Menu

Navaratnalu

Diamond

వజ్రము 

ఆకాశములో వజ్రం (రవ్వ) తూర్పునకు గానీ, పడమరకు గానీ శుక్రగ్రహం దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. దీనినే చుక్క అని వాడుకలో ఉంది. ఈ చుక్కవలే మరే చుక్క కూడా ప్రకాశించదు. వజ్రం కూడా ఈ చుక్క మాదిరిగా ప్రకాశిస్తూ ఇత‌ర రత్నమునకు లేనట్టి కాంతి ప్రభలతో వెలుగొందుతూ ఉంది కాబ‌ట్టి ఈ వజ్రానికి శుక్ర గ్రహము ఆదిపత్యం వహిస్తున్నాడు. శుక్రుడు స్త్రీజలమై జలతత్వానికి సంబంధించిన వాడగుట వల్ల‌ వజ్రం కూడా స్త్రీజాతి జతతత్వ రత్నమగుటవలన వజ్రాధిపతి శుక్ర గ్రహం.

దీనిని ఆభరణములలోధరించుట పరిపాటి. ఉత్తమమయిన వజ్రాలు, తెల్లని రంగులో, ఉండి కొంచం నీలి రంగు చాయలు వెదజల్లేవిగా ఉంటాయి. ఈ రత్నమును సానబెట్టిన కొద్ది నాణ్యత పెరిగి కాంతులను వెదజల్లుతుంది. ప్రకాశ వంతముగాను, మెరుపు కలిగిన తక్కువ బరువు కలిగిన వజ్రాలు ఉత్తమమైనవి. వజ్రాన్ని సుత్తులతో కొట్టిన, అరగదీసిన, గీతలు గాని చారలు గాని పడదు. అదే జాతివజ్రము.

ఎవ‌రు ధ‌రించవ‌చ్చు..?

ఈ వజ్రాలను ఏప్రిల్ నెలలో పుట్టినవారు, భరణీ పుబ్బ, పూర్వాషాడా నక్షత్రములలో జన్మించినవారూ, ధరించుట మంచిది. జాతకములో శుక్రుని బలము లేకున్నా, దోషమున్న, మహదశా అంతర్దశలలో ఈ రత్నం ధరించాలి. శుక్రుడు శుభస్థితి పొందిననూ ధరించిన మరింత మేలు గలుగును. 5, 14, 23, 1, 10, 19, 28 తేదీలలో పుట్టినవారు అనగా అదృష్థ సంఖ్య 5 అయినా 1 అయినా దీని బలం అధికమగును.

శుక్రుని కారకత్వములయిన, కళలు, కళత్రం, సౌఖ్యం, వాహనాలు, సంగీతం, వివాహం.. వంటి విషయములలో జాతకమున దోషమున్న, లేక ఆ జాతకములలో ఈ కారకత్వములకు బలం పెరిగి అభివృద్ధి సాధించాలన్ననూ ఈ రత్నం ధరించాల్సి ఉంటుంది. జాతకమునందుగానీ గోచారమునందుగానీ శుక్రగ్రహము దుష్టస్థానములందుండి, షడ్వర్గ బలం, అష్టక బిందు బలం కలిగి ఉన్నప్పుడు అతని యొక్క మహర్దశ అంతర్దశలు ఇతర యోగ గ్రహముల యొక్క దశలలో ఈతని భుక్తికాలములు, గోచారకాలము విపరీత దుష్పరిణామములు కలిగించగలదు. వ్యసనములకు బానిసలగుట, స్త్రీలోలత్వము వ్యభిచారదోషములు, దంపతులకు నిత్య కలహం, ప్రేమ నశించుట, దరిద్ర బాధలు, కృషి నష్టం, మానసిక అశాంతి, బాధలను సహింపలేకుండుట, స్త్రీకలహం, నష్టకష్టములు, రక్తస్రావం అతిమూత్రవ్యాధి, కార్యవిఘ్నం, వివాహం కాకుండుట, వీర్య నష్టము, సోమరితనం… మొదలైన విపరీత ఫలితాలు కలుగుతాయి. ఈ సమయములందు యోగ్యమయిన వజ్రమును ధరించ‌డం వ‌ల్ల‌ బాధలు అంతరించి ఆయుః ధన సమృద్దిగా లభించగలదు.

ఫ‌లితాలు
ధరించే వ్యక్తి వజ్రం చిన్న దైనప్పటికీ దోషరహితంగా ఉండటం చాలా ముఖ్యం. ఉత్తమ లక్షణములు కలిగిన వజ్రమును ధరించడం వలన శారీరక, మానసిక వైఫల్యాల రీత్యా కలిగే అలజడి అశాంతి నివారింపబడి సుఖ జీవనం లభిస్తుంది. అంతేగాక దరిద్ర బాధలు కష్టనష్టములు తొలగిపోతాయి. సంగీతం, సాహిత్యం, కవిత్వం, నటన నాట్యం, చిత్రలేఖనం వంటి 64 కళలయందు సూక్ష్మ పరిగ్రహణ శక్తి కలిగి బాగా రాణీంచగలరు. సినీ రంగమున ఉన్న‌ వారికి వజ్రధారణ చాలా అవసరం. శుక్రబలం లోపించిన వధూవరులకు వజ్రపుటుంగరమును ధరించడం వ‌ల్ల వారి అన్యోన్య దాంపత్య జీవితం బాగా ఉంటుంది. వివాహ ఆల‌స్యం అవుతున్న వారు వజ్రం ధరించిన తర్వాత పెళ్లి బ‌లం వ‌స్తుంది.

పొడి దగ్గులు, ఉబ్బసం వ్యాధి, మూత్ర పిండాలకు సంబంధించిన దోషాలు అకాల వృద్దాప్యపు లక్షణాలు వెంట్రుకలు చిన్నతనంలోనే తెల్లబడుట, వ్యభిచార దోషాలు సంతాన దోషాలు స్త్రీల విషయంలో బెరుకుతనము, ఆహార అయిష్టత, ఊహా లోకాల్లో విహరిస్తూ సోమరితనంగా ఉండటం వంటి శారీరక, మానసిక వ్యాధుల నుంచి రక్షించి నిత్య యవ్వనులుగా తీర్చిదిద్ది నూతనోత్సాహంతో ఉల్లాసవంతమైన జీవితం గడపడానికి ఈ వజ్ర ధారణ ఉపయోగపడుతుంది. స్

వ‌జ్రాన్ని ధరించే పద్దతి

వజ్రాన్ని వివిధ రూపాల్లో ధరిస్తుంటారు. కొందరు కంఠహారాల్లోను మరికొందరు హస్త కంకణాలలోను(గాజులు)చెవి కమ్మలు, ముక్కుపుడకలు షర్టు గుండీలు.. ఇంకా అనేక ర‌కాలుగా ధరిస్తుంటారు. సర్వసాధారణంగా వజ్రన్ని ఉంగరంలో ఇమిడ్చి ధరించడం ఎక్కువగా చేస్తుంటారు బంగారంతో చేయించిన ఉంగరానికి అడుగున రంధ్రం ఉంచి పైభాగం 5 కోణాలు (నక్షత్రాకారం)గా తీర్చి దిద్ది దాని మధ్య‌లో వజ్రాన్ని బిగించాలి. దీనికి బంగారం మినహా ఇతర లోహాలు పనికిరావు.

భరణి పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలలో జన్మించిన వారికి వజ్రధారణ చాలా ముఖ్యం. ఇతర నక్షత్రాల వారు వారి జాతక ప్రభావాన్ని అనుసరించి శుక్రగ్రహం బలహీనంగా ఉన్నపుడు మాత్రమే వజ్రాన్ని ధరించాలి. కృత్తిక, రోహిణి, ఉత్తరాషాడ, శ్రవణం ఈ 6 నక్షత్రాలు జన్మ నక్షత్రాలుగా గలవారు వజ్రాన్ని వాడడం అంత మంచిది కాదు. అనూరాధ, ఉత్తరాభాధ్ర నక్షత్రాలు కలిగిన శుక్రవారం రోజునగానీ, రేవతీ నక్షత్రం గల శనివారంగానీ, శుక్రుడు ఉత్తరాభాధ్ర, రేవతి నక్షత్రాలలో సంచరించే సమయంలో భరణి నక్షత్రంలో గల శుక్రవారం గానీ శుక్ర హోరా కాలం జరిగేటప్పుడు గానీ వజ్ర దుర్ముహుర్తాలు లేకుండా చూసి.. వజ్రాన్ని ఉంగరంలో బిగించాలి. ఆ తర్వాత ఆ ఉంగరాన్ని ఒక రోజంతా పంచగవ్యాలలో నిద్రగావింపజేసి, మరుసటి రోజు గుర్రం మూత్రంనందుంచి, మరొక రోజు పసుపు నీటియందు ఉంచి తిరిగి మంచి నీటితో పంచామృతములతో శుద్ధి గావించాలి. ఈ ప్రకారం పరిశుద్ధమైన వజ్రపుటుంగరము (ఆభరణము)నకు శాస్త్రోక్తముగా పూజ జరిపించి ధూపదీప నైవేద్యముల‌తో శాంతి జరిపించిన త‌ర్వాత ధరించె వారి తారా బలం చంద్రబలం కలిగిన శుభతిదుల యందు, బుధ, శుక్ర, శని వారాములలో మిధున, ధనుర్మీన లగ్నమునందు గల శుభముహుర్తంలో ధరించాలి. ఉంగరాన్ని లేక ఆభరణంను ధరించే ముందుగా దానిని కుడిచేతి హస్తం యందు ఉంచుకొని తూర్పు ముఖంగా నిలబడి గురువుని, గణపతిని ధ్యానించి “ఓం శీం ఐం హ్రీం శ్రీం భృగుసూనవే శుక్రాయస్వాహా” అను మంత్రంతో గానీ లేక “వర్షంతుతే విభావరి దివో అభ్రస్య విద్యుతః రోహస్తు సర్వ బీజా న్యవ బ్రహ్మద్విషోజహి” అను మంత్రమును గానీ 108 సార్లు పఠించి శుక్రగ్రహమునకు నమస్కరించి కుడి చేతి నడిమి వేలికి ఉంగరంను ధరించవలెను.

అయితే వజ్రంను ఉంగరపు వేలికి ధరించుట పనికిరాదు. కొందరు చిటికెన వ్రేలుకి ధరించు చుండెదరు ఒకే ఉంగరమునందు వజ్రంతో పాటుగా కెంపు ముత్యంను చేర్చి బిగించకూడదు.