Menu

Monthly Archives: July 2015

Gochaaramu – Phalamulu

గోచారములు - ఫలితాలు

గోచారములు – ఫలితాలు

జ్యోతిష్య శాస్త్రంలో అనేక విధాల అధ్యయనాలున్నాయి. ఇందులో భాగంగా గోచారం ఉంది. గోచారము అంటే ప్రస్తుత గ్రహస్తితిని బట్టి వ్యక్తికి సంబంధించిన రాశి ఫలము. జాతకచక్రంలో వ్యక్తి జన్మించినప్రథమ భాగాన్ని లగ్నంగా తీసుకుంటారు. చంద్రుడున్న నక్షత్రాన్ని ఆ వ్యక్తి జన్మ నక్షత్రంగానూ, ఆ చంద్రుడున్న రాశిని ఆ వ్యక్తి రాశి గానూ చెబుతారు.

ఉదాహరణకు… 2014  సెప్టెంబర్‌ 25 తేదీన సూర్యోదయంలో(సుమారు 6 గంటలకి) జన్మించిన వ్యక్తి ఐతే, ఆ సమయానికి చంద్రుడున్న హస్త నక్షత్రం ఆ వ్యక్తి జన్మ నక్షత్రం, అలాగే చంద్రుడున్న రాశి కన్య ఆవ్యక్తి రాశి అవుతుంది. ఆ సమయంలో ఉదయిస్తున్న రాశి లగ్నము అవుతుంది. ఈ లగ్నాన్ని అనుసరించి జీవితంలోని స్వభావ, రోగ, వృత్తి, వివాహ, సంతాన, ప్రమాద మొదలైన అంశాలు నిర్ణయిస్తారు. గోచారానికి జాతకంతో ఉన్న సంబంధం ఒక వ్యక్తికి ఈ అంశాలకి సంబంధించిన పూర్తి సమాచారం అతని జాతకం చూసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. కాలాన్ని బట్టి వచ్చే మార్పులు పాప పుణ్యబలాల్ని సుఖ ఫలంగానూ దు:ఖ ఫలంగానూ చూపించే పట్టిక గోచారము. జాతకంలో ఉద్యోగంకానీ వివాహంగానీ యోగమున్నా గోచారంలో అనుకూల దశ లేకపోతే అవి వికటించవచ్చు. అలాంటప్పుడు పరిమితుల్లో ప్రవర్తనని ఉంచుకోవటం పుణ్యబలం పెంచుకోవటం అవసరం. అంటే జ్యోతిష జీవితాన్ని మార్చేది కాదు జీవితాన్ని సరిదిద్దుకునే సూచనలిచ్చేది అని తెలుసుకోవాలి.

కొన్ని ఉదాహరణలు… ఆదాయవ్యయాలు గమనించినప్పుడు.. వ్యయం ఎక్కువగా ఉన్నట్లైతే ఎలాగూ తప్పని ఖర్చు కనుక ఆ ఖర్చును పుణ్యకార్యాలకు ఖర్చుపెడితే మళ్లీ అది మనకు పుణ్యంరూపంలో ఉపయోగపడి కాపాడుతుంది. ఆదాయం ఎక్కువగా ఉంటే పుణ్యకార్యాలతో పాటు స్థలాలు, ఇంటి నిర్మాణాలు మొదలైనవి కొనే ప్రయత్నం చేయటం మంచిది. భవిష్యత్ ఫలితాలను జాతకాదులలోని యోగావయోగాలతో పోల్చి చూసుకోవటం ద్వారా కాలాన్ని జీవితాన్ని సద్వినియోగంచేసుకోవచ్చు.

గోచార రీత్యా జన్మరాశి నుంచి 12 రాశులలో నవగ్రహములు సంచరించేటప్పుడు కలుగు ఫలితాలు ఈ విధముగా ఉంటాయి.

సూర్యుడు
సూర్యుడు జన్మ రాశిలో సంచరింస్తున్నప్పుడు స్థాన మార్పిడి , 2 వ రాశికి వచ్చినపుడు భయమును ౩ సంపదను 4 మాన హానిని 5 విశేష భయమును 6 శత్రు నాశనం 7 దుఃఖము 8 రోగము 9 విచారమును 10 కార్య సిద్ధిని 11 ధన లాభమును 12 ధన వ్యయమును కల్గించును.

చంద్రుడు
చంద్రుడు 12 రాశులలో సంచరింస్తున్నప్పుడు 1 భోజన సౌఖ్యమును 2 ధన క్షయమును ౩ ద్రవ్యలాభమును 4 విశేష రోగ భయమును 5 కార్య నాశనము 6 ధనరాబడిని 7 ద్రవ్య లాభమును 8 మరణ సమాన ఫలితములను 9 రాజ కోపమును 10 సౌఖ్యమును 11 లాభమును 12 ధన నష్టమును కలిగిస్తున్నాడు.

కుజుడు
కుజుడు ద్వాదశ రాశులలో సంచరిస్తున్నప్పుడు 1 దుఃఖము 2 భాగ్య హాని ౩ సౌభాగ్యము 4 శత్రువుల వలన బాధలు 5 శత్రు భయము 6 ద్రవ్య సిద్ది 7 కార్య హాని 8 శస్త్రబాధ గాయములు ఏర్పడుట 9 ధన వ్యయము 10 దుఃఖ నాశనము 11 ధన యోగము 12 క్రూరత్వమును కలుగ జేయును.

బుధుడు
బుధుడు 12 రాశులలో సంచరిచు సమయములలో 1 బంధనము 2 సువర్ణ లాభము ౩ శత్రుభాధలు 4 శత్రువుల నాశనము 5 దరిద్రము 6 ఆభరణ లాభము 7 లాభములను 8 సంతోషము 9 ధన నష్టము 10 ప్రమోదము 11 మోదమును 12 నాశనము కలిగించును .

గురుడు
గురుడు ద్వాదశ రాశులలో సంచరించు సమయములో 1 దేశ త్యాగము 2 ధన లాభము ౩ కార్య హాని 4 ధన నాశనము 5 సంపద 6 దుఃఖము 7 ఆరోగ్యము 8 ధన హాని 9 ధనాగమము 10 ఆయాసము 11 లాభములను 12 నష్టములను కల్గించు చున్నాడు .

శుక్రుడు
శుక్రుడు ద్వాదశ రాశులలో సంచరించేటప్పుడు 1 ఆరోగ్యము 2 అలంకారము ౩ లాభము 4 రతిసౌఖ్యము 5 మిత్రదర్శనము 6 మానహాని 7 విశేష రోగము 8 భూలాభము 9 ధాన్యవృద్ధి 10 ప్రమోదము 11 ధనము 12 సంతోషముల ను కలుగ జేయును .

శని
శని 12 రాశులలో సంచారము చేయునపుడు 1 ఆపదలను 2 హానిని ౩ సంపదను 4 గర్భసంభంద రోగములను 5 సంతానమునకు కష్టములను , నాశనమును 6 మహా ఐశ్వర్యమును 7 మహా దరిద్రమును 8 మరణ సమాన ఫలితములను 9 దేహ శోషణమును 10 బంధనమును 11 లాభమును 12 అనేక విధాల నష్టములను కలిగించు చున్నాడు .

రాహు , కేతువులు
రాహు కేతు గ్రహములు జన్మరాశి నుంచి 12 రాశులలో సంచరించు సమయమున 1 భయమును 2 కలహాలను ౩ సౌభాగ్యమును 4  మానహానిని 5 ధన నష్టములను 6 మహా సుఖములను 7 శత్రువుల వలన భయమును 8 చొర భయమును 9 శత్రు వృద్ధిని 10 ధన క్షయమును 11 శుభ ఫలములను 12 భ్రుత్యునాశనమును కలిగించుదురు .

దానాలు – శుభ ఫలితాలు

దానాలు - శుభ ఫలితాలు

ప్రస్తుత జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగ పడుతుంది.. అనే మాటలు మనం వింటూ ఉంటాము. పురాణాలు కూడా దానం చేయడం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని చెబుతున్నాయి. ఈ కారణంగానే దైవ దర్శనం పూర్తి చేసుకున్న తరువాత చాలా మంది, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని మాత్రమే అర్హులుగా భావించి తమకి తోచిన విధంగా దానధర్మాలు చేస్తుంటారు.

నవగ్రహ పూజ – దానాలు, ఫలితాలు

నవగ్రహ శాంతికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చేసేవారు గ్రహ శాంతికి దోష నివారణకు దానాలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన వారకి దోష నివారణ జరిగి జీవితాన సకల శుభాలు కలుగుతాయి. కోరిన కోర్కెలు నెరవేరుతాయి. సూర్య గ్రహ పూజ చేసేవారు గోధుమలను దానము చేయాలి. చేతికి కెంపు ఉంగరాన్ని ధరించటం వల్ల రోగాదులు, మానసిక బాధలు తొలగి మనశ్శాంతి కలుగుతుంది.

గురుగ్రహ పూజను నిర్వహించేవారు శనగలను దానము చేయాలి. చంద్రుని పూజకు బియ్యాన్ని దానం చేస్తే సరిపోతుంది. ఇక కుజ గ్రహ పూజలో కందులను దానం చేయాలి. పగడపు ఉంగరాన్ని ధరించటం వల్ల రుణ విముక్తి కలిగి శత్రు సమస్య నశిస్తుంది. బుధ గ్రహ పూజలో పెసలను దానం చేయాలి. శుక్రుని పూజలో అలచందల దానము చేయాలి. రాహు పూజకు మినుములను దానం చేయాలి. కేతువు పూజలో ఉలవల దానం చేయాలి. శని పూజలో నువ్వులను దానం చేయాలి.

దానాల్లో పలు రకాలు:

చతుర్విద దానాలు
చతుర్విద దానాలు చేసిన వారికి పూర్వ జన్మ పాపాలు నశించి, ఈ జన్మలోనే సుఖిస్తారు.
చతుర్విద దానాలు నాలుగు. అవి..
1. మరణ భయంతో భీతిల్లే వారికి ప్రాణ అభయం ఇవ్వడం
2. వివిధ వ్యాధులతో నరక యాతన పడే రోగులకు వైద్యం చేయడం
3. పేదవారికి ఉచిత విద్యను అందించడం
4. క్షుద్భాదతో అల్లాడే వానికి అన్నదానం చేయడం

దశ దానాలు
పేదవానికి మీ శక్తి కొలది చేసే ద్రవ్యసహాయము కానీ, వస్తు సహాయమును కానీ..‘ధర్మం’ అంటారు. ఇలా ‘ధర్మం’ చేయడం వల్ల వచ్చినపుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది.
మంత్రపూర్వకంగా ఓసద్బ్రాహ్మణునకు చేసినదానఫలం, పరలోక సుఖాలను అందించడమే కాకుండా, ఉత్తమ జన్మ సంప్రాప్తించడానికి ఉపయోగపడుతుంది. ‘ధర్మం’ చేయడానికి పరిధులు లేవు. నీకు తోచినది ఏదైనా ధర్మం చేయవచ్చు. కానీ, ‘దానం’ చేయడానికి కొన్ని పరిధులు ఉన్నాయి. ఏదిపడితే అది దానం చేయడానికి వీలులేదు. శాస్త్రనియమానుసారం దాన యోగ్యమైనవి కొన్నే ఉన్నాయి. వాటిని మాత్రమే దానం చేయాలి. వాటినే ‘దశ దానాలు’ అంటారు.

ఇవి మొత్తం 10 దానాలు
దూడతో కూడుకున్న ఆవు, భూమి, నువ్వులు, బంగారము, ఆవు నెయ్యి, వస్త్రములు, ధాన్యము, బెల్లము, వెండి, ఉప్పు…ఈ పదింటిని దశ దానములుగా శాస్త్రం నిర్ణయించింది. వీటినే మంత్రపూర్వకంగా దానం చేయాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. ఏయే దానం వల్ల ఏయే ఫలం సిద్ధిస్తుందో తెలుసుకుందాం.

గోదానం
గోవు అంగములందు పదునాలుగులోకాలు ఉన్నాయి. బాగా పాలు ఇచ్చేది, మంచి వయసులో ఉన్నది, దూడతో కూడుకున్నది అయిన ఆవును బంగారు కొమ్ములు, వెండి డెక్కలు, కంచు మూపురము, రాగి తోక, నూతన వస్త్రములతో అలంకరించి, ఆ ఆవుతో పాటు పాలు పితుక్కునే పాత్రను ఇస్తూ, ఫల, దక్షిణ, తాంబూలములతో యథావథిగి దానం చేయాలి. గోవుకు కనీసం 6 నెలల గ్రాసాన్ని కూడా ఇవ్వాలి. ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై, దాతకు స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తాడు.

భూదానం
కృతయుగంలో హిరణ్యాక్షుని కారణంగా శూన్యంలోకి దొర్లిపోతుంటే.. శ్రీహరి వరాహావతారం ధరించి, ఆ భూమిని తన దంష్ట్రాగ్రంపై నిలిపి ఉద్ధరించాడు. సుక్షేత్రం, సమస్త సస్యసమృద్ధం అయిన భూమిని దానం చేయడం వల్ల అనంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ దానంతో శంకరుడు సంప్రీతుడై, దాతకు శివలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

తిలదానం
తిలలు అంటే నువ్వులు.శ్రీమహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చేయడం వల్ల సమస్త పాపములు నశిస్తాయి. ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై, దాతకు విష్ణులోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

హిరణ్య (బంగారం) దానం
హిరణ్యం అంటే బంగారం. బ్రహ్మదేవుని గర్భం నుంచి పుట్టిన బంగారాన్ని దానం చేయడం వల్ల, దాత సమస్త కర్మల నుంచి విముక్తుడు అవుతాడు. ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీతుడై, దాతకు అగ్నిలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

ఆజ్య(నెయ్యి) దానం
ఆజ్యము అంటే ఆవు నెయ్యి. ఈ నెయ్యి కామధేనువు పాల నుంచి ఉద్భవించింది. ఈ నెయ్యినే యఙ్ఞ, యాగాదులందు సకల దేవతలకు ఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తారు. అలాంటి ఆజ్యాన్ని దానం చేయడం వల్ల సకల యఙ్ఞఫలం లభిస్తుంది. ఈ దానంతో మహేంద్రుడు సంప్రీతుడై, దాతకు ఇంద్రలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

వస్త్రదానం
చలి నుంచి శరీరానికి రక్షణ కలిగించే వస్త్రం.. కేవలం అలంకారినికే కాకుండా, మాననాన్ని కూడా కాపాడుతుంది. అట్టి వస్త్రాలను దానం చేయడం వలన, సర్వ దేవతలు సంతోషించి, సకల శుభాలు కలుగాలని దాతను దీవిస్తారు.

ధాన్యదానం
జీవి ఆకలిని తీర్చేది ఈ ధాన్యం. జీవి ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణం. అట్టి ధాన్యాన్ని ఓ బండెడు దానం చేయుట వల్ల, సకల దిక్పాలకులు సంతృప్తి చెంది, దాతకు ఇహలోకమందు సకలసౌఖ్యం అనుగ్రహించి, పరమందు దిక్పాలకలోక ప్రాప్తిని అనుగ్రహిస్తారు.

గుడ(బెల్లం)దానం
రుచులలో మధురమైనది బెల్లం. ఈ బెల్లం చెరుకురసం నుంచి పుట్టింది. ఈ బెల్లం అంటే వినాయకునకు, శ్రీమహాలక్ష్మీదేవికి ఇష్టం. ఈ దానంతో లక్ష్మీ, గణపతులు సంప్రీతులై, దాతకు అఖండ విజయాలను, అనంత సంపదలను అనుగ్రహిస్తారు.

రజత(వెండి)దానం
అగ్నిదేవుని కన్నీటి నుంచి ఉత్పన్నమైనది ఈ వెండి. ఈ దానంతో శివ, కేశవులు, పితృదేవతలు సంప్రీతులై, దాతకు సర్వ సంపదలను, వంశాభివృద్ధిని అనుగ్రహిస్తారు.

లవణ(ఉప్పు)దానం
రుచులలో ఉత్తమమైనది ఉప్పు. ఈ దానంతో మృత్యుదేవత సంప్రీతుడై, దాతకు ఆయుర్దాయమును, బలాన్ని,ఆనందాన్ని అనుగ్రహిస్తాడు.

ఇవి దశ దానాలు. ఈ దానాలను గ్రహణ సమయాల్లో, పర్వదినాల్లో, సంక్రమణాల్లో చేస్తే దాని ఫలం పదింతలు అవుతుంది. ఈ దానాలనుభక్తి, శ్రద్ధలతో చేయాలిగాని, దానగ్రహీతకు ఏదో ఉపకారం చేస్తున్నామనే భావనతో చేయరాదు.

షోడశ దానాలు  – ఫలితాలు

1. కన్యా దానం – దీనివల్ల బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది.
2. సువర్ణ దానం – దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.
3. దాసీజనం దానం – దీనివల్ల ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుంది.
4. వాహన దానం – దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.
5. అశ్వ దానం – దీనివల్ల గంధర్వలోక ప్రాప్తి కలుగుతుంది.
6. గజ (ఏనుగు) దానం – దీనివల్ల శివలోక ప్రాప్తి కలుగుతుంది.
7. గ్రుహ దానం – దీనివల్ల విష్ణులోకం ప్రాప్తి కలుగుతుంది.
8. నాగలి దానం – దీనివల్ల క్రుష్ణ ప్రీతి కలుగుతుంది.
9. కాలపురుష దానం – దీనివల్ల కోరికల సిద్ధి కలుగుతుంది.
10. కాలచక్ర ప్రతిమ – దీనివల్ల ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది.
11. భూ దానం – దీనివల్ల శివలోకం నివాసం కలుగుతుంది.
12. మేక దానం – దీనివల్ల శివ ప్రీతి కలుగుతుంది.
13. వృషభ దానం – దీనివల్ల మృత్యుంజయం కలుగుతుంది.
14. పాన్పు దానం – దీనివల్ల గోలోక ప్రాప్తి కలుగుతుంది.
15. గో దానం – దీనివల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.
16. నువ్వురాశి దానం – దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.

అభ్యంగన స్నానం

అభ్యంగన స్నానం

అభ్యంగన స్నానం

మానవుడికి స్నానం అనునది ఒక భోగం. ఒక యోగం. స్నానాన్ని ఏదో ఒళ్లు తడిపాము అన్నట్లుకాక తనువు మనసు తడిచేలా అనుభూతి చెందుతూ స్నానం ఆచరించాలి. చన్నీటి స్నానం శిరస్సు నుంచి ప్రారంభించాలి. వేడి నీటి స్నానం పాదాల నుంచి ప్రారంభించి తరువాత శరీరం తడపాలి. పురుషులు విధిగా రోజూ శిరస్నానం ఆచరించాలి. పర్వదినాలలోనూ, జన్మదినముననూ, విశేష క్రతువుల ప్రారంభంలోనూ అభ్యంగన స్నానాన్ని తప్పకుండా ఆచరించాలి.

తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి. శరీరానికి తైలాన్ని (నువ్వులనూనెను) బాగా రాసి మర్దన చేసి నలుగు పిండితో ఒళ్ళు రుద్దుకుని గోరువెచ్చటి నీటితో స్నానం చేయడాన్ని ‘అభ్యంగన(తలంటి)స్నానం’ అంటారు. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి. కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి, గంగా దేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు.

‘అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం’ (అభ్యంగన స్నానం అన్ని అవయవాలూ పుష్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్ట్యా అభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మిక రీత్యా తైలభ్యంగనానికీ రీతిగా విశేష ప్రాధాన్యమీయబడింది.

అయితే అభ్యంగన స్నానం నిత్యం చేయకూడదు. శ్రాద్ధ దినములయందు, ఆది, మంగళ వారములు, పాడ్యమి, చవితి, షష్ఠి, అష్టమి, నవమి, చతుర్ధశి తిధులయందు అభ్యంగన స్నానం చేయకూడదు. అనివార్యమై చేయవలసి వచ్చినప్పుడు ఈ కింద సూచించిన విధము చేయడం వలన దోషము తొలిగి శుభం కలుగుతుంది.

అభ్యంగన స్నాన వారదోషములు

ఆదివారం      – తాపము. నివారణకు నూనెలో పుష్పములు.
సోమవారం    –   కాంతి, మనోల్లాసము.
మంగళవారం – మృతి. నివారణకు నూనెలో మన్ను.
బుధవారం    – లక్ష్మీ కటాక్షము.
గురువారం     – ధన నాశం. నివారణకు నూనెలో గరిక.
శుక్రవారం     – విపత్తు. నివారణకు నూనెలో గోమయం.
శనివారం       – భోగము

అయితే పండుగ, శుభదినములకు ఈ దోషము వర్తించదు. స్త్రీలకు గురు, శుక్రవారములు శుభములు.

Lucky Numbers

lucky-numbers

అదృష్ట సంఖ్యలు – మంచి రోజులు

మానవుడికి కలిసి వచ్చే సంఖ్యలు కూడా ఉంటాయి. వివిధ రాశుల్లో జన్మించిన జాతకులు అదృష్ట సంఖ్యలు, మంచి రోజులను బట్టి కార్యాచరణ చేయడం ఉత్తమమని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. అదృష్ట సంఖ్యల్లో వాహనాలు కొనడం, రాశికి అనుగుణమైన రోజున శుభకార్యాన్ని మొదలు పెట్టడం వల్ల శుభ ఫలితాలు చేకూరుతాయి.

సంఖ్యా జ్యోతిష శాస్త్రములో ఫలితములు తెలుసుకొనుట రెండు విధములు. అందులో ఒకటి.. వారివారి జన్మ తేదీని బట్టి ఫలితములు తెలుసుకొనుట. రెండవది జన్మ తేదీ లేకపోతే వారి పేరులోని అక్షరముల సంఖ్యల ప్రకారం తెలుసుకోవడం.

సంఖ్యలకు గ్రహాల నిర్ణయం
1 రవి 4 రాహువు 7 కేతువు 2 చంద్రుడు 5 బుధుడు 8 శని 3 గురుడు 6 శుక్రుడు 9 కుజ

ఇంగ్లీషు అక్షరములకు అంకెలు
A   B   C   D  E  F  G   H  I  J  K  L  M  N  O  P   Q  R  S  T   U  V W  X  Y  Z
1   2   3  4  9  8  7  6  5 1 1  2   3  5  7  8  1  2  3  4  6  6  6  5  1  7
దీనిని బట్టి ప్రతివారి పేర్లు ఫలితాలను, మిగిలిన విషయములో సులభంగా తెలిసుకొవచ్చు. ఏ సంఖ్యకు ఏ గ్రహమో తెలుసుకోవాలి. వాటి కారకత్వమును కూడా తెలిసికొనుట యుక్తము.
ఉదా:  RAJU
2116
2+1+1+6=10, (1+0) = 1 (అంటే రాజు అనే వ్యక్తికి 1 వస్తుంది. 1వ సంఖ్య వారు 1 సంఖ్య అధిపతి రవి. ఏ మాసములోనైనా 1, 10, 19, 28 తేదీలలో జన్మించినచో జన్మ సంఖ్య 1 అగును. వీరికి ఒకటి అదృష్ట సంఖ్య అగును. ఆది, సోమవారములు అదృష్ట రోజులు అవి.. 1, 10, 19, 28 తేది అయినచో విశేష అదృష్ట దినములగును. వీరికి 2, 4, 7 సంఖ్యలు తేదీలు అదృష్ట రోజులు. వీరికి ఏక సంఖ్య 2, 4, 7, ఇంకా.. 11, 13, 16, 20, 22, 25, 29, 31 తేదీలు ఇంకా.. ఆ సంఖ్యలు గలవి అనుకూలములైనవి అగును. వీరు కెంపును ధరించాలి. 2వ సంఖ్య వారు ఏ మాసంలో నైనను 2,11,20, 29 తేదీలలో జన్మించిన వారికి అదృష్ట సంఖ్య 2 అగును. అధిపతి చంద్రుడు. వీరికి 1, 4, 7 తేదీలు. ఇంకా రెండు అంకెలు సంఖ్యలు వచ్చు 10, 13, 16, 22, 25, 31 తేదీలు ఆ సంఖ్యలు కూడా అనుకూలమైనవి.

వీరికి ఆది, సోమ, శుక్రవారములు అనుకూలమైనవి. ఆ వారములు 2, 11 20, 29 అయినచో విశేష అదృష్టము. వీరు ముత్యము ధరించాలి. 3వ సంఖ్య వారు ఏ మాసములో నైనను 3, 12, 21 30 తేదీలలో జన్మించినచో అదృష్ట సంఖ్య 3 అగును. వీరికి 3,6,9 తేదీలు ఆ సంఖ్యగల వాహనములు, లాటరీ టిక్కట్లు అనుకూల ఫలితాలనిస్తాయి. వీరికి మంగళ, గురు, శుక్రవారములు అనుకూలమైనవి. ఆ వారములు 3, 12, 21, 30 తేదీలు అయితే ఇంకాను విశేష అదృష్ట ప్రదములైనవి. ఆసంఖ్యకు అధిపతి గురుడు. 6, 9, 15, 18, 24, 27 తేదీలు మరియు ఆ సంఖ్యలు కూడా అనుకూలమైనవి. మీరు కనకపుష్యరాగము ధరించాలి. 4వ సంఖ్య వారు ఈ సంఖ్యకు అధిపతి రాహువు. ఏ మాసములోనైనను 4, 13, 22, 31 తేదీలలో జన్మించిన వారికి జన్మసంఖ్య అనగా.. అదృష్ట సంఖ్య 4 అవుతుంది. వీరికి సోమ, ఆది, శనివారములు అనుకూలము. ఆ వారములు 4, 13, 22, 31 తేది అయితే ఇంకను విశేష శుభ ప్రదములు. వీరికి 1, 2, 7, 10, 11, 16,19, 20, 25, 28, 29 తేదీలు కూడా శుభప్రదములు.

వీరికి 1,2,7,10,11,16,19,20,25,28,29 తేదీలు కూడా అనుకూలమైనవి. వీరు ఉంగరములో గోమేధికము అనే రత్నము ధరించాలి. 5వ సంఖ్య వారు ఏ మాసంలోనైనను 5, 14, 23 తేదీలలో జన్మించిన వారి అదృష్ట సంఖ్య 5 అగును. ఈ సంఖ్యకు అధిపతి బుధుడు. వీరికి బుధ, శుక్రవారములు అదృష్ట రోజులు. ఆది, బుధ, శుక్రవారములు 5, 14, 23 తేదిలు అయినచో ఆ రోజుల విశేష అదృష్ట దినములగును. వీరు ఉంగరములో పచ్చ ధరించడం మంచిది. ఈ అంకెలు గల లాటరీ టిక్కెట్లు బుధ, శుక్రవారములలో కొనుట మంచిది.

6వ సంఖ్య వారు ఏ మాసములో నైనను 6, 15, 24 తేదీలలో జన్మించిన వారికి అదృష్టసంఖ్య 6 అగును. ఈ సంఖ్యకు అధిపతి శుక్రుడు. వీరు యితరుల అభిమానమును సులభముగా పొందగలరు. వీరు నలుపురంగు వస్త్రములు ధరించుట మంచిదికాదు. మంగళ, గురు, శుక్రవారములు అయినప్పుడు అట్టి తేదీలు గల దినములు విశేష అదృష్ట దినములగును. వీరు వజ్రం ధరించడం మంచిది.

7వ సంఖ్యవారు ఏ మాసంలోనైనను 7, 16, 25 తేదీలలో జన్మించిన వారికి జన్మ సంఖ్య 7 అగును. ఈ సంఖ్యకు అధిపతి కేతువు. ఈ సంఖ్య గల వారికి 2వ సంఖ్య గల వారితో సర్వవిషయములందును పొత్తుగా కుదురును. వీరికి ఆదివారము, సోమవారము 7, 16, 25, 29 తేదీలతో కూడి ఉన్నచో వ్యాపారము చేసి ధన సంపాదన చేయడంలో శక్తి యుక్తుల గలవారై ఉంటారు. వీరికి 1, 2, 4, 10, 11, 13, 19, 22, 28, 29, 31 తేదీలు సామాన్యంగా ఉండును వీరు ఉంగరములలో వైఢూర్యం ధరించడం మంచిది.

8వ సంఖ్య వారు ఏ మాసంలోనైనను 8, 17, 26 తేదీలలో జన్మించినవారి అదృష్ట సంఖ్య 8 అగును. దీనికి అధిపతి శని అందువల్ల ఉంగరములో ఇంద్రనీలం అనే రాయి ధరించుట శుభకరం. అదృష్ట తేదీలు 8, 17, 26. వీరికి శనివారము, సోమవారము, ఆదివారము కూడా అనుకూలమైన దినములు. వీరు ఏ కార్యమునైననూ 8, 17, 26 తేదీలలో ప్రారంభించడం మంచిది. నూతన వ్యాపారము కూడా ఈ తేదీలలో ప్రారంభించుట మంచిది.8, 17, 26 తేదీలు అదృష్ట సంఖ్యలు 9వ సంఖ్య వారు ఏ మాసంలోనైనను 9, 18, 27 తేదీలలో జన్మించిన వారికి అదృష్ట సంఖ్య 9 అగును. దీనికి అధిపతి కుజుడు. వీరు కుజ వ్యక్తులు. వీరు తరచుగా సైనికులుగా వ్యవహరిస్తారు. జీవితంలో 30సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కష్టములుగయున్నను. తరువాత స్వయంకృషితో ఉన్నతస్థాయికి చేరుకొంటారు. వీరికి మంగళ, గురు, శుక్రవారములు 3, 6, 12,15, 18, 21, 24, 27, 30, తేదీలు అనుకూలము. వీరు ఉంగరములో పగడం ధరించుట మంచిది. ఏ సంఖ్యనైనను 9తో గుణించగా వచ్చిన సంఖ్యలు గల అంకెలన్నింటిని కలుపగా మళ్లీ 9 వచ్చును. 12×9 = 108 మళ్లీ ఈ మూడు సంఖ్యలు కలిపి ఒక సంఖ్య చేస్తే 9 వచ్చును.

రాశులను బట్టి అదృష్ట సంఖ్యలు – శుభ దినాలు

మేషరాశి వారి అదృష్ట సంఖ్యలు 9, 1, 2, 3. ఆది, సోమ, గురు శుక్రవారాలు మంచి రోజులు. ఈ రోజుల్లో ఏ పనినైనా ప్రారంభించినా మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

వృషభరాశి వారి అదృష్ట సంఖ్యలు 6, 5, 8, 9. మంగళ, శుక్రవారాలు వీరికి మంచివి.

మిధునరాశి వారి అదృష్ట సంఖ్యలు 5, 1, 6, 7, 8. ఆది, శుక్ర, శని వారాలు వీరికి అదృష్టాన్నిచ్చే రోజులు.

కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్యలు 2 మాత్రమే. మంగళ, శుక్రవారములు మంచివి.

సింహరాశి వారి అదృష్ట సంఖ్యలు 1, 2, 3, 5, 9. ఆది, మంగళ, గురువారములు వీరికి అనుకూలం.

కన్యారాశి వారి అదృష్ట సంఖ్యలు 5, 1, 3, 4, 6. ఆది, శుక్ర, సోమ వారాల్లో శుభకార్యాలు తలపెట్టడం మంచిది.

తులారాశి వారి అదృష్ట సంఖ్యలు 6, 2, 7, 9. సోమ, శుక్ర, శని వారాలు వీరికి అనుకూలిస్తాయి.

వృశ్చికరాశి వారి అదృష్ట సంఖ్యలు 9, 1, 2, 3. ఆది, సోమ, గురు వారాలు యోగప్రదాలు.

ధనుస్సురాశి వారి అదృష్ట సంఖ్యలు 1, 2, 4, 5. ఆది, బుధ, గురు వారాలు వీరికి కలసివస్తాయి.

మకరరాశి వారి అదృష్ట సంఖ్యలు 8, 3, 4, 5, 9. సోమ, మంగళ, శుక్రవారములు మంచివి.

Marriage Late

Marriage Late

వివాహము ఆలస్యం
వివాహం ఆలస్యం, ప్రయత్నాలలో చికాకులు విషయంగా రవితో సంబంధం అయిన సందర్భంలో శివ కల్యాణం చేయించడం, నిత్యం శివాలయంలో శివారాధన చేయడం, చంద్రుడితో దోషం ఉన్నప్పుడు గిరిజా కళ్యాణం చేయించడం మరియు సుబ్రహ్మణ్య పూజలు చేయడం, బుధ గ్రహంతో దోషం వున్నప్పుడు రుక్మిణీ కళ్యాణం ఘట్టం రోజూ పారాయణ చేయడం అలాగే కుదిరినప్పుడు శ్రీనివాస కళ్యాణం చేయించడం, గురువుతో వివాహ విషయమై దోషం వున్నప్పుడు శివ కల్యాణం చేయించి పంచాక్షరీ మంత్రానుష్ఠానం చేయించడం. శుక్ర సంబంధమయిన దోషంతో వివాహ ప్రతిబంధకాలు వున్నవారు రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయడం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం అవసరం.

శని దోషంగా ఉండి వివాహ విషయంగా ప్రతిబంధకాలు ఎదురైనప్పుడు శివ కళ్యాణం చేయించి నిత్యం రామనామం చెబుతూ ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణలు చేయడం, రాహువుతో వివాహ విషయంగా ప్రతిబంధకాలు ఉన్నప్పుడు పార్వతీ కళ్యాణం చేయించి రోజూ దుర్గా సప్తశ్లోకా పారాయణ, ఇంకా లలితా సహస్ర పారాయణ చేయడం, కేతువుతో దోషం చెప్పబడినప్పుడు విఘ్నేశ్వరుడికి చతురావృత్తి తర్పణాలు చేయించి నిత్యం లక్ష్మీ నృసింహ స్తోత్ర పారాయణ చేయడం శుభకరం.

అయితే ఏ గ్రహ సంబంధమయిన దోషం వున్నా ‘కన్యాపాశుపతం’ చేయిస్తారు. గ్రహ సంబంధమైన ఏ విధమైన దోషం ఉన్ననూ నిత్యం నవగ్రహాలకు ప్రదక్షిణలు 11 చేసి అనంతరం శివుడికి 11 ప్రదక్షిణలు చేసి శివసన్నిధిలో విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం శుభం. దీనికి కారణం సృష్టి పరిపాలకులు గ్రహ గమన నిర్దేశకులు హరిహరులు సంతృప్తి పొందితే సత్వరం శుభ ఫలితాలు ఉంటాయి. పై శాంతి చేయించడం ద్వారా జాతకంలో రాసి వున్న వివాహ దశలు కాలం మారవు. ప్రయత్నాలలో అవరోధాలు చికాకులు తొలగుతాయి.

ఇక విద్యా విషయంగా పరిశీలిస్తే రవి దోషంగా ఉంటే అనుగ్రహం కావలసి వచ్చినను గురు శని విషయంలో కూడా దక్షిణా మూర్తి ఆరాధన త్వరగా సత్ఫలితాలను ఇస్తుంది. చంద్రగ్రహ విషయంలో బాలానుష్ఠానం, కుజ గ్రహ విషయంలో సుబ్రహ్మణ్య ఆరాధన, బుధ గ్రహ విషయంలో హయగ్రీవోపాసన, శుక్రగ్రహ విషయంలో హయగ్రీవోపాసన, రాహు గ్రహ విషయంలో బాలామంత్రానుష్ఠానం, కేతువు గ్రహ విషయంలో శ్రీవిద్యా గణపతి అనుష్ఠానం చెబుతారు. అయితే ‘ఈశానస్సర్వ విద్యానాం’ అనే వేద వాక్యం ఆధారంగా ‘ఓం నమశ్శివాయ’ శివ షడక్షరీ మంత్రానుష్ఠానం దీక్షగా మెడిటేషన్ చేసిన వారికి విద్యా విజ్ఞాన యోగం తప్పక లభిస్తుంది.

పిల్లలు సరిగా మాట వినకపోయినా, సరైన దారిలో లేకున్నానూ, విద్యా ఉద్యోగ వివాహ విషయములలో సమస్యలతో ఉంటే.. శ్రీరామ శ్శరణం మమ’ అని 108 ప్రదక్షిణలు ఆంజనేయ స్వామికి ప్రతిరోజూ చేయడం ద్వారా తల్లిదండ్రులు సత్ఫలితాలు అందుకుంటారు.

ఉద్యోగ విషయంలో రవి గురు శని దోషం ఉంటే పాశుపతి అభిషేకం చేయించి ప్రదోష కాలంలో శివాలయంలో చండీ ప్రదక్షిణలు చేయాలి. చంద్ర శుక్ర రాహు దోషం ఉంటే చండీ సప్తశతీ పారాయణ, కుజగ్రహ దోషం ఉంటే సర్పసూక్తంతో అభిషేకం, బుధ కేతు గ్రహ దోషం ఉంటే లక్ష్మీ గణపతి అనుష్ఠానం శ్రేయస్కరం.

సంతానం కొరకు పురాణాలలో చాలా విశేషములు ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ వ్యాస మహర్షి మొదలగు వారు సంతానం కొరకు శివారాధన చేసినట్లు పురాణాలలో చెప్పబడింది. సంసారంలో చికాకులు తొలగి భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరుగుటకు ‘శివకామేశ్వరాంకస్టా శివాస్వాధీన వల్లభా’ అనే వాక్యం లలితా సహస్రంలో ప్రతి శ్లోకానికి ముందు వెనుక చెప్పి మూడు కాలాలతో చేయుట ద్వారా మంచి ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయి.

స్నానాలు కూడా..
గ్రహ దోషాలు తొలగిపోవడానికి నియమబద్ధమైన పూజలే కాదు, వివిధ రకాల స్నానాలు కూడా ఉన్నాయి. కుంకుమ, ఎర్ర చందనం కలిపిన రాగిపాత్రలోని నీటితో స్నానం చేయడం వల్ల సూర్యగ్రహ దోషాలు తొలగిపోతాయి. కుంకుమ – గంధం కలిపిన నీటిని ‘శంఖం’తో పోసుకుంటే చంద్ర గ్రహ దోషాలు దూరమవుతాయి. అలాగే గంధం, తిలలు కలిపిన ‘రజిత పాత్ర’లోని నీటితో స్నానమాచరించడం వలన కుజ దోషాల బారినుంచి బయటపడ వచ్చును.

ఇక నదీ సాగర సంగమంలోని నీటిని మట్టిపాత్రలో పోసి స్నానం చేసినట్లయితే బుధగ్రహ దోషాలు వదలిపోతాయి. మర్రి, మారేడు కాయలను బంగారుపాత్రలోని నీటిలో వేసి స్నానం చేస్తే గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. శుక్రుడిని ధ్యానిస్తూ ‘రజిత పాత్ర’లోని నీటితో స్నానం చేయడం వలన శుక్ర గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుంది.

ఇక నువ్వులు, మినువులు కలిపిన ‘లోహపాత్ర’లోని నీటితో స్నానం చేయడం వలన శనిగ్రహ ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. ఇక గేదె కొమ్ము(డొల్ల)తో స్నానం చేయడం వలన రాహు గ్రహ దోషాలు.. పవిత్రమైన మట్టిని కలుపుకుని స్నానం చేయడం వలన కేతు గ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. ఈ నియమాలను పాటించడం వల్ల ఆయా గ్రహ దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది.