Menu

Hessonite

 గోమేధిక‌ము విశిష్ట‌త‌

గోమేధిక‌ము రాహు గ్రహానికి సంబంధించిన ర‌త్న‌ము. ఇది ఇన్ ఆర్గానిక్ జెమ్ స్టోన్. ఇవి మంచి తేనె రంగులో మెరిసిపోతుంటాయి. గోమేధికాన్ని ఇంగ్లీషులో ‘హెసోనైట్’ అంటారు. మంచి గోమేధికాలకు శ్రీలంక ప్రసిద్ది. బంగారు రంగులలోనూ గోమేధికాలు దొరుకుతాయి.

రాహు గ్రహానికి ఆది దేవత గోమాతగా వేదములందు పేర్కొన‌బ‌డింది. అట్టి గోమాత యొక్క మూత్రం వంటి రంగు కల్గిన గోమేధికం రాహు సంబంధమనుటలో నిస్సందేహం లేదు. కావున రాహుగ్రహ ప్రీతికరమైన గోమేధికమును ధరించుట వలన జాతక గోచారములందలి రాహు దోషాలు నివారింపబడి సకల శ్రేయోభివృద్ధి క‌లుగుతుంది.

ఎవ‌రు.. ఎప్పుడు ధ‌రించ‌వ‌చ్చు..?
ఆర్ద్ర, స్వాతి, శతభిషం జన్మనక్షత్రాలవారు ఏ సమయమునందైనను గోమేధికమురత్నమును ధరించవచ్చును. మిగిలిన నక్షత్రములవారు మాత్రం తమ జన్మ సమయమునందలి గ్రహస్థితిననుసరించి, బలవంతుడైన రాహువు దుష్ట స్థానములందున్న దశాంతర్దశ స‌మ‌యంలో మాత్రమే గోమేధికం ధరించడం మంచిది. ఎవరికైనను వారి జన్మ జాతకములందు రాహువు గ్రహము షడ్భలములు అషటకవర్గ బిందుబలము కలిగి జన్మలగ్నము నుండి 6-8-12 స్థానములందున్నను, ఆ అధిపతితోకూడుట చూడబడుట, తటస్థించినను, ఆ స్థానమునందు ఇతర పాపగ్రహ దృగ్యోగవేధా సంభంధము కలిగినను రాహువు బహుదోషప్రదుడు, 2-5-7 స్తానములందు పాప గ్రహ సంబంధము కలిగి రాహు ఉన్నను, గురు సంబంధంను కలిగి ధనుర్మీన రాశుల్లో ఉన్నను, గురు సంబంధమును కలిగి రాహువు ఉన్నను, శని కుజుల సంభంధము కలిగి జన్మలగ్నమునందున్నను, అధిక దోషప్రదుడై అపకారముల నొనర్చును, చంద్రుడు బలహీనుడై ఉండగా బలవంతుడైన రాహువు నవమస్థానములో ఉండిన (శుభ దృష్టి లేక )బాలారిష్టంలు కలుగచేయగలడు.

రాహువునకు జాతకమునందలి అశుభ దశాంతర్దశలు ప్రప్తించినప్పుడు, గోచారమునందు రాహువు సంచారము దోషయుక్తమైన కాలమునందు వివిధ రూపములలో కష్టనష్టాలు, ఈతి బాధలు, దారున పరిస్థితులు తటస్థించి దుఃఖ ప్రదముగా ఉండగలదు. అతేకాక దుష్టగ్రహమైన రాహుగ్రహ ఫలికాలంలో కుటుంబకలహాలు, అజన విరోధములు, ఆస్తినష్టము విద్యాభంగము, వ్యాపార నష్టము, కోర్టు చిక్కులు, రోగచోర రుణబాధలు, వృత్తి ప్రతికూలత, ఆర్థిక, సామాజిక బాధలు, దెయ్యములు, ప్రయోగాదిగాగల దుష్టగ్రహ బాధలు, ఉన్మాదము, మతిభ్ర‌మ మొదలగు మానసిక వ్యాధులే గాక కీళ్ళవాతాలు నులి పురుగులు చేరుట, కడుపులో ఏలిక పాములు విరోచనాలు (అతిసారం) లివరు, పశికర్లు, గర్భకోశంలో వాపు, కాన్సర్, కడుపునొప్పి, మలబద్దకము మెదడుకు సంభంధించిన అనేక వ్యాధులు రహస్యముగా ఆచరించే చెడుపనులు, దుష్టుల స్నేహం వలన ఆపదవలు మొదలగు అనేక కష్ట నష్టములు దుఃఖబాధలు సంభవింపగలవు.

ఫ‌లితాలు
ఇది రాహుగ్రహానికి సంబంధించిన రత్నము క‌నుక రాహుగ్రహ దోషములన్నింటినీ పరిహరింపజేయుటమే గాక కుటుంబసౌఖ్యం జనానుకూలత, విధ్యాభివృద్ది, కృషిలో విజయం, ఆర్ధికపుష్టి, వృత్తిలాభం, సమాజంలో గౌరవం, ఆరోగ్యం, స్త్రీమూలక ధనప్రాప్తి, ఆకస్మిక ద్రవ్య లాభము, వారసత్వపు ఆస్తిసంక్రమించుట, రుణబాధలు తీరిపోవుట, సన్మిత్రలాభం, బందువుల ఆదరణ క‌లుగుట, మాతామహ వర్గీయుల ద్వారా ఉపకారం, రాజకీయ, కోర్టు వ్యవహారములందు పరిష్కారము, గంగా స్నానఫలము, దైవభక్తి స్థిరబుద్ది, సన్మానమార్గము ధనాభివృద్ది, ఆకస్మిక ప్రమాదములనుంచి, దుష్టగ్రహ పీడల నుంచి రక్షణ, శతృనాశనము, మిత్రవర్గముల వారి సహాయ సంపత్తి లభించుట, గండములు తోలగిపోవుట, దీర్ఘవ్యాధుల నుండి విముక్తి, సంపూర్ణారోగ్యము, భూగృహక్షేత్ర సంపద కలుగుట, అఖండకీర్తి, జయము క్షేమము, ఉల్లాసము కలుగగలవు.

గోమేధికం ధరించే పద్దతి
దోషములు లేని ఉత్తమ లక్షణంలు గల గోమేధికం బంగారం లేక పంచలోహముల ఉంగరమునందు బిగించి ధరించ‌డం వ‌ల్ల‌ అభీష్టము చేకూరగలదు. వెండి గోమేధికమును బిగించుటకు పనికిరాదు. ఈ రత్నమును బిగించు ఉంగరంపై భాగముపై చేట ఆకారంగా పీఠము ఏర్పాటుగావించి అడుగుభాగం మాత్రం రంద్రము నుంచి గోమేధికంను పీఠం మధ్య భాగంలో బిగించి శుద్ది గావించి ధరించవలెను.

రాహుగ్రహస్తమైన సూర్య లేక చంద్ర గ్రహణములు సంభవించిన కాలమునందుగానీ, ఆదివారము పుష్యమీహస్తా నక్షత్ర యుక్తమైనపుడు కానీ, సప్తమీ ఆదివారము వచ్చినప్పుడుగానీ అదే విధంగా అమావాస్య ఆదివారము నాడు గానీ మకర సంక్రాంతి పుణ్యకలమునందుగానీ సూర్యుని హోరా జరిగే సమయంనందుగానీ శాస్త్రీయంగా తయారు చేయబడిన ఉంగరం నందు గోమేధికమును బిగించాలి. ఆ తదుపరి ఉంగరంను ఒక రోజంతా కాకరాకు పసరయందు, మరుసటిరోజు గోమూత్రము నందు, 3వ రోజును ఆవుపాల యందు నిద్ర గావింపజేసిన పరిశుద్దము కాగలదు. ఆ త‌ర్వాత‌ పంచామృత స్నానం గావింపజేసి శాస్త్రోక్తకంగా షోడశోపచార పూజలు గావింపజేసి శుభముహుర్తమునందు వేలికి ధరించడం మంచిది.

ధరించే వారికి తారాబలం చంద్రబలంలు కలిగియున్న శుభతిధులు కలిగి ఉన్నప్పుడు వర్జ్య దుర్ముహుర్తాలు లేని కాలంలో మృగశిర, ఉత్తర, చిత్త, శతభిషం, ఉత్తరాభాద్ర నక్షత్రములయందు వృషభ, మిధున, సింహం కుంభలగ్నములు జరుగు సమయములందు పూజించిన ఉంగరంను ధరించవలెను. ధరింపబోవు సమయంనకు ముందు ఉంగరంను కుడి హస్తమునందు ఉంచుకొని దక్షిణ ముఖంగా తిరిగి నిలబడి గురువుని, గణపతిని ధ్యానించి “ఓం భ్రీం ఐం హ్రీం శ్రీం తమోగ్రహాయ స్వాహా” అను మంత్రంను 108 పర్యాయాలు జపించి ఉంగరమును మ‌రోసారి క‌ళ్ల‌కు అద్దుకొని కుడిచేతి ఉంగరపు(అనామిక) వేలికి ధరించాలి. స్త్రీలు ఎడమ వ్రేలికి ధరించుట ఆచారము ఉంది. నవరత్నములను గాక ఇతర రత్నములు చేయించు ఉంగరములో గోమేధికముతో బాటుగా ముత్యాలను, వైడూర్యములు చేర్చి ఉంగరమును ధరించకూడదు.