Menu

did-you-know ?

Navagraha Pooja

Navagraha Pooja

నవగ్రహ పూజ – ఫలితాలు

హిందువుల జీవిత ఆచారాలలోనూ నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మానవుల స్థితిగతులు, భవిష్యత్తు వ్యవహారాలపై నవగ్రహాల ప్రభావం ఉంటుంది. ఈ భూప్రపంచంలో దేవతలతో సమానంగా నవగ్రహాలకి కూడా ప్రాధాన్యం ఇవ్వబడింది. మానవులు చేసిన కర్మలను అనుసరించే వారికి శుభాశుభ ఫలితాల్ని నవగ్రహాలు అందిస్తుంటాయి.

సూర్యుడికి అధిపతి అగ్ని, చంద్రుడికి అధిపతి వరుణుడు, కుజుడికి అధిపతి కుమారస్వామి, బుధుడికి అధిపతి విష్ణువు, గురువుకు అధిపతి ఇంద్రుడు, శుక్రుడికి అధిపతి శచీదేవి, శనికి అధిపతి బ్రహ్మ. సూర్యుడు కారానికి, చంద్రుడు లవణానికి, కుజుడు చేదుకు, బుధుడు షడ్రుచులకు, గురువు తీపికి, శుక్రుడు పులుపుకు, వగరు రుచులకు అధిపతులు. సూర్యుడు ఆయనముకు, చంద్రుడు క్షణానికి, కుజుడు ఋతువుకు, బుధుడు మాసానికి, గురువు పక్షానికి, శుక్రుడు సంవత్సరాలకు అధిపతులు.

నవగ్రహాల ద్వారానే ఈ భూమండలం మొత్తం నడుస్తుంది. స్తావర జంగమములు ఏర్పడినవి ఈ గ్రహాల వల్లే. త్రిమూర్తులు త్రిదేవినులు కొలువైనది ఈ గ్రహల్లోనే. గ్రహరూపి జనార్దన , గ్రహరూపి మహేశ్వర అనే వచనం ప్రకారం హరిహరులు గ్రహ రూపంలో కొలువై ఉన్నారు. అటువంటి గ్రహాలనురెండు వర్గములుగా సృష్టి ఆదిలోనే విభజించారు. అవి
గురుపాలితములు: రవి, చంద్ర, కుజ, గురు, కేతు
శనిపాలితములు: శని, బుధ, శుక్ర, రాహు
పాపపుణ్యములు వీరిలోనే ఉన్నవి. గ్రహశాంతి అంటే జాతకునికి ఏ గ్రహం పాపగ్రహమో , ఏది ఎక్కువ బాధిస్తుందో తెలుసుకొని ఆయా గ్రహాలకు వారి ప్రీతికరమైన ధాన్యం, వస్త్రాలను సంకల్పయుతంగా దానమిచ్చిన ఆ గ్రహ పీడా నివారణ జరిగి కొంత ఉపశమనం కలుగుతుంది.

నవ గ్రహాల్లో ప్రతీ గ్రహమూ శుభాన్ని – అశుభాన్ని రెండింటినీ కలిగిస్తుంది. ఈ శుభాశుభాలనేవి ఆ జాతకుడి గ్రహస్థితిని బట్టి ఉంటుంది. మరి నవగ్రహాల ద్వారా కలిగే అశుభాల్ని నివారించుకోవటానికి మార్గం లేదా అంటే ఉంది. అది నవగ్రహాలని నిత్యం స్తుతిస్తూ, పూజిస్తూ వుండడం. ఆయా గ్రహ మంత్రాల్ని జపం చేయటం లేదా చేయించుకోవటం. ఈ కార్యక్రమాల ద్వారా నవగ్రహ శాంతిని పొందచ్చు. ఈ నవగ్రహ పూజ, జప దానాల వల్ల పూర్తిగా దోషం నుంచి తప్పించుకోలేకపోయినా, ఆ దోషం ద్వారా కలుగబోయే పెద్ద ప్రమాదం నుంచి సులభంగా బయటపడవచ్చు.

నవగ్రహ శాంతికి సంబంధించి పూజాది కార్యక్రమాలు చేసేవారు ఆయా ప్రత్యేక వస్తువులతో పూజని నిర్వహించాలి. పూజలో గ్రహ శాంతికి దోష నివారణకు దానాలు చేయాలి. ఇలా చేసిన వారికి దోష నివారణ జరిగి శుభాలు కలుగుతాయి. కోరిన కోర్కెలు నెరవేరతాయి. సూర్య గ్రహ పూజ చేసేవారు గోధుమలను దానం చేయాలి. చేతికి కెంపు ఉంగరాన్ని ధరించటం వల్ల రోగాదులు, మానసిక బాధలు తొలగి మనశ్శాంతి కలుగుతుంది.

గురు గ్రహ పూజను నిర్వహించేవారు శనగలను దానం చేయాలి. అదే విధంగా కనక పుష్యరాగం ఉంగరాన్ని ధరించటం వల్ల అధికారం, ధనయోగంతో పాటు కీర్తివంతులవుతారు. చంద్రుని పూజకు బియ్యాన్ని దానం చేస్తే సరిపోతుంది. ముత్యాన్ని ధరించటం వల్ల నేత్రాలకు సంబంధించిన బాధలకు నివృత్తి కలుగుతుంది. ఇక కుజ గ్రహ పూజలో కందులను దానం చేయాలి. పగడపు ఉంగరాన్ని ధరించటం వల్ల రుణ విముక్తి కలిగి శతృ బాధ తొలగుతుంది. బుధ గ్రహ పూజలో పెసలను దానం చేయాలి. పచ్చల ఉంగరాన్ని ధరించటం వల్ల ధనలాభం కలగటమే కాక వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది.

శుక్రుని పూజలో అలచందల దానం చేయాలి. వజ్రం, పగడము ధరించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. వివాహాది శుభకార్యములకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. రాహు పూజకు మినుములను దానం చేయాలి. గోమేధిక ఉంగరాన్ని ధరించటం వల్ల భయాందోళనలు తగ్గుతాయి. ధనప్రాప్తి కలుగుతుంది.

కేతువు పూజలో ఉలవల దానం చేయాలి. వైఢూర్యం ఉంగరాన్ని ధరించాలి. దీనివల్ల సర్పాది భయాలు తొలగటమే కాక.. దైవశక్తి పెరుగుతుంది. శనిపూజలో నువ్వులను దానం చేయాలి. నీలిరంగు రాయి కలిగిన ఉంగరాన్ని ధరించటం వల్ల ఆరోగ్యవంతులవటమే కాక ఇతర కష్టాలు కూడా తొలగిపోతాయి.

నవగ్రహాలు సంతృప్తి చెంది మానవులకు సుఖశాంతుల్ని ప్రసాదించాలంటే వాటిని దేవతల్లా భావించి ఆరాధించాలి. పూజించాలి.

అందరికీ నవగ్రహానుగ్రహం కలగాలని ఆశిస్తూ…

Muhoortham

Muhoortham

అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం..!

పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే… ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే ‘బ్రహ్మముహూర్తం’ అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, 98-48 నిమిషాల మధ్యకాలం ఇది.

నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.

పురాణగాథ
బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.

ఏం చేయాలి..?
ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.

ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు… హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.

చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.

బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో  ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.

బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాము.