Menu

uttharaphalguni

ఉత్తర ఫల్గుణీ నక్షత్రం- గుణగణాలు, ఫలితాలు

ఉత్తర ఫల్గుణి నక్షత్రాన్ని ఉత్తర అని కుడా అంటారు. నక్షత్రములలో ఇది 12వది. ఉత్తర ఫల్గుణీ నక్షత్రముకు అధిపతి సూర్యుడు. అధిదేవత ఆర్యముడు. గణము మనుష్య. రాశ్యాధిపతులు సూర్యుడు, బుధుడు. జంతువు గోవు. ఉత్తర ఫల్గుణి నక్షత్రము నవాంశ విషయానికి వస్తే.. మొదటి పాదములో ధనసురాశి, రెండవ పాదములో మకరరాశి, మూడవ పాదములో కుంభరాశి, నాలుగవ పాదములో మీనరాశి.

ఉత్తర ఫల్గుణీ మొదటి పాదము
మొదటి పాదములో జన్మించిన వారైతే.. వెండితో పొదిగించిన కెంపును ధరించాలని రత్నాల శాస్త్రం చెబుతోంది. కెంపును ధరించడం ద్వారా ఉన్నత స్థానాలను అలంకరించడం, వ్యాపారాభివృద్ధి చేకూరుతుంది. ఉత్తర నక్షత్రంలో జన్మించిన జాతకులు 6 నుంచి 16 సంవత్సరాల వరకు వీరికి చంద్ర మహర్ధశ ఉంటుంది. కాబట్టి ముత్యమును వెండితో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది.

16 నుంచి 23 సంవత్సరాల వరకు ఈ జాతకులకు కుజ మహర్దశ కలగటం వల్ల పగడమును బంగారంతో పొదిగించుకుని ధరించడం ద్వారా సుగుణవతి అయిన భార్య లభిస్తుందని రత్నాల శాస్త్రం చెబుతోంది. పగడమును ధరించడం ద్వారా సుఖసంతోషములు చేకూరుతాయి. ఇక 41 నుంచి 57 సంవత్సరాల మధ్యలో గురు మహర్ధశ నడవటంతో ఈ జాతకులు పుష్యరాగంను బంగారముతో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించాలి.
ఇక 57 నుంచి 76 సంవత్సరాల మధ్య శని మహర్ధశ. కాబట్టి నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం శ్రేష్టము. అలాగే 76 సంవత్సరాల తర్వాత ఉత్తర నక్షత్రం తొలి పాదంలో జన్మించిన జాతకులకు బుధ మహర్ధశ. కాబట్టి పచ్చను బంగారుతో పొదిగించి చిటికెన వేలుకు ధరించాలి.

ఈ నక్షత్రములో పుట్టిన జాతకులకు ఈతి బాధలు తొలగిపోవాలంటే ప్రతి శనివారం విష్ణుమూర్తికి నువ్వుల నూనెతో దీపమెలిగించడం మంచిది. ఇలా 9వారాలు చేయడం ద్వారా ఈతిబాధలు, ఆర్థిక సమస్యలు తొలగిపోయి సుఖసంతోషాలు చేకూరుతాయి.

ఉత్తర ఫల్గుణీ రెండవ పాదము

ఉత్తర నక్షత్రము రెండో పాదములో జన్మించిన జాతకులకు తొలి 4 సంవత్సరముల నుంచి 6 నెలల వరకు రవి మహర్దశ. కాబట్టి కెంపును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం మంచిది. 4 సంవత్సరముల 6 నెలల వరకు, 14 సంవత్సరముల వయస్సు నుంచి 6 నెలల వరకు చంద్ర మహర్దశ.. వస్తుంది కావున ముత్యంను వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించాలి. 14 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 21 సంవత్సరముల 6 నెలల వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించాలి.

21 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 39 సంవత్సరముల 6 నెలల వరకు రాహు మహర్దశ. కాబట్టి గోమేధికంను వెండిలో మధ్య వేలుకు ధరించాలి. 39 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 55 సంవత్సరముల 6 నెలల వరకు గురు మహర్దశ. కాబట్టి కనక పుష్యరాగమును బంగారములో చూపుడు వేలుకు ధరించడం మంచిది. ఇక 55 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 74 సంవత్సరముల 6 నెలల వరకు శని మహర్దశ. కావున నీలమును వెండిలో మధ్య వేలుకు ధరించగలరు. 74 సంవత్సరాల 6 నెలల వయస్సు నుంచి 91 సంవత్సరాల 6 నెలల వరకు బుధ మహర్దశ. కాబట్టి పచ్చను బంగారములో చిటికెన వేలుకు ధరించడం శ్రేయస్కరం.

ఉత్తర ఫల్గుణీ మూడవ పాదము

వీరికి స్థాయికి మించిన వ్యాపార వ్యవహారాలు కలసి వస్తాయి. స్థిరాస్థులు, ధనము అధికంగా గుప్తంగా ఉంటాయి. తనకు అంతగా పరిచయం లేని మార్గములో కూడా ఉన్నత స్థితి సాధిస్తారు. పరోపకారము చాలా తక్కువ. తక్కువ ధరల్లో ఆస్తులు కొనుగోలు చేస్తారు. సంపాదనలో బంధుత్వానికి, పాపభీతికి చోటు ఉండదు. ధనం విషయములో వీరు ఉదారులని భావిస్తారు కాని వీరు అనవసరంగా ఖర్చు పెట్టరు. ఖర్చు పెట్టిన దానికి వంద రెట్లు ఫలితం ఉంటేనే ఖర్చు చేస్తారు. ఇతరులను అవమానించి ఆనందిస్తారు.

ఉత్తర ఫల్గుణీ నాలుగవ పాదము
ఉత్తర నక్షత్రం నాలుగో పాదములో జన్మించిన జాతకులు జన్మించిన ఒక సంవత్సరం నుంచి 6 నెలల వరకు రవి మహర్దశ. కాబట్టి కెంపును వెండిలో ఉంగరపు వేలును ధరించాలి. ఒక సంవత్సరము 6 నెలల వయస్సు నుంచి 11 సంవత్సరాల 6 నెలల వయస్సు వరకు చంద్ర మహర్దశ. కాబట్టి ముత్యంను వెండిలో ఉంగరము వేలుకు ధరించాలి. 11 సంవత్సరాలు 6 నెలల వయస్సు నుంచి 18 సంవత్సరాల 6 నెలల వరకు కుజ మహర్ధశ. కాబట్టి పగడంను బంగారములో ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 18 సంవత్సరములు 6 నెలల వయస్సు నుంచి 36 సంవత్సరాల 6 నెలల వరకు రాహు మహర్దశ. కాబట్టి గోమేధికమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం శ్రేయస్కరం.

30 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 32 సంవత్సరముల 6 నెలల వరకు గురు మహర్ధశ. కాబట్టి కనక పుష్యరాగమును బంగారములో చూపుడు వేలుకు ధరించాలి. 52 సంవత్సరములు 6 నెలల వయస్సు నుంచి 71 సంవత్సరముల 6 నెలల వరకు శని మహర్ధశ. కాబట్టి నీలంను వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం మంచిది.

ఉత్తర ఫల్గుణీ నక్షత్ర జాతకుల గుణగణాలు
ఈ నక్షత్ర జాతకులకు సకాలంలో వివాహమవుతుంది. భార్య ఆధిపత్యం అధికం. అదృష్టానికి దగ్గరగా జీవితము సాగుతుంది. ఈ జాతకులు ముఖ్యంగా తండ్రి వలన ప్రయోజనము పొందుతారు. తేనెటీగ లాగా కూడబెడతారు. నైతిక బాధ్యతలు అధికం. ఇక వైవాహిక జీవితంలో సంతానము వలన చిక్కులు ఎదుర్కొంటారు. సంఘ వ్యతిరేక, చట్ట వ్యతిరేక పనులకు భయపడరు. లోలోపల పిరికి వారుగా ఉంటారు. రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు కలసి వస్తాయి. జీవితము మీద ఉన్న భయము వీరిని అడ్డదారులలోకి వెళ్ళేలా చేస్తుంది. రాహు, గురు దశలు వీరికి యోగిస్తాయి.