Menu

Swati

స్వాతి నక్షత్రం – గుణగణాలు, ఫలితాలు

నక్షత్రములలో స్వాతి నక్షత్రము 15వది. స్వాతి నక్షత్రాధిపతి రాహువు. రాజ్యాధిపతి శుక్రుడు, నక్షత్రాధిపతి రాహువు, ఆధిదేవత వాయువు, జంతువు మహిషము, జాతి పురుష, దేవగణాధిపతి(దేవగణము) ఇంద్రుడు.

స్వాతి నక్షత్రము మొదటి పాదము
స్వాతి నక్షత్ర అధిపతి రాహువు. దేవగణ ప్రధానులు కాబట్టి వీరు సాత్విక ప్రవృత్తి  కలిగి ఉంటారు. వీరి మీద గురు రాహు గ్రహ ప్రభావం ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులు ముఖ్యంగా రచయితలు కావడానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక గ్రంధ రచన చేసే అవకాశం కూడా కలదు. ఉపాధ్యాయులుగా మరే అవకాశం కూడా లేకపోలేదు.

ఈ నక్షత్ర జాతకులు రాహుదశలో జన్మించడంవల్ల కొన్ని సమస్యలు ఎదురైనా తల్లితండ్రుల చాటున కష్టం తెలియకుండా సాగిపోతుంది. వీరికి హైస్కులు తరువాత గురు దశ కాలంలో కాలేజి విద్యలో అభివృద్ధి కనిపిస్తుంది. 16 సంవత్సరాలకే గురు దశ వస్తుంది కనుక సౌఖ్యవంతమైన జీవితం మొదలవుతుంది. విద్యలో చక్కని అభివృద్ధి సాధించి ఉద్యోగాలలో స్థిరపడతారు. ఇక సకాలంలోనే వివాహం జరుగుతుంది. సంపాదించినది దాచుకోవాల్సిన అవసరం వీరికి అత్యవసరం. లేకుంటే 32 సంవత్సరాలకు వచ్చే 19 సంవత్సరాల శని దశలో ఖర్చులు అధికమవుతాయి. దీంతో అనేక ఇబ్బందులకు గురవుతారు. 51 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ కాలంలో కొంత ఉపశమనం ఉంటుంది. ఇక మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది.

స్వాతి నక్షత్రము రెండవ పాదము

స్వాతి నక్షత్రము దేవగణ ప్రధానులు కనుక రెండో పాదములోని జన్మనక్షత్రలు సాత్విక ప్రవృత్తి  కలిగి ఉంటారు. వీరి మీద శని రాహు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరికి బద్ధకం కొంచం ఎక్కువ. అయినప్పటికీ పని ఆరంభించారంటే  బాగా శ్రమించి పని పూర్తి చేస్తారు. పరిసరాలను అంతగా పట్టించుకోరు.

వీరికి రాహుదశ దాదాపు 11 సంవత్సరాల కాలం ఉంటుంది. కనుక  రాహుదశ కాలంలో చదువులో మందకొడితనం కొనసాగుతుంది. అయినప్పటికీ తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో చదువులో అభివృద్ధి ఉంటుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 27 సంవత్సరాల నుండి ఉండే 19 సంవత్సరాల శనిదశ  కాలంలో ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి కనుక సంపాదించుకున్నది జాగ్రత్త చేసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. 46 సంవత్సరాల తరువాత 17 సంవత్సరాల బుధ దశ కాలంలో పరిస్థితులు కొంచం కుదుట పడతాయి. తర్వాత 63 సంవత్సరాల తరువాత వచ్చే కేతుదశలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతువు అనుకూలంగా ఉంటే విదేశీయానం అనుకులిస్తుంది. ఇక వృద్ధాప్యం సౌఖ్యంగా సాగుతుంది.

వీరికి కర్మాగారాలు, పరిశ్రమలు స్థాపించి నిర్వహించగల సామర్ధ్యం ఉంటుంది. కర్మాగారాలలో, పరిశ్రమలలో వృత్తి, ఉద్యోగం, వ్యాపారం వీరికి అనుకూలిస్తాయి. అయితే వీరు దత్తు పోయే అవకాశం ఉంది. ఇతరుల గృహాలలో వీరు ఆదరాభిమానాలు పొందగలరు.

స్వాతి నక్షత్రము మూడవ పాదము
వీరు సాత్విక ప్రవృత్తి  కలిగి ఉంటారు. వీరి మీద గురు రాహు గ్రహ ప్రభావం ఉంటుంది. అయినప్పటికీ పని మొదలు పెట్టారంటే బాగా శ్రమించి పని చేస్తారు. పరిసరాలను అంతగా పట్టించుకోరు. కర్మాగారాలు, పరిశ్రమలు స్థాపించి నిర్వహించగలరు. కర్మాగారాలలో, పరిశ్రమలలో వృత్తి, ఉద్యోగం, వ్యాపారం వీరికి అనుకూలిస్తాయి. వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. స్థిరమైన అభిప్రాయలు ఉంటాయి.   వీరు దత్తు పోవడానికి అవకాశం ఉంది. ఇతరుల గృహాలలో వీరు ఆదరాభిమానాలు పొందగలరు.

వీరికి రాహుదశ దాదాపు 7 సంవత్సరాల కాలం ఉంటుంది. కనుక  ఆరంభంలో రాహుదశ కాలంలో చదువులో మందకొడితనం కొనసాగుతుంది. అయినప్పటికీ తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో చదువులో అభివృద్ధి ఉంటుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరుగుతుంది. 23 సంవత్సరాల నుంచి ఉండే 19 సంవత్సరాల శనిదశ  కాలంలో ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. 42 సంవత్సరాల తరువాత 17 సంవత్సరాల బుధ దశ కాలంలో పరిస్థితులు కాస్త కుదుటపడతాయి. తరువాత 59 సంవత్సరాల తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతుదశలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతువు అనుకూలంగా ఉంటే విదేశీయానం ఉంటుంది. 66 సంవత్సరాల తరువాత పరిస్థితులు చక్కబడతాయి. వృద్ధాప్య దశ కూడా సాఫీగా సాగిపోతుంది.

స్వాతి నక్షత్రము నాలుగవ పాదము   
వీరు సాత్విక ప్రవృత్తి  కలిగి  వీరి మీద గురు రాహు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు కూడా రచయితలు అయ్యే అవకాశం కలదు. ఆధ్యాత్మిక గ్రంధ రచన చేసే అవకాశం ఉంది. ఉపాధ్యాయులుగా పని చేసే అవకాశం కూడా ఉండవచ్చు. వీరు దత్తు పోవడానికి అవకాశం ఉంది. ఇతరుల గృహాలలో వీరు ఆదరాభిమానాలు పొందగలరు.

ఈ నక్షత్ర జాతకులకు రాహుదశ దాదాపు మూడు సంవత్సరాల కాలం ఉంటుంది. చదువు నిరాటంకంగా కొనసాగుతుంది. 16 సంవత్సరాల గురుదశ కాలంలో చదువులో అభివృద్ధి ఉంటుంది. ఉన్నత చదువులలో కొంత మందకొడితనం ఉంటుంది. ప్రయత్నంతో విజయం సాధించ వచ్చు. జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహం జాప్యం జరుగుతుంది. 19 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల శని దశ కాలం ఉంటుంది.. కాబట్టి ఆ సమయంలో ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. 38 సంవత్సరాల తరువాత 17 సంవత్సరాల బుధ దశ కాలంలో పరిస్థితులు కాస్త కుదుటపడతాయి. తరువాత 55 సంవత్సరాల తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కేతు దశలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతువు అనుకూలంగా ఉంటే విదేశీయానం ఉంటుంది. 62 సంవత్సరాల తరువాత పరిస్థితులు చక్కబడతాయి. వృద్ధాప్యం సౌఖ్యంగా సాగిపోతుంది.
స్వాతి నక్షత్ర జాతకుల గుణగణాలు

రాహుగ్రహ అధిదేవత నక్షత్రమైన స్వాతి నక్షత్రంలో జన్మించిన జాతకులు ముఖ్యంగా పరిశోధకులుగా రాణిస్తారు. బుద్ధికుశలతలతో పలు రంగాల్లో ఉన్నత అధికారులుగా విధులు నిర్వహిస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు రాహు ప్రభావంతో కల్పనా శక్తి శుక్ర ప్రభావంతో సౌందర్య ఆరాధనాశక్తి కలిగి కళారంగంలో ప్రభావం చూపగలిగి ఉంటారు. శాస్త్రవెత్తలుగా, అధికారులుగా, మేధావులుగా రాణిస్తారు. స్వాతి నక్షత్రం దేవగణం కనుక ధార్మికత, సాత్విక గుణం కలిగి ప్రవర్తిస్తారు. శుక్రుడి ప్రభావ కారణము వల్ల కళలను ఆరాధిస్తారు.

ఈ నక్షత్ర జాతకులు సాహిత్యాన్ని, సంగీతాన్ని, సౌందర్యాన్ని ఆరాధించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఆకస్మిక రాజకీయ జీవితం, ఉద్యోగం, విద్య, ఆర్థిక రంగంలో అత్యధిక అభివృద్ధి చెందుతారు. ప్రతి రంగంలోనూ స్వయం కృషి మంచి అభివృద్ధినిస్తుంది. సినిమా రంగంతో కూడిన ఏ కళారంగంలోనైనా ప్రవేశం రాణింపునిస్తుంది.

నమ్మిన వారి చెంత విశ్వాసంతో ప్రవర్తిస్తారు. అంతర్గత, బహిర్గత శత్రువులు వీరికి అధికంగా ఉంటారు. అంతేకాకుండా కొన్ని ఆరోపణలను కూడా ఎదుర్కునే అవకాశం ఉంటుంది. వాటిలో ఏ మాత్రం సత్యముండదు. అంతేకాదు ఇతరులకు దానం చేయడంలో ముందు వరుసలో ఉండే ఈ జాతకులు సామాజిక స్పృహ కలిగి ఉంటారు. ఆర్థికంగా ముందడుగు వేయడంతో పాటు, కీర్తి ప్రతిష్టలు సంపాదించడాన్నే లక్ష్యంగా భావిస్తారు. కొన్ని విషయాల్లో సామాజిక విలువల్ని పట్టించుకోరు. ఈ లక్షణంతో ఈ జాతకుల నుంచి బంధువులు, సన్నిహితులు దూరమయ్యే అవకాశం లేకపోలేదు. జల కారకుడైన శుక్రుడి ప్రభావితం వల్ల ఈ జాతకులకు విదేశీ యానం, విదేశీ ధనార్జన కలిగిస్తుంది.

ఇక ఈ జాతకులు అడపాదడపా ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడాలంటే ప్రతి సోమవారం రాహుగ్రహ శాంతికి నవగ్రహ ప్రదక్షిణ చేయడం మంచిది. నవగ్రహ ప్రదక్షిణతో పాటు ఐదుగురికి అన్నదానం చేయడం ద్వారా అనుకున్న కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి.