Menu

Karkatakam-Lagnam- Grahamulu

కర్కాటక లగ్న – ద్వాదశ గ్రహములు – ఫలితాలు

కర్కాటక లగ్నంలో జ‌న్మించినవారు భోజన ప్రియులు,  వినయవంతులు, జలక్రీడాసక్తుడు. సారగ్రాహి, ఉదారుడు అవుతారు. ఈ జాతకునకు శుక్ర, శని, బుధ, గురు లు పాపులు. కుజుడు రాజయోగకారకుడు, గురు, కుజులు రాజయోగాన్ని ఇస్తారు. శుక్రుడు మారకాన్ని కలిగిస్తాడు.

సూర్యుడు
కర్కాటక లగ్నానికి సూర్యుడు ధనస్థానాధిపతి. కటక లగ్నస్థ సూర్యుడు ఈ జాత‌కుడికి ఆరోగ్య సమస్యలు సృష్టిస్తాడు. రవి దశలో అన‌రోగ్య సమస్యలు త‌ప్ప‌వు. వీరికి కోపం, స్వాభిమానం ఎక్కువ. వ్యాపారం మీద ఆసక్తి , ఉద్యోగం మీద కోరిక ఉంటాయి. ప్రభుత్వం నుంచి, ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి సమస్యలు ఎదుర‌వుతాయి. తండ్రితో అభిప్రాయ బేధాలు త‌లెత్తుతాయి. అలాగే బంధుమిత్రులతోనూ అభిప్రాయబేధాలు త‌లెత్త‌వ‌చ్చు. వీరిది నిలకడైన మ‌న‌స్థ‌త్వం కాదు. వీరికి భాగస్వామ్యం కలిసి రాదు. కటక లగ్నస్థ సూర్యుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానమైన మకరం మీద దృష్టిని సారిస్తాడు.. ఈ కార‌ణం వ‌ల్ల‌ జీవితభాగస్వామితో అభిప్రాయ బేధాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో కొన్ని అనుకోని సమస్యలు ఏర్ప‌డ‌వ‌చ్చు.

చంద్రుడు
కర్కాటక లగ్నానికి చంద్రుడు లగ్నాధిపతి, రాశ్యాధిపతిగా కారక గ్రహమై మంచి ఫ‌లితాలు ఇస్తాడు. కటక లగ్నస్థ చంద్రుడు భగవత్భక్తి, పెద్దల మీద గౌరవ మర్యాదలు కలిగిస్తాడు. ఈ జాత‌కుల‌కు మనోబలం ఎక్కువ. సొంత ప్ర‌య‌త్నంతో సమాజంలో ఉన్నత స్థానం చేరుకుంటారు. వ్యాపార, కళారంగాలలో సాఫల్యత కలుగుతుంది. జ్ఞానం, ఉన్నత విద్య కలిగి ఉంటారు. నిజ‌మైన మాట‌లే కాని, కఠినంగా మాట్లాడటం వల్ల‌ వీరు విరోధమును ఎదుర్కొంటారు. లగ్నస్థ చంద్రుడు పూర్ణ దృష్టిని సప్తమ భావం మీద ప్రసరిస్తాడు కనుక జీవిత భాగస్వామికి సౌందర్యం ఇస్తాడు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. వీరికి భాగస్వామ్యం కలసి వస్తుంది. భాగస్వాములు సహకరిస్తారు. వైవాహిక జీవితంలో పెద్ద‌గా స‌మ‌స్య‌లు లేకుండా సాఫీగా సాగిపోతుంది.

కుజుడు
కర్కాటక లగ్నానికి కుజుడు పంచమాధిపతి, దశమాధిపతి. త్రికోణాధిపతిగా, దశమాధిపతిగా కారక గ్రహమై మంచి ఫలితాన్ని ఇస్తాడు. అయినా లగ్నస్థ కుజుడు వ్యక్తికి క్రోధగుణం, ఉగ్రస్వభావం కలిగిస్తాడు. ఈ జాత‌కుల‌కు రాజకీయాలు లాభిస్తాయి. లగ్నం నుంచి కుజుడు చతుర్ధ, సప్తమ, అష్టమ భావముల మీద దృష్టిని ప్రసరిస్తాడు కనుక ఆర్ధిక లాభం, అధిక వ్యయం కలిగిస్తాడు. తెలివితేటలు పేరాశ వీరికి అవమానాలను ఇస్తుంది. లగ్నస్థ కుజుడు సంతాన ప్రాప్తి కలిగిస్తాడు. కుజుడి సప్తమ దృష్టి కారణంగా వైవాహిక జీవితంలో మాధుర్యం లోపించి కలహ పూరితంగా ఉంటుంది.

బుధుడు
కటక లగ్నానికి బుధుడు తృతీయ, ద్వాదశ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు. బుధుడి కటక లగ్నస్థ స్థితి వ్యక్తికి సందేహాస్పద వ్యక్తిత్వం, ఆచరణ, అలవాట్లు కలిగి ఉంటాడు. ఈ జాత‌కుల‌కు వ్యాపారంలో కంటే ఉద్యోగంలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరికి బంధుమిత్రులతో సోదరులతో విశేషమైన ఆప్యాయత ఉండదు. బుధుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టిని ప్రసరిస్తాడు కనుక వైవాహిక జీవితంలో స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. భాగస్వాముల వలన హాని ఉంటుంది. శత్రువుల వల్ల స‌మస్య‌లు ఎదుర్కొవాల్సి ఉంటుంది.

గురువు
కటక లగ్నానికి గురువు షష్టమ, నవమభావాలకు అధిప. లగ్నానికి గురువు త్రికోణాధిపత్యమైన నవమస్థానాధిపతిగా కారక గ్రహమై మంచి ఫలితాలను ఇస్తాడు. కటక లగ్నంలో గురువు ఉచ్ఛస్థితిని పొందుతాడు కనుక వ్యక్తికి ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని ప్రసాదిస్తాడు. గురువు పరిపూర్ణ దృష్టితో మిత్ర స్థానమైన పంచమ స్థానం గ‌ల వృశ్చికాన్ని, సప్తమ స్థానాన్ని, నవమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక సంతాన భాగ్యం ఉంటుంది. ఈ జాత‌కుల‌కు ఉత్తమమైన జీవితభాగస్వామి లభిస్తుంది. భాగస్వాముల సహాయ సహకారాలు అందుతాయి. నవమ స్థాన దృష్టి ఫలితంగా సంపూర్ణ భాగ్యశాలి అవుతాడు. ధన, ధాన్య సంపదలతో జీవితం పరిపూణ భాగ్యంతో గడుస్తుంది. వ్యాపారంలో ఉదారత, దయాస్వభావం కలిగి ఉంటారు.

శుక్రుడు
కటక లగ్నానికి శుక్రుడు చతుర్ధ, ఏకాదశాధిపతి. లగ్నస్థ శుక్రుడు వ్యక్తికి పిరికితనం, భయం కల్గిస్తాడు. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగ అవ‌సరాలలో సఫలత లభిస్తుంది. లగ్నస్థ శుక్రుడు సప్తమ దృష్టి శని స్థానం మిత్ర స్థానమైన మకరం మీద ఉంటుంది కనుక వ్యక్తికి పరిశ్రమించే గుణం ఉంటుంది. స్త్రీల మీద వీరికి విశేష ఆకర్షణ ఉంటుంది. అందమైన శ్రమకు ఓర్చే జీవిత భాగస్వామి లభిస్తుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు.

రాహువు
కటక లగ్నంలో రాహువు వ్యక్తిని విలాసవంతుడిగా చేసి భోగముల మీద ఆకర్షణ కలుగచేయును. కఠిన శ్రమ‌ తరువాత వ్యాపారంలో సఫలత సాధిస్తారు. ఉద్యోగములో తొంద‌ర‌గానే సఫలత లభిస్తుంది. రాహువు సప్తమ దృష్టి ఫలితంగా వైవాహిక జీవితంలో అశాంతి చోటు చేసుకునే అవ‌కాశం ఉంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభించవు. భాగస్వామి వల్ల‌ నష్టాలు కలుగవచ్చు.

కేతువు
కటక లగ్నస్థ కేతువు ఆరోగ్య సమస్యలు కలిగిస్తాడు. కేతు దశ సమయంలో అన‌రోగ్య స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు. సమాజం నుంచి గౌరవం, సన్మానాల పట్ల ఆసక్తి కల్గి ఉంటారు. ర‌హ‌స్య శత్రువులు ఉంటారు. వారి వలన సమస్యలు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. కేతువు సప్తమ స్థాన దృష్టి ఆ స్థానకారకత్వమును బాధిస్తుంది. వైవాహిక జీవితంలో సుఖం లోపిస్తుంది. వివాహేతర సంబంధాలు కలిగే అవకాశం ఉంటుంది.