుతుంది. అశ్వనీ నక్షత్ర జాతకులకు కృత్తిక, మృగశిర, పునర్వసు, చిత్త, అనూరాధన, జ్యేష్ట నక్షత్రములు ఏ కార్యమునకు పనికి రావని శాస్త్రం చెబుతోంది.

Bharani

భరణి నక్షత్రం – గుణగణాలు, ఫలితాలు
   మేష రాశిలోని రెండో నక్షత్రమే ‘భరణి నక్షత్రము’. ఈ నక్షత్రం స్త్రీ లక్షణం కలిగి ఉన్నప్పటికీ ఉగ్రతారగా గుర్తింపు పొందింది. శుక్రుడు అధిపతిగా ఉన్నాడు కనుక వీరు రజో గుణంతో భాసిల్లుతారు. ఈ నక్షత్రము 4 పాదాలూ మేష రాశిలోనే ఉన్నాయి.
భరణి మొదటి పాదము 
శారీరకంగా శక్తివంతులై ఉంటారు. ఇదే సమయంలో పౌరుషవంతులుగానూ.. శత్రువులను లొంగదీసుకుంటారు. పంతాలు పట్టింపులు సాధించుకునేందుకు ప్రయత్నిస్తారు. పెద్దలపట్ల గౌరవం, ఆచార వ్యవహారాలపైనా, సాంస్కృతి సాంప్రదాయలపైన, నీతి నియమాలపైనా శ్రద్ధాసక్తులు కలిగి మెసులుకుంటారు. అయితే తమలోని లోపాలు బయటపడకుండా నిరంతరం జాగ్రత్త పడుతుంటారు.
మొదటి పాదములో గ్రహ దశలు 
జన్మించినప్పటి నుంచి శుక్ర మహాదశ ఇరవై సంవత్సరాలు, రవి మహాదశ ఆరు సంవత్సరాలు, చంద్ర మహర్దశ పది సంవత్సరాలు, కుజ దశ ఏడు సంవత్సరాలు, రాహు దశ 18 సంవత్సరాలు ఉంటుంది.
భరణి రెండో పాదము
భరణి రెండో పాదం యందు పంతం, పట్టుదల అధికంగా కనిపిస్తుంది. అనుకొన్నది పూర్తి చేయాలన్న పట్టుదల ఉంటుంది. అయితే ఈ క్రమంలో పలు సందర్భాల్లో మొండితనంతో వ్యవహరిస్తారు. సంపన్న జీవితాన్ని గడపడంతోపాటు మంచిచెడులపై అవగాహన, నీతి నియమాలపై శ్రద్ధ కలిగి ఉంటారు. కీర్తివంతులై చిరస్థాయిని పొందుతారు. ఆలోచనా ధోరణి అధికం. అనవసర విషయాలపై ఆసక్తితో శోధిస్తారు.
రెండో పాదములో గ్రహ దశలు  
జన్మించినప్పటి నుంచి శుక్ర మహాదశ 20 సంవత్సరాల పాటు ఉంటుంది. రవి మహాదశ ఆరు సంవత్సరాలు, చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, కుజ దశ ఏడు సంవత్సరాలు, రాహు దశ 18 సంవత్సరాలు ఉంటుంది.
భరణి మూడో పాదము
భరణి మూడో పాదంలో జన్మించినవారు తమ ప్రమేయం ఏమీ లేకుండానే ఫలితం కోరుకుంటారు. వాస్తవానికి-ఆలోచనకు మధ్య పొంతన ఉండదు. అయితే తెలివితేటల విషయంలో గొప్పవారే. పొగడ్తలంటే ఇష్టపడతారు. శక్తివంతులు కావడంవల్ల ఆధిక్యాన్ని ప్రదర్శించడానికి ముందుంటారు. తొందరగా కోపం వచ్చినా నిగ్రహ శక్తిని కలిగి ఉంటారు. ఈ పాదంలో జన్మించిన వారికి దైవభక్తి ఎక్కువ.
భరణి మూడో పాదంలో గ్రహ దశలు   
పుట్టినప్పటి నుంచి ముందుగా శుక్ర మహాదశ సుమారుగా పదేళ్లు. రవి మహాదశ ఆరేళ్లు, చంద్ర మహర్దశ పదేళ్లు, కుజ దశ ఏడేళ్లు, రాహు దశ పద్దెనిమిదేళ్లు ఉంటుంది.
భరణి నాలుగో పాదము
ఈ పాదంలో ఊహల ఊయాల ఊగుతారు. మరోవైపు ఆడంబరాన్ని, పటాటోపాన్ని కోరుకుంటారు. పంతంపట్టి పనులు సాధించుకోవడం వీరి లక్షణం. కష్టమైనా, నష్టమైనా తమదే పైచేయిగా ఉండాలని పట్టుబడతారు. తరచూ కోపాన్ని ప్రదర్శిస్తారు. బతిమాలించుకునే మనస్తత్త్వం. పొగడ్తలను ఆస్వాదిస్తారు. గర్వంతోనూ, కఠినత్వంతోనూ వ్యవహరిస్తారు.
భరణి నాలుగో పాదంలో గ్రహ దశలు   
ఈ పాదంలో జన్మించిన వారు శుక్ర మహాదశ ఐదేళ్లు, రవి మహాదశ ఆరేళ్లు, చంద్ర మహర్దశ పదేళ్లు, కుజ దశ ఏడేళ్లు, రాహు దశ పద్దెనిమిదేళ్లు ఉంటుంది.
భరణి నక్షత్రము – గుణగణాలు, ఫలితాలు
     భరణి నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యధిపతి కుడా కుజుడు. ఈ కారణంగా వీరు అందంగానూ ఆకర్షణీయంగా ఉంటారు. ఇది మానవ గణ నక్షత్రము కనుక లౌక్యం చొరవ ప్రదర్శించే గుణము కూడా ఎక్కువే. ఈ నక్షత్రంలో జన్మించినవారు వేదాంత విషయాలపట్ల, ప్రాచీన సంప్రదాయాలపట్ల ఆసక్తి కలిగి ఉంటారు.
పొగడ్తలంటే గిట్టనివారుగా పైకి కనిపించినా వాటిని బాగా ఆస్వాదిస్తారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తారు. పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు. సమయాన్ని, సందర్భాన్ని బట్టి తమ అభిప్రాయాలు మార్చుకుంటుంటారు. ఎదుటి వారిని ఎంత గొప్పగా పొగుడుతారో అదే విధంగా అంతే కఠినంగా విమర్శిస్తారు. రెండు వాదనలను సమర్ధించుకుంటారు. స్వార్ధం కొంత సహజమే. తాము నమ్మిన సిద్ధాంతాలకు త్వరగా తిలోదకాలు ఇవ్వరు. వైఖరిలో మార్పు తెచ్చుకోలేకపోవడంతో అనుకున్న విధంగా అభివృద్ధి సాధించలేరు. వృద్ధాపయంలో సుఖజీవనం చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు.
సమాజంలో పేరు, ప్రతిష్థ వ్యక్తిగత గౌరవము కలిగి ఉంటారు. సౌందర్యం, విలాసవంతం ఉండే విషయాల్లో ఆసక్తి చూపిస్తారు. సుగంధద్రవ్యాలు, సౌందర్య పోషణ అందు ఆసక్తి అధికం. కళత్రము వలన కలసి వస్తుంది. విభేదాలు ఉంటాయి. అంతేకాదు వీరు వ్యూహరచన గొప్పగా ఉంటుంది. వీరు సలహాదారులుగానూ రాణిస్తారు.
ఈ నక్షత్రంలో జన్మించిన వారికి బాల్యం సుఖవంతంగా జరుగుతుంది. 28 నుంచి 32 సంవత్సరాల తరువాత కొన్ని చిక్కు సమస్యలను ఎదుర్కొంటారు. ఇందులో జన్మించిన నక్షత్రపాదాలు, జాతక చక్రంలో గ్రహస్థి వలన మార్పులు ఉంటాయి. ఫలితాలు సాధారణంగా అందరికీ సమానమైనా పుట్టిన సమయం గ్రహస్థితులు నవాంశము మొదలైన విషయాల వలన ఫలితాలలో మార్పులు ఉంటాయి. ఇక వీరు వృద్ధాప్య దశలో సుఖవంతంగానే ఉంటారు.
వీరి తమ వ్యక్తిత్వ తీరువల్ల అనుకున్న స్థాయిలో అభివృద్ధి సాధించడానికి ఆటంకాలు ఎదురవుతాయి. అందుకే నిత్యం భరణీ నక్షత్రములో పుట్టిన జాతకులు మహాలక్ష్మిదేవి పూజించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి. ఇంకా సంవత్సరానికి ఒక్కసారైనా ఇంద్రాణీ హోమం చేయించడం వల్ల మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది.
భరణి నక్షత్రంలో పుట్టిన జాతకులకు 9 అనే సంఖ్య అనుకూలిస్తుంది. 9తో పాటు 18, 27, 36, 45, 54, 63, 72 అనే సంఖ్యలు కూడా శుభ ఫలితాలనిస్తాయి. అలాగే ఈ జాతకులకు ఎరుపు, తెలుపు రంగులు అదృష్టానిస్తాయి. ఇందులో ఎరుపు రంగు చేతి రుమాలును వాడటం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి.
భరణి నక్షత్ర జాతకులకు కుజ గ్రహ ప్రభావం ఉండటంతో వీరికి మంగళవారం కలిసివస్తుంది. బుధ, ఆదివారాలు సామాన్య ఫలితాలనిస్తాయి. అయితే గురువారం మాత్రం ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించడం మంచిది కాదని శాస్త్రం చెబుతోంది.

Krittika

కృత్తిక నక్షత్రం – గుణగణాలు, ఫలితాలు
    కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు మంచి వర్చస్సుతో కనిపిస్తారు. వీరు అమితమైన సాహసాన్ని ప్రదర్శిస్తుంటారు. పాలనారంగంలో ఆసక్తి చూపిస్తారు. ఇతరుల వస్తువులను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తుంటారు. వీరిది అహంకార స్వభావమనే చెప్పాలి. వీరిలో విచారం, సంతోషం ఒకేలా ఉండవు. తమలోని సంఘర్షణను సైతం బయటకు కనబడనీయరు. ఎదుటి వ్యక్తి కష్టాలలో ఆపేక్ష ఉంటుంది. కానీ తన గురించి కూడా ఆలోచించుకుంటారు. విచక్షణతో గుర్తెరిగి ప్రవర్తిస్తుంటారు. ఈ నక్షత్రంవారు మేడి లేక అత్తి చెట్టును పెంచుకోవాలి.
కృత్తిక నక్షత్రం మొదటి పాదంమాత్రమే మేష రాశిలోనే ఉంది. మిగిలిన మూడు పాదాలు వృషభ రాశిలో చేరాయి.
కృత్తిక మొదటి పాదము 
కృత్తిక మొదటి పాదములో జన్మించిన వారు శారీరక బలంతోపాటు విద్యావంతులు. సామర్థ్యానికి మించి తలపడి చిక్కుల్లో పడుతుంటారు. అయితే ప్రయత్నపూర్వకంగా నిదానంగా ఫలితాలు సాధించడం వీరి సానుకూల లక్షణం. గంభీర స్వభావులై ప్రజాపాలనలో ఆసక్తి కలిగి ఉంటారు.
కృత్తిక మొదటి పాదములో గ్రహ దశలు   
వీరికి ముందుగా రవి మహర్దశ 6 సంవత్సరాలు. అటు తర్వాత చంద్ర మహాదశ పదేళ్లు. కుజ దశ 7 ఏళ్లు, రాహు దశ 18 సంవత్సరాలు, గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ పందొమ్మిది సంవత్సరాలు ఉంటుంది.
కృత్తిక రెండో పాదము 
కృత్తిక రెండో పాదములో జన్మించిన వారది గంభీర స్వభావం. సంస్కృతి, సాంప్రదాయాలకు, ఆచారాలకు  దూరం. తనకుమాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అన్నది వీరి నమ్మకం. వ్యక్తిగత విషయాల గురించి ఆలోచిస్తారు. ఇతరులపట్ల ఆదరణ ఉంటుంది కానీ పరిమితమే. పంతం పట్టకుండా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది.
కృత్తిక రెండో పాదములో గ్రహ దశలు    
ముందుగా రవి మహర్దశ నాలుగున్నర సంవత్సరాలు. ఆ తర్వాత చంద్ర మహాదశ పదేళ్లు. కుజ దశ 7 ఏళ్లు, రాహు దశ 18 సంవత్సరాలు, గురు మహర్దశ 18 సంవత్సరాలు, శని మహర్దశ పందొమ్మిది సంవత్సరాలు ఉంటుంది.
కృత్తిక మూడో పాదము 
కృత్తిక మూడో పాదములో జన్మించిన వారు శక్తివంతులుగా మెలుగుతారు. ఎల్లప్పుడు ధైర్యంతో ఉంటారు. గంభీర వదనంతో కనిపిస్తారు. అయితే, లాభ నష్టాలపై అతిగా ఆలోచిస్తుంటారు. పనికి రాని విషయాల్లోనూ అనవసరపు ఆసక్తి చూపిస్తారు. పైకి మాత్రం ఏమీ పట్టనట్టు, ఏదీ పట్టించుకోనట్టుగా నటిస్తారు. అనవసరపు లెక్కలతో వారి అభివృద్దికి కూడా ఆటంకం కలుగుతుంది.
కృత్తిక మూడో పాదములో గ్రహ దశలు    
ముందుగా రవి మహర్దశ మూడు సంవత్సరాలు, ఆ తర్వాత వరుసగా చంద్ర మహాదశ పదేళ్లు. కుజ దశ 7 ఏళ్లు, రాహు దశ 18 సంవత్సరాలు, గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు ఉంటుంది.
కృత్తిక నాలుగో పాదము  
కృత్తిక మూడో పాదములో జాగ్రత్తలు అవసరం. తన తీరుతో, రకరకాల వాఖ్యలతో చిత్రమైన ప్రవర్తనను కలిగి ఉంటారు. భగవదారాధన, సత్సంగ మార్గంలో ఉండడం అవసరం. లేకుంటే వ్యసనాలకు అలవాటు పడే ప్రమాదం ఉంటుంది. అన్నీ తెలిసిన వ్యక్తి మాదిరి హడావుడి చేయడానికి ప్రయత్నిస్తారు. తమకున్న పరిజ్ఞానం పరిమితులు గ్రహించి మసలుకుంటే మంచిది.
కృత్తిక నాలుగో పాదము గ్రహ దశలు     
ముందుగా రవి మహర్దశ ఒకటిన్నర సం.లు, తర్వాత వరుసగా చంద్ర మహాదశ పదేళ్లు. కుజ దశ 7 ఏళ్లు, రాహు దశ 18 సంవత్సరాలు, గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు ఉంటుంది.
కృత్తిక నక్షత్రము గుణగణాలు
రవి గ్రహ నక్షత్రమైన కృత్తిక నక్షత్రములో పుట్టిన జాతకులు బాల్యంలో ధనిక జీవితాన్ని గడుపుతారు. స్వశక్తి అనేక స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. సంతానాన్ని సమదృష్టిలో చూస్తారు. కానీ చిన్న విషయాలకే అసత్యాలు పలికే మనస్తత్వం కలిగి వుంటారు. ఈ నక్షత్రములో పుట్టిన జాతకులు చదువు, అన్యభాషల యందు నేర్పరితనము విశేషమైన పోటీ తత్వము కలిగి ఉంటారని శాస్త్రం చెబుతోంది.
తొలి పాదములో పుట్టిన జాతకులకు మంగళవారం అన్ని విధాలా కలిసివస్తుంది. అలాగే బుధ, ఆదివారాలు సామాన్య ఫలితాలనిస్తాయి. కానీ గురువారం మాత్రం ఈ జాతకులు శుభకార్యాన్ని ప్రారంభించకూడదు. అలాగే కృత్తికా నక్షత్రము-తొలి పాదములో పుట్టిన జాతకులకు అదృష్ట సంఖ్యలు 9, 18, 27, 36, 45, 54, 63, 72.
ఈ నక్షత్రం తొలి పాదంలో పుట్టిన జాతకులకు కలిసొచ్చే రంగులు – ఎరుపు, తెలుపు.
ఇదేవిధంగా ఈ నక్షత్రము 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకు బుధవారం అనుకూలిస్తుంది. ఈ జాతకులు బుధవారం చేపట్టే కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కానీ పౌర్ణమి తిథిలో వచ్చే బుధవారం నాడు ఈ నక్షత్రములో పుట్టిన జాతకులు ఎలాంటి శుభకార్యాన్ని చేపట్టకూడదు.
కృత్తికా నక్షత్రం.. అగ్ని నక్షత్రం, అధిపతి సుర్యుడు, గణం రాక్షసగణము కనుక ఈ నక్షత్రజాతకులు ఆవేశపరులై ఉంటారు. అంతటా ఆధిక్యత ప్రదర్శిస్తారు. ఏ పాదములో జన్మించినా బాల్యంలో ధనిక జీవితాన్ని గడుపుతారు. అధికారము ఇచ్చే చదువు, అన్యభాషల యందు నేర్పరితనం, విశేషమైన పోటీ మనతత్వం ఉంటుంది. చిన్న విషయాలకే అబద్ధాలు ఆడతారు. వీరికి స్త్రీలతో కలిగే విభేదాల వలన జీవితంలో చెప్పుకోదగిన మార్పులు వస్తాయి. ఇతరుల సలహాలను సహించరు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించరు. అన్నింటా అధికారము సాగించాలని వీరు చెసే ప్రయత్నము మూడు భాగాలు ఫలించినా ఒక భాగము వికటిస్తుంది.
23 ఏళ్ల తర్వాత కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా 36 నుంచి 41 ఏళ్ల తరువాత సమస్యల నుంచి బయటపడి సుఖ జీవితం సాగిస్తారు. ఈ నక్షత్ర జాతకులందరికీ ఇవి సాధారణ ఫలితాలు అయినా జాతక చక్రం, సమయం, గ్రహస్థితి, నవంశను అనుసరించి విశేష మార్పులు ఉంటాయి.
ఈ నక్షత్రమున 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకు నీలం, తెలుపు అన్ని విధాలా కలిసొస్తుంది. ఈ జాతకులు రోజువారీ ధరించే దుస్తుల్లో నీలపు, తెలుపు రంగులు కొంతవరకైనా ఉండేలా చూసుకోవడం మంచిది. ఈ రంగు దుస్తులను ధరించడం వల్ల మనశ్శాంతి, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
ఈ జాతకులకు 6 అనే సంఖ్య అన్నివిధాలా అనుకూలిస్తుంది. 4, 5, 8 అనే సంఖ్యలు కూడా మంచి ఫలితాలనిస్తాయని శాస్త్రం చెబుతోంది.

Rohini

రోహిణి నక్షత్రం-గుణగణాలు, ఫలితాలు

రోహిణీ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ. నక్షత్రాధిపతి చంద్రుడు. ఈ నక్షత్ర జాతకులు మానసిక ధృఢత్వము కలిగి ఉంటారు. మానవ గణము కనుక ధర్మచింతన కలిగి ఉంటుంది. జీవితంలో లౌక్యంగానూ ప్రవర్తిస్తారు. అనుకున్నది నయనా భయానా చెప్పి సాధిస్తారు. అనుకూలంగా నడుచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు. సాహస క్రీడలంటే ఇష్టపడతారు. అందులోనూ ప్రావీణ్యత, గుర్తింపు సాధిస్తారు.

రోహిణి నక్షత్రం 4 పాదాలూ వృషభ రాశిలోనే ఉంటాయి.

రోహిణి మొదటి పాదము
రోహిణి మొదటి పాదములో జన్మించిన వారి ప్రధాన బలహీనత అనవసర విషయాలపై దృష్టిపెట్టడం. అవసరం లేని ఇతర విషయాల మీదే ఎక్కువగా ఆలోచిస్తారు. ఆలోచన అంతగా లేకుండానే తొందరపడి పనులు మొదలుపెడతారు. దీనివల్ల ఇబ్బందుల్లో కూరుకుపోతారు. నిదానంగా ప్రవర్తించాల్సిన విషయాల్లో జాగరూకత అవసరం. ఇతర విషయాలవైపు మనసు లాగితే చేసే పనిమీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి, అనవసర విషయాలకు ప్రాధాన్యం తగ్గించాలి. పరిస్థితుల్ని బట్టి సర్దుకోగలగడం ఒక వరం అనుకోవాలి. సానుకూలతను బట్టి మెలగాలి.

రోహిణి మొదటి పాదము గ్రహ దశలు
ఈ నక్షత్రంలో జన్మించిన వారి గ్రహ దశల విషయానికి వస్తే.. ముందుగా చంద్ర మహర్దశ పదేళ్లు, ఆ తర్వాత కుజ మహర్దశ 7 ఏళ్ళు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, ఆపై గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ దశ 17సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు ఉంటుంది.

రోహిణి రెండో పాదము
రోహిణి రెండో పాదములో జన్మించిన వారు అదృష్ట జాతకులు. కలిసివచ్చిన అవకాశాల్ని చక్కగా ఉపయోగించుకునే నేర్పు ఉంటుంది. ఈ విషయంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మాటల్లో పటుత్వం కలిగి ఉంటారు. ఈ ధోరణితో నెగ్గుకొని రాగలుగుతారు. ఇక జీవితంలో తరచూ తారసపడే అనవసరమైన విషయాల మీద ఆందోళన తగ్గించుకోవాలి. ప్రతిభా సామర్థ్యాలు ఏ స్థాయిలో వినియోగించుకోవాలనే విషయంలో స్పష్టత సాధిస్తే మరింత మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

రోహిణి రెండో పాదములో గ్రహ దశలు
ఈ పాదములో జన్మించిన వారికి ముందుగా చంద్ర మహర్దశ ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత కుజ మహర్దశ 7 ఏళ్ళు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, ఆపై గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ దశ 17 సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు ఉంటుంది.

రోహిణి మూడో పాదం
రోహిణి మూడో పాదంలో జన్మించిన వారికి రకరకాల ఆలోచనలు పరిభ్రమిస్తుంటాయి. అయితే ఆ ఆలోచనలు బయటపెట్టకుండా జాగ్రత్త పడతారు. కళలయందు ఆసక్తి ఉంటుంది. కొంచెం పట్టు ఉన్నా ఎక్కువ పట్టు ఉన్నట్లు చూపగల నేర్పు ఉంటుంది. అయితే ఎల్లప్పుడు అనవసరపు ఆందోళనలు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. భావోద్వేగాలను ప్రకటించే విషయంలో పరిమితి తప్పనిసరి.

గ్రహ దశలు
తొలుత చంద్ర మహర్దశ 5 సంవత్సరాలు, ఆ తర్వాత కుజ మహర్దశ 7 సంవత్సరాలు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, తదుపరి గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ దశ 17సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు ఉంటుంది.

రోహిణి నాలుగో పాదం
రోహిణి నాలుగో పాదంలో జన్మించిన వారు అంది వచ్చిన అవకాశాల్ని పసిగడుతారు. జాగరూకులై ప్రవర్తించడం వీరి సహజసిద్ధ లక్షణం. జాగ్రత్తలో ఉన్నప్పటికీ ఒక్కోసారి ఎదురుదెబ్బలు తగిలే అవకాశం. అటువంటి సందర్భాల్లో సైతం మెరుగైన అవకాశాలకోసం అన్వేషిస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో తమను తాము గుర్తెరిగి ప్రవర్తిస్తుంటారు.

గ్రహ దశలు
తొలుత చంద్ర మహర్దశ రెండున్నర సంవత్సరాలు, ఆ తర్వాత కుజ మహర్దశ 7 సంవత్సరాలు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, తదుపరి గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, అనంతరం బుధ దశ 17సంవత్సరా లు, కేతు దశ 7 సంవత్సరాలు ఉంటుంది.
రోహిణి నక్షత్రము గుణగణాలు
ఈ నక్షత్ర జాతకులు మానసిక ధృఢత్వము కలిగి ఉంటారు. అనుకూలంగా నదచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు. త్వరగా కోపం రాదు. చిరునవ్వుతో ఉంటారు. ఎన్ని విమర్సలనైనా ఎదుర్కొని అనుకున్నది సాధిస్తారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారం కలసి వస్తుంది. అపనిందలు, ఆరోపనలు జీవితములో ఒక భాగము ఔతాయి. జీవితములో ఒడిదుడుకులు సహజము. వీరు హాస్యప్రియులు, కళ ప్రియులు కనుక కళారంగములో ప్రగతిని సాధిమ్చి అవార్దులు పొందగలరు. సంతానముతో విభేదిస్తారు.

గురు మహర్ధశ, శని మహర్ధశ వీరికి కలసి వస్తుంది. ప్రేమ వివాహాలు కలసి రావు. భార్యా భర్తల నడుమ అన్యోన్యత ఉంటుంది. క్రీడలు, కోర్టు వ్యవహారాలలో విజయము సాధిస్తారు. గజ ఈతగాళ్ళూ ఔతారు.తనకు తాను సుఖపడుతూనేతన వారిని సుఖ పెడతారు. వంశానికి కుటుంబానికి పేరు తెస్తారు. తాము అనుకున్నట్లు సంతానాన్ని తీర్చి దిద్దుతారు.

Mrugashrisha

మృగశిర నక్షత్రం – గుణగణాలు, ఫలితాలు 
మృగశిరా నక్షత్రము దేవగణ నక్షత్రము. ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు, రాశ్యాధిపతులు శుక్రుడు, బుధుడు. అధిదేవత కుమారస్వామి. ఆధిపత్యం చంద్ర దేవతను సూచిస్తోంది. పగడం రాయి పెట్టుకోదగినది. ఈ నక్షత్ర జాతకులు చండ్ర వృక్షాన్ని పెంచుకుంటే మంచిది. హోమం సమయంలోనూ చండ్ర సమిధలు వాడడం మంచిది. తమో గుణంతో ఉండటం వీరి లక్షణం.
మృగశిర  నక్షత్రం తొలి రెండు పాదాలు వృషభ రాశిలోనూ, చివరి రెండు పాదాలు మిథున రాశిలోనూ ఉంటాయి.
మృగశిర మొదటి పాదము
మృగశిర మొదటి పాదములో జన్మించిన వారు తమ సొంత పనుల వల్లే కార్యసిద్ధి పొందుతారు. అదృష్టానికి, దురదృష్టానికి వీరిదే బాధ్యత ఉంటుంది. అదే సమయంలో తమ వైఖరి వల్లనే నష్టపోతారు. మరికొన్ని విషయాల్లో వేచి చూసే ధోరణి ఉంటుంది. దీనివల్ల ఒక్కోసారి పుణ్యకాలం కాస్తా గడచిపోతుంది. విశాల దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు తారుమారైతే ప్రభావం పాములా మెడకు చుట్టుకుంటుంది. అటువంటప్పుడు ప్రశాంతంగా ఉండేలా ప్రయత్నించాలి. కోపంతో సమస్యలు మరింత పెరుగుతాయే తప్ప తగ్గవు. ఈ విషయాన్ని గ్రహించాలి.
మృగశిర తొలి పాదము గ్రహ దశలు
ఈ నక్షత్రమున రెండో పాదములో జన్మించిన వారికి ముందుగా.. కుజ మహర్దశ 7 సంవత్సరాలు ఉంటుంది, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, తర్వాత గురు 18 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, అనంతరం బుధ దశ 17సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు, శుక్ర దశ 10 సంవత్సరాలు ఉంటుంది.
మృగశిర రెండో పాదము
ఈ నక్షత్రములోని రెండో పాదమున జన్మించిన వారు.. చురుకుగా ఉండేలా ప్రయత్నిస్తారు. మొదలు పెట్టే పనులన్నింటిలోను మంచి ఫలితం ఆశిస్తారు. అయితే ఆశించిన ఫలితం అందకపోతే ఆందోళన చెందుతారు. ఆ అనవసర ఆందోళనతో మరిన్ని తప్పుల్లో పడే ఆస్కారం ఏర్పడుతుంది. తెలివితేటలు వినియోగించాల్సినచోట వాడకపోవడంవల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితులు రావచ్చు. ఇటువంటప్పుడు ఇబ్బందులు తలెత్తుతాయి. మెళకువతో వ్యవహరించి పరిస్థితుల్ని చక్కబెట్టుకుంటూ రావాలి.
మృగశిర రెండో పాదములో గ్రహ దశలు
ఈ నక్షత్రమున రెండో పాదమున జన్మించిన వారికి వరుసగా.. కుజ మహర్దశ ఐదేళ్ల తొమ్మిది నెలలు, తర్వాత రాహు 18 సంవత్సరాలు, గురు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు,  అనంతరం బుధ దశ 17 సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు, శుక్ర దశ 20 సంవత్సరాలు ఉంటుంది.
మృగశిర మూడో పాదము
మృగశిర మూడో పాదమున ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చే ముందు ఆలోచనల్లో మార్పు కనిపిస్తుంది. వాస్తవానికి దగ్గరి ఆలోచనలు ఉండవు. ఇదే సమయంలో ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. దీంతో నిర్ణయాలు ఆలస్యం అవుతుంటాయి. ఆందోళనలను దాచుకునేందుకు ఇష్టపడతారు. ఆర్థిక లావాదేవీల్లో రహస్యంగా ఉంటారు. దీనివల్ల ఒక్కోసారి ఇబ్బంది ఏర్పడవచ్చు. ఈ నక్షత్ర పాదములో జన్మించినవారికి జన్మతః కుజ మహర్దశ ఉండును.
మృగశిర మూడో పాదములో గ్రహ దశలు
జన్మించిన తర్వాత తొలి మూడున్నర సంవత్సరాలు కుజ మహర్దశ నడుస్తుంది. ఆ తర్వాత రాహు 18 సంవత్సరాలు, గురు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధ 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.
మృగశిర నాలుగో  పాదము
మృగశిర నాలుగో పాదములో జన్మించిన వారు సాధు స్వభావంతో ఉంటారు. అయితే పరిస్థితులు అదుపులో ఉండవు. నిర్ణయాలు తారుమారు అవుతూ ఉంటాయి. దీంతో ఆయా వ్యక్తులు ఇబ్బంది పడడమే గాక, మిగిలినవారు సైతం ఇబ్బందులకు లోనవుతూ ఉంటారు. ఓపికతో వేచిచూసే ధోరణి కనిపించదు. దీనివల్ల ఫలితాలు వచ్చే సమయంలో పరిస్థితులను మార్చుకుంటారు. అంతిమంగా అసహనానికి లోనయ్యే స్వభావం ఉంటుంది. నిలకడకోసం ప్రయత్నించే స్వభావం ఏర్పరచుకోవాలి.
మృగశిర నాలుగో పాదమున గ్రహ దశలు
జన్మించినప్పటి నుంచి సుమారుగా 21 నెలల పాటు కుజ మహర్దశ ఉంటుంది. ఆ తర్వాత రాహు 18 సంవత్సరాలు, గురు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధ 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.
మృగశిర నక్షత్రం గల వారి గుణగణాలు
ఈ నక్షత్రములో జన్మించిన వారు చురుకుగా ఉంటారు. వంశపారంపర్యంగా వచ్చే స్థిరాస్తులతో మృగశిర నక్షత్ర జాతకులు సకల భోగభాగ్యాలతో విలాసవంతంగా జీవిస్తారని శాస్త్రం చెబుతోంది. సంగీతంలో ప్రఖ్యాతి, ఉన్నత వ్యాపార సంస్థల్లో రాణించే వీరు అదృష్ట జాతకులని చెప్పవచ్చు.
అయితే ఏ విషయంలోనైనా తేలిగ్గా మారిపోయే స్వభావం కనిపిస్తుంది. ఆలోచనలు, నిర్ణయాలు వేగంగా మారిపోతాయి. నాయకత్వ స్థాయిలో ఉండేవారికి అవసరమైన స్థితప్రజ్ఞత ఉండదు. కానీ ఆచరణలో అమలు చేసేటప్పుడు ఎదురయ్యే ఇబ్బందులను లౌక్యంగా అధిగమించగలరు. ప్రతికూలతలను పదే పదే ఊహించుకోవడం మాత్రం ఇబ్బందికరం. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నిర్ణయాలు మారుతూ ఉంటాయి.
 దైవభక్తి అధికం కలిగిన వీరికి అనారోగ్యం జీవితానికి ఆటంకం కానేరదు. నరములు, కీళ్ల ఎముకలకు సంబంధించిన వైద్యంలో రాణిస్తారు. దేశ భక్తి, బంధుప్రీతి కలిగిన ఈ జాతకులకు ప్రేమ వివాహాలు లాభిస్తాయి. వస్తు నాణ్యతను చక్కగా నిర్ణయించే సత్తా వీరికుంటుంది. అయితే ఇతరులు చెప్పే విషయాలను ఏ మాత్రం పట్టించుకోరు. చెప్పుడు మాటలవు విని సజ్జనులను దూరం చేసుకుంటారు.
క్రమశిక్షణ, ప్రణాళిక ప్రకారం కార్యాచరణ చేయడం ద్వారా మృగశిర నక్షత్ర జాతకులు గొప్పగా రాణిస్తారు. దీర్ఘాయుషుతో, కీర్తి ప్రతిష్టలతో జీవించే మృగశిర జాతకులు శ్రీసుబ్రహ్మణ్యస్వామిని అర్చించడం వల్ల ఉన్నత స్థితికి చేరుకుంటారు.

Ardra

ఆరుద్ర నక్షత్రం – గుణగణాలు, ఫలితాలు
ఆరుద్ర నక్షత్రాన్ని పరమేశ్వరుని జన్మ నక్షత్రంగా ప్రతీతి. ఆధిపత్య దేవుడు పరమేశ్వరుడు. ఈ నక్షత్రానికి అధిపతి రాహువు. గోమేధికం రాయి పెట్టుకోదగినది. వీరు వస మొక్కలు పెంచుకోవాలి. దర్భ సమిధలతో హోమం చేస్తే మంచిది.
ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు మిథున రాశిలోనే ఉంటాయి.
ఆరుద్ర మొదటి పాదము
ఆరుద్ర మొదటి పాదములో జన్మించిన వారు అదృష్టంపైనే నమ్మకం పెట్టుకుంటారు. అదృష్టంతోనే నెగ్గుకు రావాలనే మనస్తత్వం. వస్తు, విషయ జాగ్రత్తలు ఎక్కువ. ఈ విషయంలో ఒక్కోసారి శృతిమించుతుంటాయి కూడా. దీని వల్ల ఇబ్బందులు తప్పవు. పారదర్శక వైఖరితో కలుపుకునే స్వభావం ఉంటుంది. లోకాన్ని పరిశీలించే స్వభావం ఉండటంతో అవకాశాలపై పట్టు నిలుపుకుంటారు. సంస్కృతి, సాంప్రదాయలపై, ఆచార వ్యవహారాలపై ఆసక్తి, శ్రద్ధ ఉంటుంది.
ఆరుద్ర మొదటి పాదములో గ్రహ దశలు    
ఈ పాదములో జన్మించినవారికి ముందుగా రాహు మహర్దశ 18 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.
 
ఆరుద్ర రెండో పాదము
ఆరుద్ర రెండో పాదములో జన్మించిన వారిలో పట్టుదల, తీక్షణత ఎక్కువగా ఉంటాయి. అంతిమ లక్ష్యం మీద దృష్టి పెడతారు. ఆలోచనల్లో భిన్నత్వాన్ని గుర్తించలేరు. దీంతో కోరి కష్టాలు తెచ్చుకుంటారు. పలు విషయాలందు ఆసక్తి ఎక్కువ. ఒక్కోసారి చేతులు కాల్చుకుంటారు. సమస్యలను గుర్తించటంలో ఇబ్బంది ఉంటుంది. మధ్యలో ఏర్పడే పరిణామాలతో కొంచెం గందరగోళానికి గురవుతారు.
ఆరుద్ర రెండో పాదములో గ్రహ దశలు    
రెండో పాదములో జన్మించినవారికి రాహు మహర్దశ 13 సంవత్సరాల ఆరు నెలలు ఉంటుంది. తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.
ఆరుద్ర మూడో పాదము
ఆరుద్ర మూడో పాదములో తరచూ సమస్యలు ఎదుర్కొంటారు. చురుకుదనం వల్ల ఒక్కోసారి హద్దు మీరుతుంది. దీంతో సమస్యలు ఎదుర్కొనక తప్పదు. వేగంతో ముందుకెళ్లబోయి తల బొప్పి కట్టించుకుంటారు. వాయుతత్వ స్వభావం ఉండటంతో నిర్ణయాల్లో నిలకడ లోపిస్తుంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. సర్దుకొనే స్వభావం ఉండటం కలిసి వచ్చే లక్షణం. కానీ సమస్యను నిజాయితీగా అర్థం చేసుకుంటేనే ఫలితముంటుంది.
ఆరుద్ర మూడో పాదములో గ్రహ దశలు   
మూడో పాదములో జన్మించినవారికి ముందుగా రాహు మహర్దశ 9సంవత్సరాలు, తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.
ఆరుద్ర  నాలుగో పాదము
ఆరుద్ర  నాలుగో పాదమున జన్మించిన వారు నిదానంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా లౌక్యం, చాకచక్యం మిగిలిన లక్షణాలను ప్రభావితం చేస్తాయి. దూరదృష్టితో వ్యవహరించాలి. నిలకడ సాధించడం కూడా ముఖ్యమే. నిదానమే ప్రధానం అన్న సూక్తి వర్తిస్తుంది. అందరిని కలుపుకుపోయే స్వభావం ఉంటుంది. దీంతోపాటు ఫలితాన్ని పంచుకొనే వైఖరికూడా అవసరం. అనవసరపు కోపానికి సంకెళ్లు వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అన్నింటా గెలిచి రావాలన్న వ్యూహాన్ని సమర్థంగా అమల్లో పెట్టాల్సి ఉంటుంది.
ఆరుద్ర  నాలుగో పాదములో గ్రహ దశలు 
నాలుగో పాదములో జన్మించిన వారికి ముందుగా రాహు మహర్దశ 4 సంవత్సరాల 6 నెలలు ఉంటుంది. తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.
ఆరుద్ర నక్షత్రము – గుణగణాలు
ఈ నక్షత్రములో జన్మించిన వారిది అనుకొన్న దానిని సాధించేదాకా నిద్రపోని తత్వం. మాటల్లో నేర్పరితనమును, మంచి జ్ఞాపకశక్తి ఉంటుంది. పట్టుదల కూడా ఉంటుంది. కార్యసాధనలో ఎన్నిసార్లు జారిపడినా పట్టు వదలక ఉన్నత స్థితికి వస్తారు. కీర్తియోగము వీరిని ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. డబ్బుల విషయంలో నిర్ణయాలు సరిగా ఉండవు. తప్పుడు సలహాలు, శక్తిసామర్ధ్యాలు, పగ తీఱ్చుకోవాలనే కోరిక, మొండి పట్టుదల జీవితంలో ఒడిదుదుకులకు దారి తీయవచ్చును. తొందరపాటుతో ముందు వెనుక మంచి-చెడు అనేవి చూడకుండనే నిర్ణయాలను వెంటనే అమలు పరుస్తారు. అవమానాన్ని ఓర్చుకొనలేరు.
ఆయుస్సు కూడా ఎక్కువే. ఆడవారిపట్ల గౌరవ భావం కలిగి ఉంటారు. మూకలని నమ్మించ కలిగిన ఆకట్టుకొనగలిగిన శక్తిని వీరు కలిగి ఉంటారు. ఎంత మంది వీడి వెళ్ళినా ఎనలేని శక్తి సామర్ధ్యాలతో మరల వీరు ఉన్నత స్థాయి సాధిస్తారు. వీరి వీరి బ్రతుకులలో ఏభై రెండు నుంచి 26 సంవత్సరాల వరకు చిక్కులు తక్కువగానే ఉంటాయి.
ఈ నక్షత్రము వారు ఆలోచనలు, నిర్ణయాలు చకచకా మార్చేసుకుంటారు. క్రయ విక్రయాలయందు ఆసక్తి ఉంటుంది. దీంతో వ్యాపారమందు దూసుకెళ్లే స్వభావం కనిపిస్తుంది. జాగ్రత్తగా వ్యవహరించకపోతే వీరితో పాటు వెంట ఉన్నవారికికూడా ఇబ్బంది తప్పదు.

Punarvasu

పునర్వసు నక్షత్రము-గుణగణాలు, ఫలితాలు
    పునర్వసు గురు గ్రహ నక్షత్రం, దేవగణ నక్షత్రం, రాశ్యాధిపతులు బుధుడు, చంద్రుడు. అధిదేవత అధితి, పురుష జాతి. పునర్వసు నక్షత్రం మొదటి మూడు పాదాలు మిధున రాశిలోనే ఉంటాయి. నాలుగవ పాదము కర్కాటక రాశిలో ఉంటాయి.
పునర్వసు నక్షత్రమున ఏ పాదంలో జన్మించినా దోషమనేది లేదు. ఎక్కువ శాతం శుభకరమనే చెప్పాలి. ఈ నక్షత్రంలో అమ్మాయి జన్మిస్తే.. ఆమె శాంత స్వభావంతో, బంధువులయందు అమితమైన అభిమానం చూపుతుంది. ఓర్పు ఉంటుంది. ధర్మకార్యాలు చేసేదిగా అవుతుంది. క్రమంగా ఆమె ధనవంతురాలు అవుతుంది. ఇక అబ్బాయి జన్మిస్తే సౌందర్యవంతుడు. శ్రమకు ఓర్చుకునేవాడు అయి ఉంటాడు. అయితే అతడు అల్పసంతోషి, తొందర పాటు ప్రవర్తన కలిగి ఉంటాడు.
ఈ నక్షత్ర జాతకులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. సువర్ణం, ఆయుర్వేదం, ఎగుమతి వ్యాపారాలు కలసి వస్తాయి. సౌకర్యవంతమైన ఉద్యోగాలలో స్థిరపడతారు.
పునర్వసు నక్షత్రము గుణాగణాలు
జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించగలిగిన వ్యక్తిగా, వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా, స్వయం శక్తి కలిగిన వ్యక్తిగా సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.
ఇక ఈ నక్షత్ర జాతకులు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోరు. అయితే అత్యవసర సమయంలో ఇతరులను ఆదుకునే తత్వం ఉంటుంది. సొంత పనులకంటే ఇతరుల పనులకు సహాయపడే పనికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. ధనుర్విద్య, తుపాకితో కాల్చడం వంటి అలసట కలిగించే విద్యలయందు ఆసక్తి అధికం. అభిప్రాయాలు, మటలు స్పష్టంగా ఉంటాయి. పరపతి బాగా ఉంటుంది. సమాజంలో ఉన్నత వర్గానికి నాయకత్వం వహిస్తారు. పరపతి బాగా ఉపయోగపడుతుంది. పరిచయాలను కార్య సిద్ధికి ఉపయోగించుకుంటారు.
వివాహ జీవితములో తలెత్తిన భేదాభిప్రాయాలను ప్రాధమిక దశలోనే సర్ధుబాటు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. చెప్పిందే పదే పదే చెప్పడం, అతి జాగ్రత్తలు, ఇతరులను అధికంగా నమ్మి కార్యభారము అప్పగించ లేని స్థితి వీరిని పిరికి వారుగా భావించే అవకాశం ఉంది.
బాల్యం సుఖవంతంగానే గడుస్తుంది. అయితే క్రమంగా సమస్యల వలయములో చిక్కుకుంటారు. 40 నుండి 70 సంవత్సరాల తరువాత సమస్యల నుంచి బయట పడి సుఖ జీవితం కొనసాగించే అవకాశము ఉంది.

Pushyami

పుష్యమి నక్షత్రం – గుణగణాలు, ఫలితాలు

నక్షత్రములలో పుష్యమి 8వ నక్షత్రము. పుష్యమి నక్షత్రాధిపతి శని. గణము దేవగణము. అధిదేవత బృహస్పతి.

పుష్యమి నక్షత్రము మొదటి పాదము
పుష్యమి నక్షత్రము మొదటి పాదములో జన్మించిన జాతకులు నవరత్నాల్లో నీల రత్నాన్ని ధరించాలి. పుష్యమి తొలి పాదములో జన్మించిన జాతకులకు 19 సంవత్సరాల కాలం పాటు శని మహర్దశ జరగడంతో నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించాలి. 36 సంవత్సరాల నుంచి 43 సంవత్సరాల వరకు కేతు మహర్దశ కావున వైఢూర్యమును వెండితో చిటికెన వేలుకు ధరించడం మంచిది. అలాగే 43 సంవత్సరాల నుంచి 63 సంవత్సరాల వరకు ఈ జాతకులకు శుక్ర మహర్దశ. వజ్రమును బంగారంతో ఉంగరపు వ్రేలుకు ధరించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, ఈతిబాధలు తొలగిపోవడం వంటి శుభ ఫలితాలుంటాయి.

63 నుంచి 69 సంవత్సరాల వరకు ఈ జాతకులకు రవి మహర్దశ.. కాబట్టి కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. ఇదేవిధంగా 69 నుంచి 79 సంవత్సరాల వరకు చంద్ర మహర్ధశ ఉంటుంది కాబట్టి ముత్యమును వెండితో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించాలి. అలాగే 79 సంవత్సరాల నుంచి 86 సంవత్సరాల వరకు ఈ జాతకులకు కుజ మహర్దశ కావడంతో పగడమును బంగారముతో ఉంగరపు వ్రేలికి ధరించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి.

ఈ జాతకులు సత్ప్రవర్తన కలిగి ఉంటారు. వీరికి హైస్కులు వరకు చదువు మందకొడిగా సాగుతుంది. అయినా ప్రయత్నా పూర్వకంగా పైచదువులు కొనసాగిస్తే చక్కని ఫలితాలు సాధిస్తారు. ఉన్నత ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. 35 ఏళ్ల అనంతరం వచ్చే కేతు దశలో  వీరికి సమస్యలు ఉన్నా కేతువు అనుకూలంగా ఉన్నట్లయితే విదేశాలలో ఉద్యోగం చేసే అవకాశం కూడా ఇస్తుంది. కేతు దశ 7 సంవత్సరాల అనంతరం వచ్చే 42 సంవత్సరాలలో వచ్చే శుక్ర దశలో వీరు అత్యున్నత స్థానానికి చేరుకుంటారు. ఇనుము, అగ్ని సంబంధిత వృత్తి  ఉద్యోగ వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. అంతేకాదు వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. శుక్ర దశ నుంచి వీరికి సౌఖ్యవంతమైన జీవితం కొనసాగుతుంది.

పుష్యమి నక్షత్ర  రెండవ పాదము
పుష్యమి నక్షత్ర 2 వ పాదం లోని జాతకుల జీవితం సాఫీగా సాగిపోతుంది. సకాలంలోనే జీవితంలో స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలో జరుగుతుంది. 30 సంవత్సరాల వయసులో కేతుదశలో కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. కేతువు అనుకూలంగా ఉంటే విదేశాలలో ఉద్యోగావకాశాలు కలుగవచ్చు. శుక్ర దశ వీరికి సౌఖ్యవంతమైన జీవితం ఇస్తుంది. మిగిలిన జీవితం సాఫీగా జరుగుతుంది. ఇంజనీరు, లాయరు వంటి వృత్తి ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. విద్యలో ప్రతిభ సాధించి జీవితంలో సకాలంలో ఉన్నత స్థితి చేరుకుంటారు. మేధస్సును ఉపయోగించే ఉద్యోగావ్యాపారాలు చేస్తారు. ఉన్నత ఉద్యోగాలు కూడా వీరికి అనుకూలం. ఇనుము, భూమి సంబంధిత ఉద్యోగం, వ్యాపారం, వృత్తులు వీరికి అనుకూలం.

పుష్యమి నక్షత్ర మూడవ పాదము
పుష్యమి నక్షత్రము 3 వ పాదం నక్షత్ర అధిపతి శని. కనుక వీరి మీద శుక్ర శని గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు దేవ గుణ  ప్రధానులు కనుక సత్ప్రవర్తన కలిగి ఉంటారు. 6 సంవత్సరాల వరకు విద్యారంభం కొంచెం మందకొడిగా ఆరంభం అయినా తరువాత వచ్చే బుధ దశ 17 సంవత్సరాల కాలంలో విద్యలో అభివృద్ధి సాధిస్తారు. విద్య  నిరాటంకంగా విజయవంతంగా సాగుతుంది. విద్య ముగియగానే జీవితంలో స్థిరపడవచ్చు. 23 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కారణంగా వివాహంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వివాహానంతరం 30 సంవత్సరాలలో వచ్చే శుక్రదశ కారణంగా సౌఖ్యమైన జీవితం ఆరంభం అవుతుంది. జీవితంలో ఉన్నత స్థితి సాధిస్తారు. జీవితం సాఫీగా జరిగి పోతుంది. కేతుదశ అనుకూలంగా ఉంటే వీరికి విదేశాలలో ఉద్యోగావకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మిగిలిన జీవితం వీరికి సాఫీగా సాగిపోతుంది. సముద్ర సంబంధిత, నుకా సంబంధిత, జల సంబంధిత వృత్తి ఉద్యోగాలు వీరికి అనుకూలం. ఇనుము, ముత్యం, తెల్లని వస్తువుల వ్యాపారం వీరికి అనుకూలం. న్యాయవాదులుగా వీరు రాణిస్తారు. నౌకా సంబంధిత ఉద్యోగాలు  కూడా వీరికి అనుకూలమే.

పుష్యమి నక్షత్ర నాలుగవ పాదము
పుష్యమి నక్షత్ర 4 వ పాదం   నక్షత్ర అధిపతి శని. వీరి మీద  కుజ శనిగ్రహ ప్రభావం  ఉంటుంది. వీరు అనుకుది పట్టుదలతో సాధిస్తారు. వీరికి ధైర్యసాహసాలు అధికంగా ఉంటాయి. ఉద్యమాలు వంటి వాటిలో వీరు ముందుంటారు. రెండు సంవత్సరాల తరువాత 17 సంవత్సరాల కాలం బుధదశ వస్తుంది కనుక వీరు ఉన్నత విద్యాభ్యాసం వరకు చదువులో రాణిస్తారు. తరువాత 7 సంవత్సరాల కేతదశ కారణంగా  ఉన్నత విద్యను   కొన్నిఆటంకాలను ఎదుర్కొంటూ ప్రయత్నపూర్వకంగా పూర్తి చేయవలసిన అవసరం ఉంది. ప్రయత్నిస్తే తప్పక ఆటంకాలను అధిగమించవచ్చు.

కేతువు అనుకూలంగా ఉన్న వారు బయట ఊర్లలో లేక విదేశాలలో విద్యాభ్యాసం చేయగలుగుతారు. విద్య పూర్తి చేయగానే జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో స్వల్పంగా జాప్యం ఉంటుంది. వైమానిక దళంలో ఉద్యోగాలు చేయడంలో ఆసక్తి ఉంటుంది. వ్యవసాయం వంటి వృత్తులు చేయడంలో ఆసక్తి కలిగి ఉంటారు. 28 సంవత్సరాలలో శుక్రదశ  వస్తుంది కనుక జీవితంలో త్వరగానే అభివృద్ధి సాధిస్తారు. తరువాత వీరికి జీవితం ఒడిదుడుకులు లేకుండా జరిగిపోతుంది. సైనిక, భూమి, ఇనుము సంబంధించిన ఉద్యోగ, వ్యాపారాలు వీరికి అనుకూలం.

పుష్యమి నక్షత్రము గుణగణాలు

శనిగ్రహ నక్షత్రమైన పుష్యమిలో జన్మించిన జాతకులు బాల్యం నుంచి యవ్వనం వరకు కష్టపడి జీవితంలో అభివృద్ధి సాధిస్తారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ ఆలోచనలు చేయకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ఈ జాతకుల ప్రత్యేక లక్షణం. మంచి విషయాలకు ప్రాధాన్యమిచ్చి, ఇతరుల చెడు ప్రవర్తనను ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా మాట్లాడేతత్వం కలిగి ఉంటారు. వీరికి ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి.

యవ్వనం నుంచి వీరి జాతకం అదృష్టానికి దగ్గరగా ఉంటుంది. యవ్వనం వచ్చినప్పటి నుంచి వృత్తి ఉద్యోగాలకు ఎంపికకవుతారు. వీరి జీవితం వివాహ అనంతరం గాడిలో పడుతుంది. మంచి అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. స్వార్జితముగా వృద్ధిలోకి రాగలరు. కుటుంబ విషయములో ఇతర కుటుంబ సభ్యుల ప్రోత్సాహము తక్కువగా ఉంటుంది . స్నేహితులు మరియు సన్నిహితుల ప్రోత్సాహము , సహకారము వలన వీరు జీవితమున అత్యున్నత స్థాయికి చేరుకొంటారు .

వీరి వైవాహిక జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. అయితే వ్యాపారంలో తలెత్తే ఇబ్బందులు తొలగిపోవాలంటే, శనీశ్వరునికి నెలకోసారి తైలాభిషేకం చేయించాల్సి ఉంటుంది. ప్రతి శనివారం నువ్వులతో దీపమెలిగించడం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి.

ఇక సోమవారం, బుధవారం, ఆదివారాల్లో ఈ జాతకులు చేపట్టే కార్యములన్ని విజయవంతమవుతాయి. అయితే గురువారంలో కొత్త పనులు ప్రారంభించకూడదు.

Ashlesha

అశ్లేష నక్షత్రం – గుణగణాలు, ఫలితాలు

ఆశ్లేష నక్షత్రం గణము రాక్షస గణము. అధిదేవత పాము. రాశ్యాధిపతి చంద్రుడు. నక్షత్రాధిపతి బుధుడు.  
ఆశ్లేష నక్షత్ర మొదటి పాదము 

ఆశ్లేష నక్షత్ర మొదటి పాదం అధిపతి బుధుడు.అంసాదిపతి గురుడు  కనుక వీరి మీద  గురు, బుధగ్రహ ప్రభావం ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులకు విద్యా సంబంధిత ఉద్యోగాలలో వీరికి ఆసక్తి ఉంటుంది. మేధా సంబంధిత ఉద్యోగాలలోనూ వీరు బాగా రాణించగలరు. విద్యాసంస్థలు స్థాపన, నిర్వహణలో వీరు సమర్థులు. వీరికి నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది. వీరు విద్యారంభంలోనే ప్రతిభను ప్రదర్శిస్తారు. 15 సంవత్సరాల సమయంలో హైస్కూల్ చదువు పూర్తి చేసే సమయంలో ఏడు సంవత్సరాల కేతుదశ కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. అయినప్పటికీ ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమిస్తే తప్పక విజయం సాధిస్తారు.

కేతువు అనుకూలంగా ఉన్న వారు సొంత ఊరికి దూరంగా (బయట ఊర్లలో లేక విదేశాలలో) విద్యాభ్యాసం చేయగలుగుతారు. తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా విద్య పూర్తి  కాగానే జీవితంలో స్థిరపడతారు.  వీరు చిన్న వయసులోనే జీవితంలో స్థిరపడతారు. భూ, విద్యా, ఆభరణ సంబంధిత ఉద్యోగం, వ్యాపారం, వృత్తులు వీరికి అనుకూలిస్తాయి. తరువాత వీరికి జీవితం సాఫీగా జరిగిపోతుంది.

ఆశ్లేష నక్షత్ర రెండవ పాదము

ఆశ్లేష నక్షత్ర రెండవ పాదము అధిపతి బుధుడు. అంసాదిపతి శని కనుక వీరి మీద బుధ,శని  గ్రహ ప్రభావం ఉంటుంది. వీరువ్యాపారం అంటే ఇష్టపడతారు. బుధ గ్రహ ప్రభావం కారణంగా మేధో సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఇనుము సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు కూడా అనుకూలిస్తాయి. 11 సంవత్సరాల వయసులో హైస్కులు విద్య ముందే  వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా వీరికి కొన్ని ఆటంకాలు ఎదురౌతాయి. ప్రయత్నా పూర్వకంగా వాటిని అధిగమించి విజయం సాధించవచ్చు.18 సంవత్సరాల వయసులో శుక్ర దశ మొదలవుతుంది. ఉన్నత విద్యాభ్యాస కాలంలో మనసు విలాసాల వైపు మళ్లే అవకాశం.. కనుక ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి. విద్య పూర్తికాగానే జీవితంలో స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. మిగిలిన జీవితం 51 సంవత్సరం వరకు వీరికి సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల కలం సాగే రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి. రాహువు అనుకూలంగా ఉంటే  విదేశీవాసం, విదేశీయాత్ర చేయడానికి అవకాశం కూడా ఉంది. వృద్ధాప్యం ఇబ్బందులు లేకుండా సాఫీగా జరుగుతుంది.

ఆశ్లేష నక్షత్ర మూడవ పాదము
ఆశ్లేష నక్షత్ర మూడవ పాదము అధిపతి బుధుడు. అంసాదిపతి శని కనుక వీరి మీద బుధ శని గ్రహ ప్రభావం ఉంటుంది. వీరికి వ్యాపారం అంటే ఇష్టం. బుధగ్రహ ప్రభావం కారణంగా మేధో సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. వీరు స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. శ్రమించి పనిచేసే గుణం కలిగి ఉంటారు. వీరికి వ్రుత్తి, వ్యాపారం, ఉద్యోగాల మీద సమానంగా ఆసక్తి ఉంటుంది. మేధో సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఇనుము సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు కూడా వీరికి అనుకూలిస్తాయి. విద్యా ఆరంభంలోనే ఆటంకాలు ఎదురౌతాయి. వాటిని అధిగమించి ముందుకు సాగవలసిన అవసరం ఉంది.

ఏడు సంవత్సరాల వయసులో వచ్చే ఏడు సంవత్సరాల కేతుదశ కారణంగా విద్య లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. 14 సంవత్సరాలకే శుక్రదశ వస్తుంది కనుక కళాశాల చదువుల కాలంలో విద్య కంటే అలకరణ అంటేనే ఇష్టముంటుంది. కనుక ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మనసును మళ్ళించి విద్యాభ్యాసం పూర్తి చేయాలి. విద్యాభ్యాసం పూర్తి కాగానే జీవితంలో స్థిరపడతారు. సకాలంలో పెళ్లి జరిగే అవకాశాలు ఉంటాయి. 34 సంవత్సరాల వరకు సాగిన సౌఖ్యవంతమైన జీవితంలో తరువాత కొంత సౌఖ్యం తగ్గినా జీవితం సాఫీగా జరిగిపోతుంది.

ఆశ్లేష నక్షత్ర నాలుగవ పాదము

ఆశ్లేష నక్షత్ర నాలుగవ పాదం అధిపతి బుధుడు. అంసాదిపతి గురువు. ఆశ్లేష నక్షత్ర బుధుడు. వీరి మీద గురు బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. విద్యాసంబంధిత ఉద్యోగాలలో వీరికి ఆసక్తి ఉంటుంది. మేధా సంబంధిత ఉద్యోగాలలో రాణించగలరు. విద్యా సంస్థలు స్థాపన, నిర్వహణ వీరు సమర్ధవంతంగా చేస్తారు. వీరికి నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది. వీరు విద్యారంభంలోనే మూడు సంవత్సరాల నుండి వచ్చే ఏడు సంవత్సరాల కేతుదశ కారణంగా విద్యారంభంలో ఆటంకాలను ఎదుర్కొంటారు. వాటిని అధిగమించి ముందుకు సాగవలసిన అవసరం ఉంది. తరువాత 10 సంవత్సరాలకు వచ్చే శుక్రదశ కారణంగా విద్య కంటే అలకరణ అంటే మక్కువ ఎక్కువగా ఉంటుంది. కనుక ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మనసును మళ్ళించి విద్యాభ్యాసం పూర్తి చేసి విజయం సాధించవలసిన అవసరం ఉంది.
నాలుగవ పాదములో జన్మించిన వారు కూడా విద్యాభ్యాసం పూర్తికాగానే జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. 30 సంవత్సరాల వరకు సాగిన సౌఖ్యవంతమైన జీవితంలో తరువాత కొంత సౌఖ్యం తగ్గినా జీవితం సాఫీగా జరిగి పోతుంది. 53 సంవత్సరాల అనంతరం వచ్చే రాహు దశ కాలమో కొన్ని సమస్యలను ఎదుర్కోనవలసిన అవసరం ఉంది. రాహు దశ అనుకూలిస్తే విదేశీయానం చేసే అవకాశం ఉంటుంది. వృద్ధాప్యం సౌఖ్యవంతంగా జరిగిపోతుంది.

ఆశ్లేష నక్షత్ర జాతకుల గుణగణాలు
ఆశ్లేష నక్షత్ర జాతకులు ఏ విషయంలోనైననూ పట్టుదల కలిగి ఉంటారు. వీరి పట్టుదల వీరిని ఉన్నత స్థితికి తీసికొని పోతుంది. శతృవుల విషయంలో పగతో ఉంటారు. వీరికి రాజకీయాలపై ఆసక్తి ఉంటుంది. వర్గ రాజకీయాలను సమర్ధతతో నడపగలరు. ప్రజా జీవితములో మంచి పేరు తెచ్చుకుంటారు. అడ్డంకుల నడుమ వీరి చదువులు కొనసాగుతాయి, ఏది ఏమి అయిన సరే వీరు ఆయా అడ్డగింపులని దాటి పై చదువులను పూర్తి చేస్తారు.  న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. వీరు ఉద్యోగ, వ్యాపార రంగాలలో రాణించగలరు. కష్టపడి సుఖజీవితాన్ని అలవరచుకున్నా పొరపాటుగా ఉండే ఊహాల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. స్త్రీల వలన పెద్దల వలన జీవితములో ఇబ్బందులకు గురవుతారు.

నమ్మకము లేని వ్యక్తులతో సహజీవనము సాగిస్తారు. ఉద్యోగములో నిపుణత సాధిస్తారు. ఉన్నతాధికారుల వలన, ఉన్నత స్థాయిలో ఉన్న వారి వలన ఇబ్బందులు ఎదురౌతాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో ఓర్పు వహిస్తారు. లక్ష్యసాధన కొరకు ఎంత కాలమైనా ఎదురు చూస్తారు. వయసు గడిచే కొద్దీ సుఖమయ జీవితానికి చేరువవుతారు. నమ్మకద్రోహులు స్నేహితులుగా ఉండడం దురదృష్టముగా పరిణమిస్తుంది. స్థిరాస్థులు దక్కించుకోగలుగుతారు. వీరికి ఆయుర్వేద మందులు, బియ్యం, పాల వ్యాపారం, పెట్రోలు బంకులు, బట్టల వ్యాపారము లాభిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు.

Magha

మఖ నక్షత్రం – గుణగణాలు, ఫలితాలు

మఖ నక్షత్ర అధిపతి కేతువు. మేషరాశి అధిపతి కుజుడు. ఇది రాక్షసగణ నక్షత్రం. నక్షత్రాధిపతి సూర్యుడు. మఖ నక్షత్రము నవాంశ విషయానికి వస్తే.. మొదటి పాదములో మేష రాశి ఉంటుంది. రెండవ పాదములో వృషభ రాశి, మూడవ పాదములో మిధున రాశి, నాలుగవ పాదములో కర్కాటక రాశి ఉంటుంది.

మఖ నక్షత్ర మొదటి పాదము
కుజుడి ప్రభావం వీరిని మరింత ప్రభావితం చేస్తుంది. అనుకున్న కార్యం వీరు అనుకున్నంత వేగంతోనే పూర్తిచే స్తారు. కేతు గ్రహ ప్రభావంతో వీరికి ఆద్యాత్మిక చింతన ఉంటుంది. ఏ కార్యమైనా  దైవ నమ్మకంతో పూర్తి చేస్తారు. రాజ్యాంగ సంబంధిత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. భూ సంబంధిత వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.

బాల్యంలోనే శుక్ర దశ రావడంతో వీరికి విద్య మీద కంటే అలంకరణ సౌందర్య పోషణ మీద ఆసక్తి చూపిస్తారు. ఈ సమయంలో మనసును విద్య వైపు మళ్ళించి విద్యాభ్యాసం విజయవంతంగా పూర్తి చేయవలసిన ఉంటుంది. 26 సంవత్సరాల వరకు జీవితం సుఖ సౌఖ్యాలతో సాగుతుంది. తరువాత కొంత సుఖం తగ్గినా జీవితం సాఫీగా జరిగిపోతుంది. 49 సంవత్సరాల తరువాత వచ్చే రాహుదశ కొన్ని సమస్యలను తీసుకువచ్చే అవకాశం ఉంది. 18 సంవత్సరాల రాహుదశ అనంతరం వచ్చే గురు దశ కారణంగా 67 సంవత్సరాల తరువాత జీవితం తిరిగి గాడిలోకి పడుతుంది. వృద్ధాప్యం ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగిపోతుంది.

మఖ నక్షత్ర రెండవ పాదము
వీరికి స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి. ఒక సారి ఏర్పరచుకున్న అభిప్రాయాలు అంత త్వరగా మార్చుకోలేరు. అలంకరణ వస్తువుల సేకరణ అంటే విపరీతమైన ఆసక్తి కనబరుస్తారు. బాల్యంలో వచ్చే శుక్రదశ కారణంగా కళారంగం అబ్బుతుంది. ఈ రంగంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. కళా సంబంధిత వృత్తి,  ఉద్యోగాలు, వ్యాపారం వీరికి అనుకూలిస్తాయి.

ఈ జన్మ నక్షత్రంలోని రెండవ పాదము వారికి 24  సంవత్సరాల వరకు సౌఖ్యవంతమైన జీవితం సాగుతుంది. ఆ తరువాత కొంత సుఖం కాస్త తగ్గినా 47 సంవత్సరాల వరకు సాఫీగా సాగిపోతుంది. తరువాత 18 సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురైనా 65 సంవత్సరాల తరువాత జీవితంలో సౌఖ్యం తిరిగి మొదలవుతుంది. వృద్ధాప్యం సౌఖ్యవంతంగా జరిగి పోతుంది.

మఖ నక్షత్ర మూడవ పాదము

వీరు స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. కనుక వీరు ఒక్కసారి ఏర్పరచుకున్న అభిప్రాయాలు అంత త్వరగా మార్చుకోలేరు. మేధో సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. భూ సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి.

కేతు గ్రహ ప్రభావం వలన వీరు అత్యంత ఆధ్యాత్మికత కలిగి ఉంటారు. వీరికి వ్యాపార, ఉద్యోగాల, వ్యవసాయం మీద సమానమైన ఆసక్తి ఉంటుంది. మూడవ పాదములో జన్మించిన వారికి కూడా చిన్న వయసులో శుక్రదశ కారణంగా విద్య కంటే సౌందర్య పోషణ, సౌఖ్యవంతమైన జీవితం మీద ఆసక్తి ఉంటుంది. ప్రయత్న పూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించవలసిన అవసరం ఉంది. 22 సంవత్సరాల వరకు శుక్రదశ ఉంటుంది కనుక జీవితం అప్పటి వరకు సౌఖ్యవంతంగా సాగుతుంది. తరువాత కాస్త సౌఖ్యం తగ్గినా 45 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది.

తరువాత 18 ఏళ్ల రాహుదశ కారణం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ 63 ఏళ్ల కాలంలో సమస్యలు తగ్గు ముఖం పట్టి తిరిగి సుఖసంతోషాలు మొదలవుతాయి. దీంతో వృద్ధాప్యం సాఫీగా సాగిపోతుంది.

మఖ నక్షత్ర నాలుగవ పాదము
వీరికి పట్టుదల అధికం. వీరికి తల్లి అంటే అభిమానం అధికంగా ఉంటుంది. కేతు గ్రహ ప్రభావం వల్ల వీరికి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వీరికి పాలు, పాల ఉత్పత్తులు, బియ్యం, ముత్యం, కాగితం, ఔషధ తయారీ విక్రయం వంటి వృత్తులు, ఉద్యోగాలు వ్యాపారాలు అనుకూలిస్తాయి.

వీరికి 21 ఏళ్ల వరకు శుక్ర దశ ఉండటంతో జీవితం అప్పటి వరకు సాఫీగా సాగుతుంది. తరువాత కొంచెం సాఫీగా తగ్గినా 44 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత 18 సంవత్సరాల రాహుదశ కారణంగా  కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ, 62 సంవత్సరాల సమయంలో సమస్యలు తగ్గు ముఖం పట్టి తిరిగి సుఖ సంతోషాలు చోటు చేసుకుంటాయి. కనుక వృద్ధాప్యం సంతృప్తిగా జరిగిపోతుంది.

మఖ నక్షత్రము గుణగణాలు

ఈ నక్షత్ర జాతకులకు ఆధ్యాత్మిక భావం అధికంగా ఉంటుంది. కేతువు ఆధిపత్యము, రాక్షస గనముల చేరిక కారణముగా పట్టుదల, ప్రతీకారము వంటివి అధికము. వీరికి పొదుపు చేసే గుణం ఉంటుంది. జీవితంలో అభద్రతా భావం ఉంటుంది. ఈ నక్షత్రాధిపతి సూర్యుడు కావడము వలన ఈ రాశి వారికి ఆధిపత్య గుణము ఎక్కువే. మంచి మనుషులుగా పేరుతెచ్చుకునే ఈ నక్షత్ర జాతకులు సౌమ్యులుగా ఉంటారు. వీరికి గృహోపయోగం, విదేశీయాన యోగం మొదలైనవి కలిసి వస్తాయి. జీవితంలో ఎలాంటి లోటు వీరికుండదు.

వీరు ఇతరుల సొమ్మును ఆశించే రకం కాదు. ఉదయం నుంచి రాత్రి వరకు అనుక్షణం శ్రమించే నైజం ఉంటుంది. అయితే.. నిద్రలేమిని మాత్రం భరించలేరు. జరిగిన పోయిన సంఘటనలను అంత సులువుగా మరిచిపోరు. అప్పుడప్పుడు వాటిని తలచుకుని బాధపడతారు. ఇక ఇతరులు ఆపదలో ఉన్నారంటే వారికి ముందు జాగ్రత్తలు చెబుతారు. కానీ ఆపద వస్తే మాత్రం ఆదుకునే స్థితిలో ఉండరు.

ఈ నక్షత్ర జాతకులకు ఆదివారం కలిసి వస్తుంది. బుధవారం, శనివారం సామాన్య ఫలితాలు కలుగుతాయి. మంగళవారం మాత్రం ఎలాంటి కార్యాన్ని ప్రారంభించ వద్దు. వీరి అదృష్ణ సంఖ్యలు 1, 4. ఎరుపు రంగు ఈ జాతకులకు శుభ ఫలితాలను అందిస్తాయి.