Menu

నక్షత్ర ఫలములు

Mrugashrisha

మృగశిర నక్షత్రం – గుణగణాలు, ఫలితాలు 
మృగశిరా నక్షత్రము దేవగణ నక్షత్రము. ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు, రాశ్యాధిపతులు శుక్రుడు, బుధుడు. అధిదేవత కుమారస్వామి. ఆధిపత్యం చంద్ర దేవతను సూచిస్తోంది. పగడం రాయి పెట్టుకోదగినది. ఈ నక్షత్ర జాతకులు చండ్ర వృక్షాన్ని పెంచుకుంటే మంచిది. హోమం సమయంలోనూ చండ్ర సమిధలు వాడడం మంచిది. తమో గుణంతో ఉండటం వీరి లక్షణం.
మృగశిర  నక్షత్రం తొలి రెండు పాదాలు వృషభ రాశిలోనూ, చివరి రెండు పాదాలు మిథున రాశిలోనూ ఉంటాయి.
మృగశిర మొదటి పాదము
మృగశిర మొదటి పాదములో జన్మించిన వారు తమ సొంత పనుల వల్లే కార్యసిద్ధి పొందుతారు. అదృష్టానికి, దురదృష్టానికి వీరిదే బాధ్యత ఉంటుంది. అదే సమయంలో తమ వైఖరి వల్లనే నష్టపోతారు. మరికొన్ని విషయాల్లో వేచి చూసే ధోరణి ఉంటుంది. దీనివల్ల ఒక్కోసారి పుణ్యకాలం కాస్తా గడచిపోతుంది. విశాల దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు తారుమారైతే ప్రభావం పాములా మెడకు చుట్టుకుంటుంది. అటువంటప్పుడు ప్రశాంతంగా ఉండేలా ప్రయత్నించాలి. కోపంతో సమస్యలు మరింత పెరుగుతాయే తప్ప తగ్గవు. ఈ విషయాన్ని గ్రహించాలి.
మృగశిర తొలి పాదము గ్రహ దశలు
ఈ నక్షత్రమున రెండో పాదములో జన్మించిన వారికి ముందుగా.. కుజ మహర్దశ 7 సంవత్సరాలు ఉంటుంది, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, తర్వాత గురు 18 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, అనంతరం బుధ దశ 17సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు, శుక్ర దశ 10 సంవత్సరాలు ఉంటుంది.
మృగశిర రెండో పాదము
ఈ నక్షత్రములోని రెండో పాదమున జన్మించిన వారు.. చురుకుగా ఉండేలా ప్రయత్నిస్తారు. మొదలు పెట్టే పనులన్నింటిలోను మంచి ఫలితం ఆశిస్తారు. అయితే ఆశించిన ఫలితం అందకపోతే ఆందోళన చెందుతారు. ఆ అనవసర ఆందోళనతో మరిన్ని తప్పుల్లో పడే ఆస్కారం ఏర్పడుతుంది. తెలివితేటలు వినియోగించాల్సినచోట వాడకపోవడంవల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితులు రావచ్చు. ఇటువంటప్పుడు ఇబ్బందులు తలెత్తుతాయి. మెళకువతో వ్యవహరించి పరిస్థితుల్ని చక్కబెట్టుకుంటూ రావాలి.
మృగశిర రెండో పాదములో గ్రహ దశలు
ఈ నక్షత్రమున రెండో పాదమున జన్మించిన వారికి వరుసగా.. కుజ మహర్దశ ఐదేళ్ల తొమ్మిది నెలలు, తర్వాత రాహు 18 సంవత్సరాలు, గురు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు,  అనంతరం బుధ దశ 17 సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు, శుక్ర దశ 20 సంవత్సరాలు ఉంటుంది.
మృగశిర మూడో పాదము
మృగశిర మూడో పాదమున ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చే ముందు ఆలోచనల్లో మార్పు కనిపిస్తుంది. వాస్తవానికి దగ్గరి ఆలోచనలు ఉండవు. ఇదే సమయంలో ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. దీంతో నిర్ణయాలు ఆలస్యం అవుతుంటాయి. ఆందోళనలను దాచుకునేందుకు ఇష్టపడతారు. ఆర్థిక లావాదేవీల్లో రహస్యంగా ఉంటారు. దీనివల్ల ఒక్కోసారి ఇబ్బంది ఏర్పడవచ్చు. ఈ నక్షత్ర పాదములో జన్మించినవారికి జన్మతః కుజ మహర్దశ ఉండును.
మృగశిర మూడో పాదములో గ్రహ దశలు
జన్మించిన తర్వాత తొలి మూడున్నర సంవత్సరాలు కుజ మహర్దశ నడుస్తుంది. ఆ తర్వాత రాహు 18 సంవత్సరాలు, గురు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధ 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.
మృగశిర నాలుగో  పాదము
మృగశిర నాలుగో పాదములో జన్మించిన వారు సాధు స్వభావంతో ఉంటారు. అయితే పరిస్థితులు అదుపులో ఉండవు. నిర్ణయాలు తారుమారు అవుతూ ఉంటాయి. దీంతో ఆయా వ్యక్తులు ఇబ్బంది పడడమే గాక, మిగిలినవారు సైతం ఇబ్బందులకు లోనవుతూ ఉంటారు. ఓపికతో వేచిచూసే ధోరణి కనిపించదు. దీనివల్ల ఫలితాలు వచ్చే సమయంలో పరిస్థితులను మార్చుకుంటారు. అంతిమంగా అసహనానికి లోనయ్యే స్వభావం ఉంటుంది. నిలకడకోసం ప్రయత్నించే స్వభావం ఏర్పరచుకోవాలి.
మృగశిర నాలుగో పాదమున గ్రహ దశలు
జన్మించినప్పటి నుంచి సుమారుగా 21 నెలల పాటు కుజ మహర్దశ ఉంటుంది. ఆ తర్వాత రాహు 18 సంవత్సరాలు, గురు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధ 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.
మృగశిర నక్షత్రం గల వారి గుణగణాలు
ఈ నక్షత్రములో జన్మించిన వారు చురుకుగా ఉంటారు. వంశపారంపర్యంగా వచ్చే స్థిరాస్తులతో మృగశిర నక్షత్ర జాతకులు సకల భోగభాగ్యాలతో విలాసవంతంగా జీవిస్తారని శాస్త్రం చెబుతోంది. సంగీతంలో ప్రఖ్యాతి, ఉన్నత వ్యాపార సంస్థల్లో రాణించే వీరు అదృష్ట జాతకులని చెప్పవచ్చు.
అయితే ఏ విషయంలోనైనా తేలిగ్గా మారిపోయే స్వభావం కనిపిస్తుంది. ఆలోచనలు, నిర్ణయాలు వేగంగా మారిపోతాయి. నాయకత్వ స్థాయిలో ఉండేవారికి అవసరమైన స్థితప్రజ్ఞత ఉండదు. కానీ ఆచరణలో అమలు చేసేటప్పుడు ఎదురయ్యే ఇబ్బందులను లౌక్యంగా అధిగమించగలరు. ప్రతికూలతలను పదే పదే ఊహించుకోవడం మాత్రం ఇబ్బందికరం. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నిర్ణయాలు మారుతూ ఉంటాయి.
 దైవభక్తి అధికం కలిగిన వీరికి అనారోగ్యం జీవితానికి ఆటంకం కానేరదు. నరములు, కీళ్ల ఎముకలకు సంబంధించిన వైద్యంలో రాణిస్తారు. దేశ భక్తి, బంధుప్రీతి కలిగిన ఈ జాతకులకు ప్రేమ వివాహాలు లాభిస్తాయి. వస్తు నాణ్యతను చక్కగా నిర్ణయించే సత్తా వీరికుంటుంది. అయితే ఇతరులు చెప్పే విషయాలను ఏ మాత్రం పట్టించుకోరు. చెప్పుడు మాటలవు విని సజ్జనులను దూరం చేసుకుంటారు.
క్రమశిక్షణ, ప్రణాళిక ప్రకారం కార్యాచరణ చేయడం ద్వారా మృగశిర నక్షత్ర జాతకులు గొప్పగా రాణిస్తారు. దీర్ఘాయుషుతో, కీర్తి ప్రతిష్టలతో జీవించే మృగశిర జాతకులు శ్రీసుబ్రహ్మణ్యస్వామిని అర్చించడం వల్ల ఉన్నత స్థితికి చేరుకుంటారు.