Menu

Monthly Archives: June 2015

Subhayogaas

Shubhayogas

శుభ యోగములు

జ్యోతిష్య శాస్త్రంలో అనేక యోగాలు ఉన్నాయి. రాశి, అంశ చక్రాలలో ఉన్న గ్రహస్థానలను పరిశీలిస్తూ ఈ యోగాలు ఉంటాయి. యోగాలను అనుసరించి శుభయోగములను, అవయోగములను విపులంగా చర్చించబడింది. ఈ యోగములు శుభాశుభ గ్రహములు తామున్న రాశుల స్థితిని బట్టి గ్రహముల కలియికను బట్టి దృష్టిని బట్టి ఏర్పడతాయి. దాని వల్ల వాటి బలములను అనుసరించి యోగముల బలములు నిర్ణయించాలి.

భాగ్య యోగము
భాగ్య స్థానమును అనగా లగ్నం నుంచి 9వ ఇంట శుభ గ్రహము ఉన్నానూ లేదా శుభ గ్రహం చూసినానూ.. ఆ భాగ్యధిపతి తన స్వ, మిత్ర, ఉచ్చ స్తానములో ఉన్న కూడా ఈ భాగ్య యోగం కలుగుతుంది. ఈ యోగమున జన్మించిన వాడు శాశ్వత ఐశ్వర్యవంతుడు, రాజ పూజితుడు, ధర్మమార్గపరుడు స్వకులాచార తత్పరుడు మొదలగు శుభ గుణములు కలిగి వుండును.

పారిజాత యోగము
లాభ స్థానమున (లగ్నము నుంచి 11వ భావమున) శుభగ్రహ ఉంటే ఆ స్థానమును శుభగ్రహము చూసినా, లేదా లాభాధిపతి స్వ, మిత్ర ఉచ్చ క్షేత్రమునందున్ననూ ఈ యొగము కలుగును. విపరీత రాజయోగముగా చెప్పుకునే ఈ యోగము చాలా అరుదుగా జాతకములలో కనిపించును. లగ్నాధిపతి ఉన్న రాశ్యాధిపతి, ఆ రాశ్యాధిపతి ఉన్న లగ్నాధిపతి, లేదా లగ్నాధిపతి ఉన్న రాశ్యాధిపతి, రాశ్యాధిపతి ఉన్న నవాంశాధిపతి కేంద్రములందు కానీ కోణమందుకాని, ఉచ్చస్థితిపొంది దిగ్బలము పొంది ఉండాలి. ఇట్టి జాతకులు బాల్యంలో సాధారణ జీవితంతో ప్రారంభించి తరువాతి కాలంలో మధ్య వయసు నుంచి అపారమైన గౌరవం, ప్రభువులతో, ధనికులతో సకల మర్యాదలు పొందినవారు, విశేష ధన, వాహనములు, ప్రబల కీర్తి కలిగి ఉందురు.

త్రిలోచనయోగము
త్రిలోచనయోగములో ఆయుర్దాయము, శత్రువులపై విజయము, వంటి శుభ ఫలములతో, పాటు సంపద కీర్తి మేధాశక్తి కలిగి ఉందురు. రవి చంద్ర, కుజులు ఒకరికొకరు కోణములలో ఉండును. దీనివల్ల వీరి జీవితం ఏ ఒడుదొడుగులు లేకుండా నల్లేరు మీద బండి వలె సాఫీగా సాగును. ఇదియు నొక శుభయోగమే.

ఖ్యాతి యోగము
లగ్నము నుంచి దశమ స్థానమందు శుభ గ్రహము ఉంటే, శుభ గ్రహ వీక్షణ కలిగినను, దశమాధిపతి తన స్వ, మిత్ర, ఉచ్చ స్థానంలో ఉంటే,  ఈ యోగము కలుగును. ఈ జాతకులు ధన, మిత్ర, సతీ సుతులతో, సకల సంపదలు కలిగి ప్రజాదరణ, కీర్తి ప్రతిష్టలు కలుగును.

గజకేసరి యోగము
గురుడు లగ్నము నుంచి కానీ చంద్రుని నుంచి కానీ కేంద్రంలో ఉంటే గజకేసరి యోగం అవుతుంది. ఈ గురుడు నీచను పొందక, అస్తంగతుడు కాక, శతృ క్షేత్ర స్థితిని పొందక, మరొక శుభ గ్రయుపతిగానీ వీక్షణ గాని పొంది ఉండాలి. ఇక ఈ యోగము శుభ ఫలితములిచ్చును. జాతక చక్రములో గురు, చంద్రుల ఉనికి వలన ఈ యోగము ఏర్పడుతుంది. చంద్రుని నుంచి గురుడు కేంద్రముల యందు ఉన్నప్పుడు అనగా గురుడు 4, 7, 10 స్థానములలో వున్నప్పుడు ఈ యోగబలము 4 కన్నా 7 లోనూ, 7 కన్నా 10 లోను అధికముగా వుంటుంది. ఈ యోగముల వారు సభ్యత, ఉదారము, సంపద, దానగుణము, ఉన్నతాధికారము మొదలగు సకల శుభ లక్షణములు కలిగి ఉందురు. గురు చంద్రుల బలములు, గురుడు చంద్రుని కంటే ఎక్కువ బలం పొందిన ఆ జాతకులు విశేష ధన కీర్తి, సుఖమయ జీవితం జీవితాంతం గడపగలరు.

ఈ యోగములలొ ఉన్న సర్వ శుభములు కనుపించుటకు ఆ గ్రహములన్ని అస్థంగత దోషం లేకుండా ఉండాలి. ఆ గ్రహములకు షడ్బలము దిగ్మలము కలిగి ఉండవలెను.

Gruha Santhi – Dosha Nivarana

గృహ శాంతి - దోషాలు నివారణ

గృహ శాంతి – దోష నివారణ

గృహమే కదా స్వర్గసీమ అన్నారు. మానవుడిపై అతడు నివసిస్తున్న గృహ వాస్తు ప్రభావం కూడా ఉంటుంది. గృహ ప్రవేశమునకు గ్రహ శాంతి హోమం చేస్తారు. కాని వాస్తు హోమం కాదు. అది స్వంత ఇల్లు అయిన అద్దె ఇల్లు అయిన గ్రహ శాంతి ఒకటే. వాస్తు పురుషుడు, వాస్తు హోమం ఇవన్ని కల్పితములు. గృహ నిర్మాణమునకు ముందు చేయునది స్థల శుద్ధి, స్థల పుణ్యః వచనము, శంఖు స్థాపన. ఇక హోమం అనగా వాస్తు హోమం కాదు, గ్రహాలకు శాంతి హోమం చేయాలి దీనినే వాస్తు హోమంగా చెపుతున్నారే  కాని ఇందులో నిజం లేదు.

ఇక శాంతి అంటే ఆ ఇంటి యజమానికి జనన లగ్నాత్ శుభ పాపగ్రహాలను తెలుసుకొని శుభులకు పూజ చేసి దానం తీసుకోవాలి, పాపులకు శాంతి చేసి దానం ఇవ్వాలి. వేద పండితులతో ఈ  స్థల శుద్ధి, స్థల పుణ్యః వచనము, శంఖు స్తాపన, శాంతి హోమం చేయించాలి. స్వతహాగా చేయరాదు.

పూజలు, హోమాలు కూడా వాస్తు దోషాలను బాగా నివారిస్తాయి. విఘ్నేశుడి పూజ, నవగ్రహ శాంతి, వాస్తు పురుష పూజ, హోమం, నవచండీయాగం, అగ్నిహోత్రయగ్నం, అనుష్టానాలు లాంటివి చేయవచ్చు. పండితుడి ఆధ్వర్యంలో వీటిని చేయించాలి.

వాస్తు పురుషుడి విగ్రహం, వెండితో చేసిన నాగ పడగ, రాగి తీగ, ముత్యం, పగడంలను ఎరుపు రంగు వస్త్రం చుట్టి తూర్పు దిక్కులో ఉంచాలి. ఎర్రమట్టి, జీడిపప్పు, పగడంలను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి పశ్చిమ దిక్కులో ఉంచాలి. మంగళవారం నాడు అగరుబత్తీలు వెలిగించి పూజ చేసిన తర్వాత ఈ పని చేయాలి.

ఇంటిని పడగొట్టాల్సి వస్తే వాస్తు పండితుడిని పూజించి ఆ తర్వాతే పడగొట్టాలి. పడగొట్టే సమయంలో మట్టి పాత్ర, నీరు, ఆసనం లాంటివి తీసుకోరాదు. ఇంటి ముందు తులసి మొక్కను ఉత్తర లేదా ఈశాన్య దిక్కుల్లో ఉంచడం మంచిది.

ఇంట్లో దోషాలున్నప్పుడు ఏ కారణం వల్లనైనా మరమ్మతులు చేయలేని పక్షంలో ఆ ఇంటి ఉత్తర దిక్కు గోడలోని ఈశాన్య భాగంలో మత్స్య యంత్రాన్ని ప్రతిష్ఠించి పూజించాలి. అలా చేయడం వల్ల చాలా వరకు దోషాలు నివారణ అవుతాయి.

ముఖద్వారానికి అభిముఖంగా ఉండే గోడలపై విఘ్నేశ్వరుడి చిత్రపటాన్ని గానీ, శ్రీ యంత్రాన్ని గానీ ఉంచాలి. ఆర్థిక పరిస్థితులు బాగుండకపోతే ఈశాన్య దిక్కులో నీటి తుంపరల (ఫౌంటెన్‌ లాంటిది) యంత్రాన్ని ఉంచాలి. అప్పుడు ధనాధాయం పెరుగుతుంది లేదా బంగారు రంగు చేపలు 9, నలుపు చేప ఒకటి ఉంచిన నీటి తొట్టెను (అక్వేరియం)ను ఈశాన్యం దిక్కులో ఉంచాలి.

గృహ యజమాని నామ నక్షత్రాన్ని బట్టి ఇంటికి సింహ ద్వారాలు ఎక్కడ ఉండాలి? ఎన్ని గుమ్మాలు ఉండాలి? ఎక్కడెక్కడ ఉండాలి? కిటికీలు ఎక్కడ ఉండాలి..? వంటి విషయాలన్నీ ముందే వాస్తు పండితులను సంప్రదించి నిర్ణయించుకోవాలి.

వాస్తు వినాయకుడు
భారతీయ సంస్కృతీలో విఘ్నేషుడికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. ఏ పని మొదలు పెట్టాలన్నా మొదట వినాయకుడికే తొలి పూజ చేయాలి.  వాస్తు విషయంలో కూడా వినాయకుడికే పెద్ద పీట. వాస్తు శాస్త్రంలో గణపతి పూజ అన్ని వేళలా ప్రాముఖ్యత వహిస్తుంది. గణపతి ప్రతిమ లేని ఇల్లు ఉండదు.

గృహ అలంకరణ విషయంలో కూడా గణపతి మూర్తిని వాడుతుంటారు. ఈ ప్రతిమలు రకరకాల రంగులలో, భిన్న ఆకృతులతో మనకి లభ్యమవుతున్నాయి. ఇలా లభ్యమైన గణపతుల్ని ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టం గా ఇళ్ళలో అలంకరించుకొంటారు, దానికే మనం కొద్దిగా వాస్తు కూడా జోడించి, ఈ ప్రతిమలను అలంకరించుకొంటే అన్ని విధాల మంచి జరుగుతుంది.

నిల్చుని ఉన్న గణేష్ ప్రతిమను షాప్స్, ఆఫీసులలో, పరిశ్రమలలో ఉపయోగించడం వలన అభివృద్ది ఉండదు. వినియోగదారుల కొనుగోల సంఖ్య తగ్గుతుంది. అటువంటి ప్రదేశాలలో కూర్చోని ఉన్న గణపతిని ఉంచడం మంచిది. ఇంట్లో నిల్చుని ఉన్న గణపతి ఉండడం వలన సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి.

Jyothishyam- Vasthu

Jyothishyam-Vasthu

జ్యోతిష్యం-వాస్తు కలిస్తే సంపూర్ణ జీవితం..!

మానవుడి జీవితంపై పంచ భూతాల, ప్రకృతి శక్తుల ప్రభావం ఉంటుంది. దీనికి శాస్త్రీయమైన ఆధారాలు కూడా ఉన్నాయి. మనిషి జీవితంలో జ్యోతిష్యం.. వాస్తు రెండిటి ప్రభావం కలిసి ఉంటుంది. ఇందులో జ్యోతిష్యం శారీరక అంగాలలో కన్ను అయితే.. వాస్తు దృష్టిలాంటిది.

జ్యోతిష్య శాస్త్రం మనిషికి మూడోనేత్రం లాంటిది. జ్యోతిష శాస్త్రంలో 1. సిద్ధాంత, 2. సంహిత, 3. హోర, 4, శకున 5. ప్రశ్న విభాగాలుగా ఉన్నాయి. అందుకే జ్యోతిష్యశాస్త్రాన్ని పంచ స్కందత్రయమని అన్నారు. ఇందులో ప్రతి విభాగానికి ఓ ప్రత్యేకత ఉంది. సకల మంత్రములలోనూ గాయత్రి ఎంత ప్రధానమో.. సకల శాస్త్రాలలో జ్యోతిష్య శాస్త్ర ప్రాధాన్యత అంత గొప్పగా చెప్పగలగాలి. ఇందులో ముఖ్యంగా సిద్ధాంత భాగాన్ని పరిశీలిస్తే.. గణిత, ఖగోళ శాస్త్రాల గురించి చెప్పారు. హోరా భాగాన్ని చూస్తే జనన సమయ నిర్ధారణ, జాతక నిర్మాణము, షోడశ వర్గులు సాధన చేసే విధానం ప్రతివారికి ఉపయోగపడే వివిధ రాజయోగాలు, పూర్వ జన్మ విశేషాలు ఉన్నాయి. సంహిత భాగాన్ని పరిశీలిస్తే.. అందులో మనకి వాస్తుకు సంబంధించిన అనేక విషయాలు కనబడతాయి. దేవాలయ, తటాక, ఆరామ, గ్రామ, గృహ, శిల్ప వాస్తులన్నీ అందులోనే కనబడతాయి. అంతేగాక జలార్గళం, వివిధ రత్నాలు, పశు సాముద్రికం, అంగ సాముద్రికం వంటి అంశాలను గమనించవచ్చు.

జ్యోతిష్య శాస్తమ్రులోని సంహిత భాగాన్ని తీసుకున్నట్లయితే ‘సంహిత’ అనగా కూర్చబడేది, పేర్చబడేది అని అర్థం. అనేక రకాల అంశాలను కలిపి ఇందులో పేర్చి మనకి అందించారు. జ్యోతిష్య శాస్తమ్రులోని సంహిత భాగంలోని ఒక భాగమే వాస్తుశాస్త్రం. అంటే జ్యోతిష్య శాస్త్రంలోని ఒక భాగమే వాస్తు శాస్త్రమని అందరూ అర్థం చేసుకోవాలి.

నివాస గృహం అనేది ప్రకృతి శక్తులను స్వేచ్ఛగా ఆహ్వానించేదిగా ఉండాలి. అప్పుడు ఆ ఇంటి యజమాని జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. పంచభూతాల గమనం ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం అందరికీ తెలియదు. దానికొక శాస్త్రం ఉంది. అదే వాస్తు శాస్త్రం. గృహ నిర్మాణానికి సలహాలు, ఇంటిలో మార్పులు చేర్పులపై సూచనలు ఇచ్చేవారే వాస్తు నిపుణులు.

దశలను చెప్పేది జ్యోతిష్య శాస్త్రం, దిశలను సూచించేది వాస్తు శాస్త్రం. ‘దశ బాగుంటే, దిశ బాగుంటుంది’ అన్న నానుడి అందరికీ తెలిసిందే. అంటే జ్యోతిష్యం ప్రకారం నడుస్తున్న దశలు బాగున్నప్పుడే మనం ఉంటున్న దిశలు (వాస్తుప్రకారం) బాగుంటాయి అన్నది అర్థవంతమైన సంగతే కదా!

దశలు, దిశలు సరిచేసుకున్నప్పుడే వ్యక్తి జీవితం బాగుంటున్నది నిర్వివాదాంశం. కుటుంబానికి వాస్తు, జ్యోతిష్యం రెండూ రెం డు కన్నులే గాని ‘కేవలం వాస్తే ప్రధానం.. కాదు.. కాదు.. జ్యోతిష్యమే ప్రధానం’ అని అనుకోకూడదు. వ్యక్తి జీవిత చక్రంలో వున్న సమస్యలను సరిగా విశ్లేషించి నడుస్తున్న దశలు, అంతర్ధశలు, గోచార ఫలితాలు గమనించి ఎలాం టి ప్రతిబంధకాలని అతను ఎదుర్కొంటున్నాడో గమనించి దానికి తగ్గ రెమెడీస్‌ (పరిహార క్రియలు.. అనగా జపం, దానం, శాంతి, హోమం, రత్నధారణ మొదలగునవి) పాటించి.. ఆ ఎదుర్కొంటున్న ఒత్తిడి నుంచి బయటపడగలిగిన తరువాతే ప్రశాంతత వస్తుంది. 50 శాతంకు పైగా జాతక ప్రభావం మనిషిపై ఉంటుంది. ఇంక మిగిలిన వాస్తును సరిచేసుకోవాలి.

ఎలాంటి ఇంట్లో ఉండాలి..? ఏ ముఖ ద్వారం ఉండాలి..? ఇలా ఇల్లంతా… లోపల, బయట కూడా వాస్తు ప్రకారం ఉందా..? వీధి శూలలు, వెన్ను శూలలు లేవుకదా..? చుట్టూ సక్రమమైన ప్రహారీ ఉందా? అంతేగాక ఇంట్లో వస్తువులన్నీ వాస్తు ప్రకారం అమి రాతయా లేదా?అని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. అంటే వ్యక్తి పైన జాతకం ప్రభావం దాదాపు జాతకం 60 శాతం ఉంటే, వాస్తు 40 శాతం ఉంటుంది. రెండూ సరిగ్గా ఉండాలి. ఏది సరిగ్గా లేకపోయినా దాని ప్రభావం ఆ వ్యక్తిపైన ఉండి తీరుతుంది. అంతేకాదు మనకి నడుస్తున్న దశలు సరిగ్గా లేనప్పుడు మనం ఉండే గృహం కూడా వాస్తు సరిగ్గా లేనిదే అవుతుంది.

కనుక.. వ్యక్తి జాతకాన్ని ముందుగా పరిశీ లించి అతను ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషించి అట్టి వ్యక్తి ఎలాంటి రూములో, ఎలాంటి ద్వారము, ఎలాంటి సమస్యలున్న ఇంట్లో ఉంటున్నాడో చెప్పగలుగుతున్నాము. అంటే జ్యోతిష్య శాస్త్రంను బట్టే ప్రధానంగా మనం గ్రహించి చెబుతున్నా ము. అప్పుడు ఆ దశలను బట్టి పరిహార ప్రక్రియలు వ్యక్తి పాటించి 60 శాతం ఊరట చెందాక, ఆ ద్వారానికి, ఇంటికి గాని ఉన్న సమస్యను కూడా వాస్తు ప్రకారం సరి చేస్తే పూర్తి స్థాయి మంచి ఫలితాన్ని అతను అనుభవించగలడు. కేవలం వాస్తు ప్రకారమే ఇల్లు కట్టేసి అందులో వ్యక్తిని ఉంచితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆ వ్యక్తికి నడుస్తున్న దశలు ఎంత అధ్వాన్నంగా ఉన్నా మామూలుగా మారిపోలేడు కదా? లేని రాజయోగాలు రావు కదా.. అలా అని జ్యోతిష్యం ప్రకారం రెమెడీస్‌ పాటించి వాస్తు బాగుండని ఇంట్లో ఉంటే ఫలితాలు సగమే ఉంటాయన్న విషయం మరిచిపోకూడదు.

ఎవరైనా సరే జ్యోతిష్యం ప్రకారం నడిచే దశలు, గోచారాన్ని ముందుగా చూపించుకొని అసలు ఆ వ్యక్తి జీవితంలో అతను ఆశిస్తున్నవి అనగా సంసారం, పిల్లలు, ఆయుష్షు, ఆరోగ్యం, ఉద్యోగం.. ఇత్యాది విషయాలు ఉన్నాయా? ఉంటే అవి రాకుండా ప్రతిబంధకాలు ఏం వుంటున్నాయి? అవి సరిచే యగలమా? జ్యోతిష్య పరంగానూ, పరిహారక్రియలను ప్రయోగించి అన్ని అంశాలను పరిశీలించుకోవాలి. ఆ తర్వాత వాస్తు పరంగా ఇల్లు ఉందా..? లేక ఇల్లు మారటానికైనా, మార్చటానికైనా తగిన బలాన్ని సాదించుకోవటానికి ఏం చేయాలి? జోతిష్యపరంగా అని ఆలోచించాలి? ఆ రకంగా జ్యోతిష్య, వాస్తు సమ్మేళనాన్ని ఉపయోగించి జీవితాన్ని బాగుచేసుకోవాలి.

జ్యోతిష్య శాస్తప్రరంగా మనకి లేని ను దుటిరా తను వాస్తు బాగున్న ఇంటిలో ఉండి పొందలేం. వాస్తు బాగుండని ప్రదేశంలో నివసిస్తున్నా.. జ్యోతిష్యపరంగా రావాల్సిన యోగాలని ఎలాంటి ఎలాంటి అడ్డంకులు, ప్రతిబంధకాలు లేకుండా సాధించలేం. రెండూ కావాలి. రెండింటిలోనూ లోపాలను పరిహారక్రియల ద్వారా సరిచేసుకోవాలి. కేవలం జ్యోతిష్యం చాలు. వాస్తు లేదు అనుకోవద్దు. అలాగే వాస్తు మాత్రమే జీవితాన్ని మారుస్తుంది, జ్యోతిష్యం అనవసరం అనుకోవద్దు. ముఖ్యంగా జ్యోతిష్యంలో ‘జన్మ కుండలిలోని లోపాలను పరిహార క్రియలు పాటించి సరిచేస్తే బుర్రకి స్థిరస్థ్వం చేయాలనే సంకల్పం ఏర్పడితేనే వాస్తు ప్రకారం ఆలోచిద్దామనే అభిప్రాయం ఏర్పడుతుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే వ్యక్తి జాతకం బాగున్నంత కాలం వాస్తు ప్రభావం అంతగా బయట కనపడదు. జాతకం బాగులేనప్పుడే వాస్తు ప్రభావం అమితంగా కనపడుతుంది. దశ బాగుంటే దిశ బాగుంటనేది దీనర్ధం. అనారోగ్యం (జలుబు) తో ఉన్న వ్యక్తి వర్షంలో వెళుతున్నప్పుడు ‘గొడుగు’ యొక్క అండతో కాపాడబడతాడు. అనారోగ్యం ఉండడం (జాతకం బాగోని వ్యక్తి) జ్యోతిష్యం అయితే గొడుగు అనేది వాస్తు శాస్త్రం. అంటే జాత కం బాగుండకపోతే ‘సమస్య జటిలమవుతుంది’ అని దీని సారాంశం. అందుకే వ్యక్తికి జాతకం + వాస్తు = జీవితం. అన్నది అతి ముఖ్యమైన విషయం ఏదో ఒకటే చూడరాదు. రెండూ సరిచూసుకొని జీవితాన్ని సక్రమమార్గంలో పెట్టుకోవాలి.

ఎవరైనా సరే జాతకంలో వున్న దోషాలను ముందుగా పరిహార ప్రక్రియల ద్వారా సంపూర్ణంగా సరిదిద్దుకోవాలి. అలాగే వాస్తు దోషాలు సరి చేసుకోవాలి.

అందుకే జ్యోతిష్యశాస్త్రాన్నే ప్రదానంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ‘అప్రత్యక్షాణి శాస్త్రాణి వివాదన్తేషు కేవలం ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం చంద్రార్క యాత్ర సాక్షి ణా’ సూర్యచంద్రుల సాక్షిగా ఈ శాస్త్రం ప్రత్యక్ష ఫలితాలందిస్తుందని భావం. ‘యధాశిభా మ యూరాణాం నాగానాం మణయో యథ తద్వ ద్వేదాంగ శాస్త్రాణాం జ్యోతిష్యం మూర్ధ నిస్తతం’ (ఋగ్జేతిహం)నెమళ్ళకు పింఛములాగా, పాము
లకు తలపై నుంచే మణిలాగా వేదాంగ శాస్త్రాలన్నింటిలోనూ జ్యోతిష్య శాస్త్రం అఖండమైనది.‘వేదచక్షసా…’ వేదపురుషునికి కన్నులాంటిది.

Jyothishayam

Astrology In Telugu

జ్యోతిష్య రహస్యము

మానవజాతి అవతరించిన తర్వాత ఎన్నో శాస్త్రాలు పుట్టాయి. మన ఋషులు ప్రజా శ్రేయసు కోసం అందించిన శాస్త్రాలలో అన్నిటికంటే అతి ప్రాచీనమైనది జ్యోతిష్యం. జీవి జీవితంలో జరిగింది, జరగబోతుంది, జరగబోయేది జననకాల గ్రహస్థితి ప్రకారము, శరీర లక్షణాలు, అర చేతులు, మొదలైన అంశాలను ఆధారం చేసుకుని చెబుతుంది జ్యోతిష్యం.

జ్యోతి అన్న పదానికి సంస్కృతం లో వెలుగు, నక్షత్రము, నేత్రం,సూర్యుడు అనే అర్ధాలు ఉన్నాయి. అనంత విశ్వంలో మన కంటికి ఆకాశంలో కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కొన్ని గ్రహాలు, తోకచుక్కలు, గ్రహణాలు ఇవన్నీ ఆకాశంలో చూసి ఆనందించటంతో పాటు పూర్వకాలం వారికీ ఆశ్చర్యం కూడా కలిగేది, ఎంతో ఉత్సాహంగా కూడా ఉండేది.

కాంతి గోళాలైన నక్షత్రాలు, గ్రహాలు, సూర్య, చంద్రులు భూ వాతావరణంపై, ప్రాణులపై చూపించే ప్రభావాలను, మానవ జీవితంతో వాటికున్న సంబంధాలను అధ్యయనం చేసేదే జ్యోతిష శాస్త్రం. అయితే ఈ కాంతి రెండు రకాలు. 1. నక్షత్రాలు, సూర్య, చంద్రులకు సంబంధించిన బయటి కాంతి, 2. ఆత్మకు సంబంధించిన లోపలి కాంతి. బయటి కాంతి స్పష్టం అవుతున్న కొద్ది లోపలి జ్యోతి స్వరూపమైన ఆత్మ తత్వం బోధపడుతుంది. కాబట్టి జ్యోతిష్య శాస్త్ర ముఖ్య లక్ష్యం భవిష్యత్తు గురించి తెలుసుకోవడమే కాక మానవుల ఆధ్యాత్మిక పరిణామం కోసమని కూడా తెలుస్తోంది. అందుకే జ్యోతిష్య శాస్త్రాన్ని ‘వేద చక్షువు’ అంటారు. అంటే జ్ఞాన నేత్రం అని అర్థం.

భూమి గుండ్రంగ ఆఉందని గ్రీకు శాస్త్రవెత్త టాలెమి కనిపెట్టడానికి ఎన్నో వేల సంవత్సరాల పూర్వం నుంచే మన దేశంలో ఖగోళం అనే పదము వాడుకలో ఉంది. జ్యోతిష్య శాస్త్రం పూర్తిగా భారతీయ విద్య. గ్రీకులు, బాబిలోనియా వారు మన దేశంలో జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రవేశపెట్టారనే విదేశీయుల వాదన పూర్తిగా సత్యదూరమైంది. ఆయా దేశాలు కళ్లు తెరవక ముందే రుగ్వేదం, యజుర్వేద, సామ, అధర్వణ వేదాదులలో జ్యోతిష్య శాస్త్ర విషయాలు, రహస్యాలు అనేక చోట్ల ప్రస్తవించడం జరిగింది. ఇంతటి విశేషఖ్యాతి వహించిన జ్యోతిష్య శాస్త్రం బ్రహ్మ దేవునిచే నిర్మించబడినదిగా తెలుస్తోంది. ఆ తర్వాత ఈ శాస్త్రానికి సూర్యుడు, నారదుడు, కశ్యప, అత్రి, గర్గ, మరీచి, మనువు, అంగీరస, పౌలిష, చ్యవన, శైనక, వశిష్ఠుడు, పరాశరుడు, వ్యాసుడు మొదలైన  గురు తుల్యులైన మహర్షి పరంపర ప్రవర్తకులుగా నిలిచారు. ప్రవర్తకులు అంటే శాస్త్ర విషయాలు నిత్య జీవితంలో ఆచరణ స్థానాన్ని కల్పించి ప్రజా బాహుళ్యానికి అందుబాటులో ఉంచిన వారు అని అర్థం.

ప్రస్తుత ఆధునిక కాలంలో టెలిస్కోప్, ఇంటర్నెట్ లో అన్ని విషయాలు సులువుగా తెలుసుకుంటున్నాం కాబట్టి మనకు విశ్వ విషయాలు అద్భుతంగా అనిపించక పొవచ్చు. కానీ పూర్వ కాలం లో వారికీ అన్ని వింతగా, విశేషంగా అందరిని ఆకర్షించి తెలుసుకోవాలన్న కుతూహలాన్ని పెంచేవి. ఆ గ్రహాల గురించి కుతూహలం పరిశీలనా, ప్రాణులపై వాటి ప్రభావం వాతావరణంలో క్రమబద్ధమైన మార్పులు, వాటికీ మనవ జీవితంతో వున్నా సంబంధము మొదలైనవి జ్యోతిష్య శాస్త్ర ఆవిర్భావానికి కారణం అయ్యాయి.

భారతీయ జ్యోతిష్యానికి మూలం 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాశులు, 108 పాదాలు, పుట్టుక కాలం.

జ్యోతిష్యంతోనే వేద కార్యకలాపాలు

జ్యోతిష్యం వేదాంగాలలో చివరిది. వేదాన్ని అనుసరించి మనం చేసే యజ్ఞ, యాగాదికాలు ఉంటాయి. వాటిని నిర్వహించడానికి కొన్ని ప్రత్యేక సమయాలు ఉంటాయి. వాటినే శుభ సమయం లేదా ముహూర్తం అంటారు. ఈ ముహుర్తాలను అనుసరించి, వైదిక కార్యకలాపాలు చేస్తుంటారు. శుభ సమయాలు సౌరకుటుంబంలోని గ్రహాలు, నక్షత్రాల గమనం మీద ఆధారపడి వుంటాయి. నక్షత్ర, గ్రహ సంబంధమైన విషయాలను అధ్యయనం చేసి వివరించేదే జ్యోతిష్యశాస్త్రం. ఇది లేకుండా వేద కార్యకలాపాలు నిర్వహించడం కుదరదు.

జ్యోతిష్యం కర్మసిద్ధాంతము
భవిష్యత్తులో జరుగబోయే పరిణామాల గురించి ముందుగానే చెప్పి, మనం మానసికంగా వాటిని ఎదుర్కోడానికి తగిన ఉపాయాలను సూచిస్తూ జ్యోతిషశాస్త్రం సహాయకారిగా ఉంటుంది. జ్యోతిష శాస్త్రం మనకు మార్గదర్శకమై బాధల నుంచి విముక్తి పొందే మార్గాన్ని సూచిస్తుంది. కర్మ సిద్థాంతం 3 రకాలైన కర్మలను గురించి చెబుతోంది. అవి..

1. ప్రారబ్దకర్మ
గత జన్మలో మానవుడు చేసిన కర్మల ఫలితాన్ని ఈ జన్మలో అనుభవించడామే ప్రారబ్ద కర్మ.

2. సంచితకర్మ

గతజన్మలో మిగిలిపోయిన కర్మఫలాలను ఈ జన్మలో అనుభవించడమే సంచితకర్మ.

3. ఆగామికర్మ
ఈ జన్మలో మానవుడు చేస్తున్న కర్మల ఫలాన్ని వచ్చే జన్మలో అనుభవించేదిగా మారడమే ఆగామికర్మ.

అంటే మానవునికి తాను చేసిన కర్మల ఫలితాన్ని అనుభవించడానికి ఒక జన్మచాలదు. మానవుడు చేసే ఏ కర్మ అయినా తనకు అంటకుండా, భగవంతునికి సమర్పణ భావంతో చేయాలని, దీనివల్ల మానవునికి తక్కువ జన్మలలో మోక్షప్రాప్తి సుగమమై, జనన మరణ చక్రాల నుంచి తప్పుకోవడం జరుగుతుందని శ్రీకృష్ణ భగవానుడు చెబుతాడు.

గడిచిన జన్మలో చేసిన పాప కర్మల ఫలితాల ప్రభావాన్ని పూర్తిగా తుడిచి వేయడానికి జపం, ధర్మం, హోమం వంటి మార్గాలను జ్యోతిష శాస్త్రము సూచించింది. ఈ జన్మలో మనం చేసే మంచి కర్మల ఫలితాలు గత జన్మలో చేసిన పాపకర్మల ప్రభావాన్ని తగ్గించి మానవుడికి తక్కువ దు:ఖాన్ని కలుగజేస్తుంది. భగవంతుని ప్రగాఢంగా నమ్ముకున్నట్లయితే జ్యోతిష్య శాస్త్ర జ్ఞానం అనాయాసంగా మనిషిని చేరుతుంది.

బ్రహ్మరాత మన పూర్వ జన్మ కర్మను అనుసరించే ఉంటుంది. ఆ పూర్వ కర్మ మనం చేసిందే, దాని మీద అధికారం కూడా మనదే. కర్మ సంకల్పం నుంచి పుడుతుంది.ఆ సంకల్పం కూడా మనదే కదా! సత్కర్మల ద్వారా దోషాన్ని ఎలా పరిహరించాలో జ్యోతిష శాస్త్రం తెలుపుతుంది. పూర్వ జన్మలో చేసిన శుభ, పాప కర్మల యొక్క ఫలానుభవ కాలాన్ని జ్యోతిష శాస్త్రం సూచిస్తుంది. చీకటిలోని వస్తువులను దీపం సహాయంతో చూసినట్లుగా జ్యోతిష శాస్త్ర సహాయంతో జీవితంలో జరుగబోయే శుభాశుభ సంఘటనలను ముందుగా గుర్తించి.. దాంతో మంత్ర, ఔషధ, జప, దాన, హోమ, రత్న ధారణాది శాంతి ప్రక్రియల ద్వారా వ్యతిరేక ఫలితాలను నివారించుకోవచ్చని వరాహమిహిరుల వారి సందేశం మనకు లఘు జాతకం అనే గ్రంథంలో కనిపిస్తోంది.

Japam- Japamaala

Japam- Japamaala

జపం, జపమాలలు – ఫలితాలు

జపతపాలతో భగవంతుడిని ఆరాధించడం వల్ల మానవుడు ఆయన మనసును తొందరగా గెలుచుకోవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. అన్ని యజ్ఞాలకన్నా ‘జపయజ్ఞం’ గొప్పదని మనుస్మృతి చెబుతోంది. జపంలోని ‘జా – జన్మవిఛ్చేదనం చేసేది. ‘పా అంటె పాపాన్ని నశింపచేసేదని అర్థం. యోగానికి జపం ఒక ముఖ్యాంశం. అందువల్లే భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మడు.. అర్జునిడితో, ‘యజ్ఞానాం జప యజ్ఞోస్మీ అని చెబుతాడు. అంటే.. యజ్ఞాలన్నింటిలో తాను జపయజ్ఞాన్ని.. అని చెబుతాడు. జపం చేస్తున్నప్పుడు భగవన్నామాన్ని లేక కొన్ని మంత్రాలనుగానీ పఠించడం జరుగుతుంది. మనసు అనేక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు, జపం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

మనోభీష్టం నెరవేరేందుకు జపం చేసుకోవాల్సిందే. జపమాలలోను 108 పూసలు వుంటాయి. ఇది విశేషమైన సంఖ్యగా చెబుతుంటారు. ప్రతినిత్యం ఈ సంఖ్య ప్రకారం భగవంతుడి నామాన్ని స్మరించడం వలన అనంతమైన ఫలితాలు కలుగుతాయి. భగవంతుడి దివ్యమైన నామాన్ని 108 సార్లు జపించినట్టు తెలియడానికిగాను అందరూ జపమాలలు వాడుతుంటారు.

జపమాలలు 3 రకాలు
1. కరమాల

అనామిక మధ్య కణుపు నుంచి ప్రారంభించి కనిష్టాదిగా తర్జనీమూలం వరకు గల 10 కణుపులలో ప్రదిక్షిణంగా జపించితే కరమాలతో జపించినట్లవుతుంది.

2. అక్షమాల
‘ఆ నుంచి ‘క్షా వరకు గల 54 అక్షరాలతో జపించడమే అక్షమాల. ‘ఆ అనంతఫలితాన్ని కలిగిస్తుండగా  ’క్షా కల్మషాలను తొలగిస్తుంది.

3. మణిమాలలు
రుద్రాక్షలు, ముత్యాలు, స్పటికాలు, శంఖాలు, పగడాలు, సువర్ణమాలలు, రజితమాలలు తులసిపూసలు, కుశదర్భమాలలు, పద్మబీజాలు, పుత్రజీవాలు ఉపయోగించి చేయబడిన మాలలను మణిమాలలని అంటారు.

ఫలితములు

రేఖాజపం దశగుణాన్ని, శంఖమాలజపం శతగుణాన్ని, పగడాలమాల జపం సహస్రగుణాన్ని, స్ఫటికమాల జపం దశసహస్రగుణాన్ని, ముత్యపు మాల జపం లక్ష గుణాన్ని, తామరపూసల మాలాజపం దశ లక్షగుణాన్ని, బంగారుమాల జపం కోటి గుణాన్ని, తులసిమాల జపం అనంతకోటి గుణాన్ని, రుద్రాక్షమాల జపం అనంతఫలితాన్ని ఇస్తుంటాయి. పగడాల మాలలతో జపం చేయడం వలన ఐశ్వర్య వృద్ధి, ముత్యపు మాలతో జపం చేస్తే సర్వమంగళం, తులసి మాలతో చేస్తే సమస్తమైన ఫలాలు, రుద్రాక్షమాలతో జపం చేస్తే ఆత్మజ్ఞానం కలిగి మోక్షం కలుగుతుంది.

జపం 3 విధాలుగా ఉంటుంది

1. వాచింకం
మంత్రబీజాక్షరాలను తన చుట్టూ ఉన్నవారికి వినిపించేటట్లు పలుకుతూ జపం చేయడం వాచికం అనబడుతుంది.

2. ఉపాంశువు

తనకు అత్యంత సమీపంలో ఉన్నవారికి మాత్రమే వినిపించేటట్లు పెదవులను కదుపుతూ జపం చేయడం ఉపాంశువు అని పిలువబడుతుంది.

3. మానసికం

మనస్సులోనే మంత్రాన్ని జపించడం.
వాచిక జపం కంటే ఉపాంశు జపం 100 రేట్లు ఫలితాన్ని కలిగిస్తూ ఉండగా, ఉపాంశుజపం కంటే మానసిక జపం 1000 రేట్లు ఫలితాన్ని కలిగిస్తుంటుంది. అయితే, జపం చేసేటప్పుడు అక్షరం, అక్షరం విడివిడిగా వల్లించుకుంటూ జపం చేయకూడదు. అలాగని మరింత వేగంగా కూడా చేయకూడదు. మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించాలి. జపంలో ఉఛ్చారణ చేస్తున్నప్పుడు బీజాక్షరాలు లోపించకూడదు. జపానికి ముందుగానీ, తరువాత గానీ ఇష్ట దేవతా పూజ తప్పకుండా చేయాలి. పూజ చేయని జపం ఫలితాన్ని ఇవ్వదని శాస్త్రం చెబుతోంది. జపం చేసేందుకై కొంతమంది భక్తులు జపమాలలను ఉపయోగిస్తుంటారు.

ఎలా చేయాలి..?
తూర్పుముఖంగా కానీ, ఉత్తరముఖంగా కాని కూర్చుని జపం చేయాలి. జపం చేయడానికి కాలం గురించి పట్టింపులేదు. జపం చేసే ముందు జపమాలను నీటిలో శుభ్ర పరచి, అనంతరం పంచగవ్యాలతో శుభ్రపరచి, అనంతరం మంచి గంధంతో శుభ్రపరచాలి. ఏ మంత్రాన్ని జపించేందుకు ఆ మాలను ఉపయోగించదలచుకున్నారో, ఆ మంత్రంతోనే ఆ జపమాలను పూజించాలి. ఆ తరువాత జపమాలకు ఈ క్రింది ధ్యానాన్ని చేసి ధూపం వేయాలి.

త్వం మాలే సదేవతా నాం సర్వసిద్ధి ప్రదాయతా
తేన సత్యేన మేసిద్ధిం మాతర్దేహి నమోస్తుతే

అనంతరం పద్మాసనంలో కూర్చుని, జపమాలను కుడిచేతిలో ఉంచుకుని, మధ్య, అనామిక, కనిష్ఠ వేళ్ళపై ఉంచి, చేతి బోటని వేలితో, మధ్య వేలిపై నొక్కి జపమాలను తిప్పాలి. జపమాలను ఇతరులు చూడకూడదు. కాబట్టి ఒక గుడ్డ సంచిలో పెట్టి జపం చేయాలి. వెదురు కర్రల మీద జపం చేస్తే దారిద్ర్యం, రాతిమీద రోగం, నేలమీద దు:ఖం, గడ్దిపరకలమీద యశస్సు తగ్గడం, చిగుళ్ళు పరచిన ఆసనం మీద మనస్సు చంచలంగా ఉండడం, కృష్ణాజినం మీద జ్ఞానం కలుగుతుంది. కృష్ణాజినం వేదస్వరూపమేనని వేదంలో ఉంది. దేవతలు యజ్ఞం చేస్తూ ఉండగా ౠక్కు, సామవేదాలు లేడిరూపం ధరించి ప్రక్కకు తప్పుకొన్నాయని, మళ్లీ దేవతలు ప్రార్థించగా తిరిగి వచ్చాయని, ౠగ్వేదం యొక్క వర్ణం తెలుపని, సామవేదం రంగు నలుపని, అవే పగలు రాత్రులని, ఆ రెంటి రంగులను విడిచి పెట్టి ఆ వేదాలు తిరిగి వచ్చాయని కనుక కృష్ణాజినం ౠక్, సామవేదములకు ప్రతినిధియని వేదంలోని కథ.

దీనిమీద కూర్చొని చేస్తే కుష్ఠు, క్షయ మొదలైన రోగాలు పోతాయని వేద వేత్తలు అంటుంటారు. ఓషధులసారమే దర్భలని అలాంటి ఆసనం మంచిదని వేదం, ముందు దర్భాసనం వేసుకొని, దానిమీద కృష్ణాజినం వేసుకొని, దానిమీద బట్టపరచి చేయాలని భగవద్గీత చెబుతోంది. ఇది యోగుల విషయమని గీతా వ్యాఖ్యానమైన శంకరానందీయంలో ఉంది.

గృహస్థులందు దర్భాసనం వేసుకొనిగాని, చిత్రాసనం మీద గాని చేయవచ్చు. జపం చేయడానికి కాలనియమం లేదని, దీక్ష, హొమాలతో కూడా పనిలేదని బ్రహ్మోత్తర ఖండంలో ఉంది. అందరూ దీనికి అధికారులేనని అగస్త్యసంహితలో ఉంది. అలాగే జపమాలలో 108 లేక 54 లేక 27 పూసలు ఉంటుంటాయి. దీనివెనుక ఓ అర్థం ఉంది. మన శరీరంలో 72000 నాడులున్నాయి. వాటిలో హృదయానికి సంబంధించినవి 108. అందుకనే 108 జప సంఖ్యగా అమలులోకి వచ్చింది. మాలలో ఒక పెద్దపూసను మేరువు పూసగా ఉంచుకోవాలి. ఈ మేరువు పూస లెక్కలోకి రాదు.

జపం చేసుకోవడానికిగాను తులసిమాల, స్పటికమాల, శంఖమాల, ముత్యాలమాల, రుద్రాక్షమాల, ఉపయోగిస్తూ వుంటారు. వీటిలో ఒక్కో జపమాల ఒక్కో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ నేపథ్యంలో ‘పగడాల మాల’ కూడా తనదైన ప్రత్యేకత ఏమిటంటే.. పగడాలు ధరించడం, పగడాల మాలతో జపం చేయడమనేది పూర్వకాలం నుంచీ ఉంది. పగడాల మాలతో జపం చేయడం వల్ల సంపదలు వృద్ధి చెందుతాయి.

Paper News

Pushkaram

Navagraha Pooja

Navagraha Pooja

నవగ్రహ పూజ – ఫలితాలు

హిందువుల జీవిత ఆచారాలలోనూ నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మానవుల స్థితిగతులు, భవిష్యత్తు వ్యవహారాలపై నవగ్రహాల ప్రభావం ఉంటుంది. ఈ భూప్రపంచంలో దేవతలతో సమానంగా నవగ్రహాలకి కూడా ప్రాధాన్యం ఇవ్వబడింది. మానవులు చేసిన కర్మలను అనుసరించే వారికి శుభాశుభ ఫలితాల్ని నవగ్రహాలు అందిస్తుంటాయి.

సూర్యుడికి అధిపతి అగ్ని, చంద్రుడికి అధిపతి వరుణుడు, కుజుడికి అధిపతి కుమారస్వామి, బుధుడికి అధిపతి విష్ణువు, గురువుకు అధిపతి ఇంద్రుడు, శుక్రుడికి అధిపతి శచీదేవి, శనికి అధిపతి బ్రహ్మ. సూర్యుడు కారానికి, చంద్రుడు లవణానికి, కుజుడు చేదుకు, బుధుడు షడ్రుచులకు, గురువు తీపికి, శుక్రుడు పులుపుకు, వగరు రుచులకు అధిపతులు. సూర్యుడు ఆయనముకు, చంద్రుడు క్షణానికి, కుజుడు ఋతువుకు, బుధుడు మాసానికి, గురువు పక్షానికి, శుక్రుడు సంవత్సరాలకు అధిపతులు.

నవగ్రహాల ద్వారానే ఈ భూమండలం మొత్తం నడుస్తుంది. స్తావర జంగమములు ఏర్పడినవి ఈ గ్రహాల వల్లే. త్రిమూర్తులు త్రిదేవినులు కొలువైనది ఈ గ్రహల్లోనే. గ్రహరూపి జనార్దన , గ్రహరూపి మహేశ్వర అనే వచనం ప్రకారం హరిహరులు గ్రహ రూపంలో కొలువై ఉన్నారు. అటువంటి గ్రహాలనురెండు వర్గములుగా సృష్టి ఆదిలోనే విభజించారు. అవి
గురుపాలితములు: రవి, చంద్ర, కుజ, గురు, కేతు
శనిపాలితములు: శని, బుధ, శుక్ర, రాహు
పాపపుణ్యములు వీరిలోనే ఉన్నవి. గ్రహశాంతి అంటే జాతకునికి ఏ గ్రహం పాపగ్రహమో , ఏది ఎక్కువ బాధిస్తుందో తెలుసుకొని ఆయా గ్రహాలకు వారి ప్రీతికరమైన ధాన్యం, వస్త్రాలను సంకల్పయుతంగా దానమిచ్చిన ఆ గ్రహ పీడా నివారణ జరిగి కొంత ఉపశమనం కలుగుతుంది.

నవ గ్రహాల్లో ప్రతీ గ్రహమూ శుభాన్ని – అశుభాన్ని రెండింటినీ కలిగిస్తుంది. ఈ శుభాశుభాలనేవి ఆ జాతకుడి గ్రహస్థితిని బట్టి ఉంటుంది. మరి నవగ్రహాల ద్వారా కలిగే అశుభాల్ని నివారించుకోవటానికి మార్గం లేదా అంటే ఉంది. అది నవగ్రహాలని నిత్యం స్తుతిస్తూ, పూజిస్తూ వుండడం. ఆయా గ్రహ మంత్రాల్ని జపం చేయటం లేదా చేయించుకోవటం. ఈ కార్యక్రమాల ద్వారా నవగ్రహ శాంతిని పొందచ్చు. ఈ నవగ్రహ పూజ, జప దానాల వల్ల పూర్తిగా దోషం నుంచి తప్పించుకోలేకపోయినా, ఆ దోషం ద్వారా కలుగబోయే పెద్ద ప్రమాదం నుంచి సులభంగా బయటపడవచ్చు.

నవగ్రహ శాంతికి సంబంధించి పూజాది కార్యక్రమాలు చేసేవారు ఆయా ప్రత్యేక వస్తువులతో పూజని నిర్వహించాలి. పూజలో గ్రహ శాంతికి దోష నివారణకు దానాలు చేయాలి. ఇలా చేసిన వారికి దోష నివారణ జరిగి శుభాలు కలుగుతాయి. కోరిన కోర్కెలు నెరవేరతాయి. సూర్య గ్రహ పూజ చేసేవారు గోధుమలను దానం చేయాలి. చేతికి కెంపు ఉంగరాన్ని ధరించటం వల్ల రోగాదులు, మానసిక బాధలు తొలగి మనశ్శాంతి కలుగుతుంది.

గురు గ్రహ పూజను నిర్వహించేవారు శనగలను దానం చేయాలి. అదే విధంగా కనక పుష్యరాగం ఉంగరాన్ని ధరించటం వల్ల అధికారం, ధనయోగంతో పాటు కీర్తివంతులవుతారు. చంద్రుని పూజకు బియ్యాన్ని దానం చేస్తే సరిపోతుంది. ముత్యాన్ని ధరించటం వల్ల నేత్రాలకు సంబంధించిన బాధలకు నివృత్తి కలుగుతుంది. ఇక కుజ గ్రహ పూజలో కందులను దానం చేయాలి. పగడపు ఉంగరాన్ని ధరించటం వల్ల రుణ విముక్తి కలిగి శతృ బాధ తొలగుతుంది. బుధ గ్రహ పూజలో పెసలను దానం చేయాలి. పచ్చల ఉంగరాన్ని ధరించటం వల్ల ధనలాభం కలగటమే కాక వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది.

శుక్రుని పూజలో అలచందల దానం చేయాలి. వజ్రం, పగడము ధరించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. వివాహాది శుభకార్యములకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. రాహు పూజకు మినుములను దానం చేయాలి. గోమేధిక ఉంగరాన్ని ధరించటం వల్ల భయాందోళనలు తగ్గుతాయి. ధనప్రాప్తి కలుగుతుంది.

కేతువు పూజలో ఉలవల దానం చేయాలి. వైఢూర్యం ఉంగరాన్ని ధరించాలి. దీనివల్ల సర్పాది భయాలు తొలగటమే కాక.. దైవశక్తి పెరుగుతుంది. శనిపూజలో నువ్వులను దానం చేయాలి. నీలిరంగు రాయి కలిగిన ఉంగరాన్ని ధరించటం వల్ల ఆరోగ్యవంతులవటమే కాక ఇతర కష్టాలు కూడా తొలగిపోతాయి.

నవగ్రహాలు సంతృప్తి చెంది మానవులకు సుఖశాంతుల్ని ప్రసాదించాలంటే వాటిని దేవతల్లా భావించి ఆరాధించాలి. పూజించాలి.

అందరికీ నవగ్రహానుగ్రహం కలగాలని ఆశిస్తూ…

Palmistry

palmistry

హస్తసాముద్రికం 

మానవుని అవయవాల పొందికను, తీరును బట్టి అతని జీవితాన్ని చదవవచ్చు. తెలుసుకోవచ్చు. దీనిలో హస్త సాముద్రికం ఒక విశిష్ట విద్య. జ్యోతిష్యంలో సాముద్రిక శాస్త్రం కూడా ఒక భాగం. సాముద్రికంలో వేళ్ళ అమరిక మనిషి మనస్తత్వాన్ని తెలియజేస్తుంది.

చేతిలో గీతలు అందరికీ ఒకే విధంగా ఉంటాయని కొందరు అనుకుంటారు. అది నిజం కాదు. చూడటానికి ఒకేరకంగా ఉన్న మనుషుల్ల్లో కూడా హస్తరేఖలు ఒకేలా ఉండవు. వేళ్ళ అమరికలోనూ, ఆకారంలోనూ, చర్మపు తీరులోనూ, గోళ్ళ తీరులోనూ, కణుపుల తీరులోనూ మనిషికీ మనిషికీ మధ్య చాలా తేడాలుంటాయి. ఇక గ్రహస్థానాలు, రేఖలు, ప్రత్యేకమైన గుర్తులు ఇలా ప్రతి విషయంలోనూ తేడాలుంటాయి.

మానవుని శరీరంలోని ప్రతి అవయవమూ మనిషి యొక్క మనస్తత్వాన్నీ, ఆలోచనా సరళినీ, అలవాట్లనూ పట్టిస్తుంది. అలాగే హస్తరేఖలు కూడా మనిషిని గురించి సమస్తమూ వెల్లడిస్తాయి. జాతకచక్రం ఎంతో మనిషి అర చేయి ప్రింటూ అంతే. ఇవి రెండూ రెండు రకాల భాషలు అనుకుంటే, అవి చెప్పే విషయం మాత్రం ఒకటే ఉంటుంది. మనిషి ఆలోచనల ప్రభావం నాడుల ద్వారా హస్త రేఖలను మారుస్తూ ఉంటుంది.

మనిషి ఆలోచనలు అతని శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే, చేతి రేఖలనూ ప్రభావితం చేస్తాయి. అందుకే మన ఆలోచనా ధోరణి మారుతున్న వయస్సులో చేతి రేఖలూ మారుతాయి. పాత రేఖలు మాయం అవుతాయి. కొన్ని కొత్త రేఖలు పుట్టుకొస్తాయి. ఇది ఎవరి చేతిలో వారే గమనించుకోవచ్చు. ఈ విషయం శాస్త్రాల్లో కూడా పొందుపర్చారు.

అంగుష్ఠవిద్య అని దీనిలో సూపర్ స్పెషలైజేషన్ ఒకటుంది. అందులో అయితే చేతిరేఖలను కూడా పరిశీలించరు. ఒక్క బొటనవేలి మీద ఉన్న గీతలనుబట్టి ఆ వ్యక్తి యొక్క జీవితం మొత్తాన్నే చదివేస్తారు. ఈ విద్యలో రావణుడు అఖండమైన ప్రజ్ఞాశక్తి కలిగినవాడని అంటారు. ఆయన రాసిన ‘రావణసంహిత’ అనే గ్రంధంలో ఈ వివరాలు ఉన్నాయి. ఇలా అనేకానేక అద్భుత విద్యలు మన దేశంలో ఉండేవి. అవన్నీ కాలక్రమేణా కనుమరుగు అయ్యాయి. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఇవన్నీ పునరుజ్జీవనాన్ని చవిచూస్తున్నాయి.

ఇక హస్తసాముద్రికంలో వ్యక్తి అరచేతిని అర్థం చేసుకొని అతని వ్యక్తిత్వం, భవిష్యత్ గురించి విశ్లేషించే విధానం ఉంటుంది. హృదయ రేఖలు, జీవన రేఖలతో పాటు  కొన్ని ఆచారాల్లో, హస్తసాముద్రికులు వేళ్లు, వేలుగోళ్లు, వేలు ముద్రలు, చేతి చర్మపు నమూనాలు, చర్మపు నిర్మాణం, రంగు, అరచేయి ఆకారం, చేతి సౌకర్యాలను కూడా పరిశోధిస్తారు.

హస్తసాముద్రికులు చేతిలోని పలు లక్షణాలను పరీక్షిస్తారు, వీటిలో అరచేయి, వేళ్లపై ఆకారాలు, రేఖలు; చర్మం, వేలుగోళ్లు వాటి రంగు, నిర్మాణం; అరచేయి వాటి సంబంధిత పరిమాణాలు; మెటికల ప్రాముఖ్యత ఇంకా చేతి యొక్క పలు ఇతర లక్షణాలు ఉంటాయి.

హస్త సాముద్రకము గురించి మరిన్ని విశేషాలు మళ్లీ తెలుసుకుందాం.

Muhoortham

Muhoortham

అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం..!

పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే… ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే ‘బ్రహ్మముహూర్తం’ అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, 98-48 నిమిషాల మధ్యకాలం ఇది.

నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.

పురాణగాథ
బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.

ఏం చేయాలి..?
ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.

ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు… హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.

చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.

బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో  ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.

బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాము.

Ruby

కెంపు 
నవరత్నాల్లో పెద్ద‌న్న వంటిది కెంపు. ఈ ర‌త్నానికి మాణిక్యం, పద్మరాగం.. అనే పేర్లు కూడా ఉన్నాయి. కౌస్తుభమణి, శ్యమంతకమణి, సుర్యకాంతమణి, అగ్నిమణి, తపసమణి, చింతామణి అనే ఇతర శాస్త్ర నామాలు కూడా ఉన్నాయి. ఈ రత్నాన్ని ధరిచడం వల్ల‌ సకల శుభాలు కలిగి ఆయురారోగ్యములు పొంది ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది. దీనిని ధరించడం వాళ్ళ కార్యసిద్ధి కలుగుతుంది. అంటే కాక శత్రువుల మీద గెలుపు పొందేందుకు దీనికి ధరిస్తారు. కెంపు రవి గ్రహానికి ప్రీతికరమైనది.

సాధార‌ణంగా కృత్తిక‌, ఉత్తర, ఉత్తరాషాఢ, నక్షత్రా జాతకములో… 1 , 10 , 19, 28 తేదీలలో జ‌న్మించిన వారు కెంపును ధరిస్తారు. నవ రత్నాలలో సూర్యున్ని సూచించే రత్నం కెంపు అని, రాశిఫలాల్లో సూర్యునిది సింహ రాశిగా పరిగణించబడుతోంది. ఇక సింహలగ్నంలో, సింహ రాశిలో జన్మంచిన వారు కెంపును ధరించవచ్చునని రత్నశాస్త్రం చెబుతోంది. సూర్యుడు శత్రు స్థానాలలో ఉన్నవారునూ లేదా దుర్భల రాశులలో ఉన్నవారునూ, సూర్యదశ జరుగుతున్నవారు కూడా ఈ కెంపును ధరించవచ్చు.

కెంపులో మొత్తం ఆరు రకాలున్నాయి.

1.   పద్మరాగము:   ఉదయిస్తున్న బాల సూర్యుని వంటి ఎరుపు రంగులో ఉంటుంది.
2.   సౌగందికము:  దానిమ్మ పువ్వు వంటి ఎరుపు రంగులో ఉంటుంది.
3.   కురువిందము:  కోకిల కన్ను వంటి ఎరుపు రంగులో ఉంటుంది.
4.   మాసగంధి :  కాంతి హీనమైన ఎరుపు రంగులో ఉంటుంది.
5.    నీలగంధి :   నలుపు, ఎరుపు కలిసిన రంగులో ఉంటుంది.
6.    లాలుగంధి :   కొంచెం తెలుపుతో, కొంచెం ఎరుపురంగు కలిసి వెలవెలబోయినట్లు ఉంటుంది.

ఫలితాలు
ఆరోగ్య కారకుడు సూర్యుడు కాబట్టి అనారోగ్యంతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా కెంపును ధరించిన‌ట్లయితే శుభ ఫలితాలు క‌లుగుతాయి. ఆరోగ్యవంతులుగాను, ఉద్యోగంలో పదోన్నతి, రాజకీయాల్లో అధికారం, ఉన్నతాధికారుల అభినందనలు, కుటుంబం క్షేమదాయకంగా ఉంటారని రత్నాల శాస్త్రం చెబుతోంది.

కెంపును ధరించినచో.. దంత వ్యాధులు, ముక్కు నుంచి రక్తంకారుట, పక్షవాతం, స్త్రీ బహిష్టు దోషంలు, అపస్మారకం, హిస్టీరియ, చర్మరోగాలు, కీళ్ళవాతం, మోకాళ్ళ నొప్పులు, నిద్రలేమి, మొదలైన అనారోగ్యాలు కలిగినవారు కెంపును ధరించినట్లయితే చాల ఉపశాంతి. అంతేకాకుండా కెంపు ధారణతో కళ్ళకు, గుండెకు సంబంధించిన రోగాల నుంచి నివారణ కలుగుతుంది.