Menu

Lagnam Graham

Mesham-Lagnam- Grahamulu

Mesham-Lagnam- Grahamulu
మేష లగ్నస్థ గ్రహములు 
మేష‌ల‌గ్న‌స్థ గ్ర‌హ‌ జాత‌కులు చురుకైన తత్వం క‌లిగి ఉంటారు. కోప స్వభావం ఉండును. వీరికి దీర్ఘ‌కాల శత్రువులు ఉంటారు. దైర్యము, ఆశ అధిక‌మే. ఇక వీరు మంచి భోజన ప్రియులు.
మేషలగ్నాధిపతి కుజుడు. కుజుడు లగ్నాధిపతి (లగ్నం అంటే జన్మరాశి చక్రంలో మొద‌టి స్థానం) కాక అష్టమాధిపతి (అంటే జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి 8వ స్థానం) కూడా. తృతీయ (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి మూడ‌వ స్థానం) షష్టాధిపతి (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి ఆర‌వ స్థానం) బుధుడు, ధన (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి రెండ‌వ స్థానం) సప్తమాధిపతి (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి ఏడ‌వ స్థానం) శుక్రుడు, వాహనాధిపతి (అనగా జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి నాలుగ‌వ స్థానం) చంద్రుడు, పంచమాధిపతి (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి ఐద‌వ స్థానం) సూర్యుడు, భాగ్య (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి తొమ్మిద‌వ స్థానం) వ్యయాధిపతి (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి ప‌న్నెండ‌వ స్థానం) గురువు, రాజ్య (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి ప‌ద‌వ స్థానం) లాభాధిపతి (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి ప‌ద‌కొండ‌వ స్థానం) శని.
మేష లగ్నములో ఉండే గ్రహములు – ఫలితాలు
సూర్యుడు 
మేషలగ్నానికి సుర్యుడు పంచమాధిపతి.. కనుక సూర్యుడు మేషలగ్నానికి శుభుడు. పంచమాధిపతి లగ్నములో ఉచ్ఛస్థితిలో ఉపస్థితమై ఉండ‌టం వ‌ల్ల ఈ జాత‌కుడు అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాడు. విద్యారంగంలో రాణిస్తాడు. ఇక‌ ఆర్ధిక వ్య‌వ‌హారాల పరిస్థితి బాగుంటుంది.  సుర్యుడి ప్రభావం వల్ల‌ సంతాన ప్రాప్తి కలుగుతుంది. సూర్యుడు తన పూర్ణ దృష్టితో సప్తమ భావమైన తులారాశిని చూస్తాడు కనుక తులారాశి అధిపతి సూర్యుడు. కనుక జీవితభాగస్వామి అందముగా ఉంటారు. జీవిత భగస్వామి సంయోగము లభిస్తుంది. అయితే వైవాహిక జీవితములో ఒడిదుడుకులు త‌ప్ప‌క‌పోవ‌చ్చు.
చంద్రుడు
చంద్రుడు మేషలగ్నానికి సుఖస్థానాధిపతి. ఈ కార‌ణం వ‌ల్ల ఈ జాతకుడు శాంత స్వభావుడిగా క‌నిపిస్తాడు. అయితే కొంటెతనం కూడా కలిగి ఉంటారు. ఇక వీరికి విలాసవంతమైన జీవితం అంటే ఇష్ట‌ప‌డ‌తారు. వీరికి మాతృమూర్తి నుంచి, మాతృమూర్తి ప‌క్ష‌ము నుంచి స‌హాయం అందుతుంది. అంతేకాదు ప్రభుత్వ పక్షము నుంచి ప్రయోజనాలు అందుతాయి. సప్తమంలో తులారాశి మీద చంద్రుడి దృష్టి పూర్ణముగా ప్రసరిస్తుంది కనుక జీవిత భాగస్వామి కళాదృష్టి, గుణసంపద కలిగి, సహాయ సహకారాలు అందించే వారై ఉంటారు. ఇక ఈ జాత‌కులు భూమి, భవనము, వాహన ప్రాప్తి కలిగి ఉంటారు. ప్రకృతి ఆరాధన, సౌందర్యపిపాస కలిగి ఉంటారు. శీత‌కాలంలో వీరు ఇబ్బంది ప‌డ‌తారు. ద‌గ్గు, జలుబు వంటి బాధలు బాధిస్తాయి. ఇంకా చలి సంబంధిత వ్యాధుల‌కు అవకాశము క‌ల‌దు.
కుజుడు 
కుజుడు మేషలగ్నానికి లగ్నాధిపతి, అష్టమాధిపతి. లగ్నాధిపత్యము వలన అష్టమాధిపత్య దోషం పోతుంది. కుజుడు లగ్నస్థుడు కనుక ఈ జాతకుడు బ‌ల‌మైన శ‌రీర‌ము క‌లిగి ఉంటారు. సాహ‌స‌వంతులుగాను క‌నిపిస్తారు. కండ బ‌ల‌ముతో పాటు. కఠినమైన పనులను కూడా ఆత్మబలముతో చేయకలిగిన స‌త్తా ఉంటుంది. సమాజంలో  పేరు, ప్రతిష్ఠలు కలిగి ఉంటారు. బలహీనుల పట్ల వీరి హృదయములో సానుభూతి ఉంటుంది. కుజుడు చతుర్ధ స్థానమును, సప్తమ స్థానమును, అష్టమస్థానమును చూస్తాడు. దీని కారణముగా భూమి, వాహన సౌఖ్యము లభిస్తుంది. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్ప‌డ‌తాయి.
బుధుడు
బుధుడు మేషలగ్నానికి తృతీయ, షష్టమభావాధిపతిగా అశుభము కలిగించును. లగ్నములో ఉన్న బుధుడు వ్యక్తిని జ్ఞానిగా, బుద్ధిమంతుడిగా చేస్తుంది. బుధ దశలలో బంధు మిత్రులతో వివాదాలు ఏర్ప‌డ‌తాయి. షష్థమ స్థానాధిపతిగా బుధుడు ఉదర సంబంధమైన వ్యాధులు, మూర్చ వ్యాధి, మతిమరుపు ఏర్ప‌డే అవ‌కాశాలున్నాయి. వ్యాపారములో వీరికి సఫలత లభిస్తుంది. బుదుడి సప్తమ దృష్టి కారణంగా సంతాన సంబంధాలలో సమస్యలు వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. సప్తమమైన తులారాశి మీద బుధుడి దృష్టి కారణముగా జీవిత భాగస్వామి గుణవంతుడుగా ఉంటాడు. వైవాహిక జీవితం సాధారణముగా ఉంటుంది.
గురువు 
మేషలగ్నానికి గురువు భాగ్యాధిపతి వ్యయాధిపతి. ద్వాదశస్థానాధిపత్యము కారణము వ‌ల్ల‌ గురువు మేషలగ్నానికి అకారణమైన అశుభ ఫలములు ఇస్తాడు. అయినా త్రికోణాధిపత్యంతో అశుభము తొలగిపోతుంది. మేషలగ్న గురువు కారణముగా జాతకుడు మంచి మేద‌స్సు క‌లిగి ఉంటారు, జ్ఞాని అవుతారు. ఉజ్వలమైన ప్రభావవంతమైన వాక్కు వీరి సొంతం. వీరికి ప్రజా సన్మానం, పేరు ప్ర‌ఖ్యాత‌లు కలుగుతాయి. లగ్నస్థ గురువు పంచమ, సప్తమ, నవమ భావమును చూస్తాడు కనుక సంతాన భాగ్యం ఉంటుంది. శత్రు స్థానమైన తులారాశి మీద గురువు దృష్టి ప్రసరిస్తుంది కనుక జీవిత భాగస్వామికి మనోకలతలు ఉంటాయి. నమస్థానమైన ధనసు మీద గురువు దృష్టికి కారణంగా తండ్రికి శుభములు కలుగుతాయి.
శుక్రుడు
శుక్రుడు మేష లగ్నానికి ద్వితీయ సప్తమ స్థానాధిపతి. శుక్రుడు లగ్నస్థము కార‌ణంగా స‌మ‌స్య‌లు కలిగిస్తాడు. ఈ జాత‌కులు అందంగా కనిపించినా ఆరోగ్యసమస్యలను మాత్రం ఎదుర్కొంటారు. శుక్ర దశలో వీరు ఊహించ‌ని కష్టాల‌ను ఎదుర్కొంటారు. లగ్నస్థ శుక్రుడి కారణముగా స్త్రీ పురుషల మద్య ఆకర్షణ ఉంటుంది.
శని 
లగ్నస్థ శని మేషలగ్నముకు దశమాధిపతిగా శుభాలను, ఏకాదశాధిపతిగా అశుభాల‌ను కలిగిస్తాడు. లగ్నస్థ శని కారణంగా ఈ జాతకుడు సన్నముగా పొడవుగా ఉంటాడు. లగ్నస్థ శని తృతీయ, సప్తమ, దశమ స్థానాలపై దృష్టి సాగిస్తాడు. కనుక జాతకుడికి బంధుమిత్రుల సహకారము లభించ‌డం క‌ష్ట‌మే. ఉద్యోగ వ్యాపారాలలో నిలకడ ఉండదు. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలు త‌లెత్తుతాయి.
రాహువు 
మేష లగ్నములో రాహువు న‌మ్మ‌కాన్ని పెంచుతాడు. ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు. ఉదర సంబంధిత వ్యాదులు ఎదుర్కొంటారు. జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఉద్యోగ, వ్యాపారాలలో ప‌ట్టుద‌ల‌తో సఫలత సాధిస్తారు. వ్యాపారము చేయాలన్న కోరిక ఉంటుంది. అయితే ఉద్యోగము అధిక సఫలత ఇస్తుంది. రాహువు సప్తమ దృష్టి కారణంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోంటారు. వైవాహిక జీవితం బాధిస్తుంది. మిత్రులు, సహోదరులు సహకరిస్తారు.
కేతువు 
మేష లగ్నస్థ కేతువు కారణం వ‌ల్ల శారీరక దాడుర్యం కలిగి ఉంటారు. ఆత్మస్థ‌ర్యం, ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. కనుక వీరి శత్రువులు భయభక్తులతో ఉంటారు. సమాజంలో గౌరవం, ఖ్యాతి లభిస్తుంది. రాజనీతి, చతురత కలిగి ఉంటారు. మాతృ వర్గము నుంచి స‌హ‌య‌స‌హ‌కారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి నుంచి, సంతానం నుంచి అనుకోని సమస్యలను ఎదుర్కొంటారు. ఇక వీరికి వ్యాధుల బెడ‌ద ఉండ‌దు.