నక్షత్ర ఫలములు
Krittika
కృత్తిక నక్షత్రం – గుణగణాలు, ఫలితాలు
కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు మంచి వర్చస్సుతో కనిపిస్తారు. వీరు అమితమైన సాహసాన్ని ప్రదర్శిస్తుంటారు. పాలనారంగంలో ఆసక్తి చూపిస్తారు. ఇతరుల వస్తువులను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తుంటారు. వీరిది అహంకార స్వభావమనే చెప్పాలి. వీరిలో విచారం, సంతోషం ఒకేలా ఉండవు. తమలోని సంఘర్షణను సైతం బయటకు కనబడనీయరు. ఎదుటి వ్యక్తి కష్టాలలో ఆపేక్ష ఉంటుంది. కానీ తన గురించి కూడా ఆలోచించుకుంటారు. విచక్షణతో గుర్తెరిగి ప్రవర్తిస్తుంటారు. ఈ నక్షత్రంవారు మేడి లేక అత్తి చెట్టును పెంచుకోవాలి.
కృత్తిక నక్షత్రం మొదటి పాదంమాత్రమే మేష రాశిలోనే ఉంది. మిగిలిన మూడు పాదాలు వృషభ రాశిలో చేరాయి.
కృత్తిక మొదటి పాదము
కృత్తిక మొదటి పాదములో జన్మించిన వారు శారీరక బలంతోపాటు విద్యావంతులు. సామర్థ్యానికి మించి తలపడి చిక్కుల్లో పడుతుంటారు. అయితే ప్రయత్నపూర్వకంగా నిదానంగా ఫలితాలు సాధించడం వీరి సానుకూల లక్షణం. గంభీర స్వభావులై ప్రజాపాలనలో ఆసక్తి కలిగి ఉంటారు.
కృత్తిక మొదటి పాదములో గ్రహ దశలు
వీరికి ముందుగా రవి మహర్దశ 6 సంవత్సరాలు. అటు తర్వాత చంద్ర మహాదశ పదేళ్లు. కుజ దశ 7 ఏళ్లు, రాహు దశ 18 సంవత్సరాలు, గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ పందొమ్మిది సంవత్సరాలు ఉంటుంది.
కృత్తిక రెండో పాదము
కృత్తిక రెండో పాదములో జన్మించిన వారది గంభీర స్వభావం. సంస్కృతి, సాంప్రదాయాలకు, ఆచారాలకు దూరం. తనకుమాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అన్నది వీరి నమ్మకం. వ్యక్తిగత విషయాల గురించి ఆలోచిస్తారు. ఇతరులపట్ల ఆదరణ ఉంటుంది కానీ పరిమితమే. పంతం పట్టకుండా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది.
కృత్తిక రెండో పాదములో గ్రహ దశలు
ముందుగా రవి మహర్దశ నాలుగున్నర సంవత్సరాలు. ఆ తర్వాత చంద్ర మహాదశ పదేళ్లు. కుజ దశ 7 ఏళ్లు, రాహు దశ 18 సంవత్సరాలు, గురు మహర్దశ 18 సంవత్సరాలు, శని మహర్దశ పందొమ్మిది సంవత్సరాలు ఉంటుంది.
కృత్తిక మూడో పాదము
కృత్తిక మూడో పాదములో జన్మించిన వారు శక్తివంతులుగా మెలుగుతారు. ఎల్లప్పుడు ధైర్యంతో ఉంటారు. గంభీర వదనంతో కనిపిస్తారు. అయితే, లాభ నష్టాలపై అతిగా ఆలోచిస్తుంటారు. పనికి రాని విషయాల్లోనూ అనవసరపు ఆసక్తి చూపిస్తారు. పైకి మాత్రం ఏమీ పట్టనట్టు, ఏదీ పట్టించుకోనట్టుగా నటిస్తారు. అనవసరపు లెక్కలతో వారి అభివృద్దికి కూడా ఆటంకం కలుగుతుంది.
కృత్తిక మూడో పాదములో గ్రహ దశలు
ముందుగా రవి మహర్దశ మూడు సంవత్సరాలు, ఆ తర్వాత వరుసగా చంద్ర మహాదశ పదేళ్లు. కుజ దశ 7 ఏళ్లు, రాహు దశ 18 సంవత్సరాలు, గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు ఉంటుంది.
కృత్తిక నాలుగో పాదము
కృత్తిక మూడో పాదములో జాగ్రత్తలు అవసరం. తన తీరుతో, రకరకాల వాఖ్యలతో చిత్రమైన ప్రవర్తనను కలిగి ఉంటారు. భగవదారాధన, సత్సంగ మార్గంలో ఉండడం అవసరం. లేకుంటే వ్యసనాలకు అలవాటు పడే ప్రమాదం ఉంటుంది. అన్నీ తెలిసిన వ్యక్తి మాదిరి హడావుడి చేయడానికి ప్రయత్నిస్తారు. తమకున్న పరిజ్ఞానం పరిమితులు గ్రహించి మసలుకుంటే మంచిది.
కృత్తిక నాలుగో పాదము గ్రహ దశలు
ముందుగా రవి మహర్దశ ఒకటిన్నర సం.లు, తర్వాత వరుసగా చంద్ర మహాదశ పదేళ్లు. కుజ దశ 7 ఏళ్లు, రాహు దశ 18 సంవత్సరాలు, గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు ఉంటుంది.
కృత్తిక నక్షత్రము గుణగణాలు
రవి గ్రహ నక్షత్రమైన కృత్తిక నక్షత్రములో పుట్టిన జాతకులు బాల్యంలో ధనిక జీవితాన్ని గడుపుతారు. స్వశక్తి అనేక స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. సంతానాన్ని సమదృష్టిలో చూస్తారు. కానీ చిన్న విషయాలకే అసత్యాలు పలికే మనస్తత్వం కలిగి వుంటారు. ఈ నక్షత్రములో పుట్టిన జాతకులు చదువు, అన్యభాషల యందు నేర్పరితనము విశేషమైన పోటీ తత్వము కలిగి ఉంటారని శాస్త్రం చెబుతోంది.
తొలి పాదములో పుట్టిన జాతకులకు మంగళవారం అన్ని విధాలా కలిసివస్తుంది. అలాగే బుధ, ఆదివారాలు సామాన్య ఫలితాలనిస్తాయి. కానీ గురువారం మాత్రం ఈ జాతకులు శుభకార్యాన్ని ప్రారంభించకూడదు. అలాగే కృత్తికా నక్షత్రము-తొలి పాదములో పుట్టిన జాతకులకు అదృష్ట సంఖ్యలు 9, 18, 27, 36, 45, 54, 63, 72.
ఈ నక్షత్రం తొలి పాదంలో పుట్టిన జాతకులకు కలిసొచ్చే రంగులు – ఎరుపు, తెలుపు.
ఇదేవిధంగా ఈ నక్షత్రము 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకు బుధవారం అనుకూలిస్తుంది. ఈ జాతకులు బుధవారం చేపట్టే కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కానీ పౌర్ణమి తిథిలో వచ్చే బుధవారం నాడు ఈ నక్షత్రములో పుట్టిన జాతకులు ఎలాంటి శుభకార్యాన్ని చేపట్టకూడదు.
కృత్తికా నక్షత్రం.. అగ్ని నక్షత్రం, అధిపతి సుర్యుడు, గణం రాక్షసగణము కనుక ఈ నక్షత్రజాతకులు ఆవేశపరులై ఉంటారు. అంతటా ఆధిక్యత ప్రదర్శిస్తారు. ఏ పాదములో జన్మించినా బాల్యంలో ధనిక జీవితాన్ని గడుపుతారు. అధికారము ఇచ్చే చదువు, అన్యభాషల యందు నేర్పరితనం, విశేషమైన పోటీ మనతత్వం ఉంటుంది. చిన్న విషయాలకే అబద్ధాలు ఆడతారు. వీరికి స్త్రీలతో కలిగే విభేదాల వలన జీవితంలో చెప్పుకోదగిన మార్పులు వస్తాయి. ఇతరుల సలహాలను సహించరు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించరు. అన్నింటా అధికారము సాగించాలని వీరు చెసే ప్రయత్నము మూడు భాగాలు ఫలించినా ఒక భాగము వికటిస్తుంది.
23 ఏళ్ల తర్వాత కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా 36 నుంచి 41 ఏళ్ల తరువాత సమస్యల నుంచి బయటపడి సుఖ జీవితం సాగిస్తారు. ఈ నక్షత్ర జాతకులందరికీ ఇవి సాధారణ ఫలితాలు అయినా జాతక చక్రం, సమయం, గ్రహస్థితి, నవంశను అనుసరించి విశేష మార్పులు ఉంటాయి.
ఈ నక్షత్రమున 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకు నీలం, తెలుపు అన్ని విధాలా కలిసొస్తుంది. ఈ జాతకులు రోజువారీ ధరించే దుస్తుల్లో నీలపు, తెలుపు రంగులు కొంతవరకైనా ఉండేలా చూసుకోవడం మంచిది. ఈ రంగు దుస్తులను ధరించడం వల్ల మనశ్శాంతి, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
ఈ జాతకులకు 6 అనే సంఖ్య అన్నివిధాలా అనుకూలిస్తుంది. 4, 5, 8 అనే సంఖ్యలు కూడా మంచి ఫలితాలనిస్తాయని శాస్త్రం చెబుతోంది.