Makaram– Lagnam- Grahamulu
మకర లగ్నస్థ గ్రహాలు
మకర రాశి జాతకులు గుండ్రని ముఖం కలిగి ఉంటారు. సన్నని బలహీనమైన దేహం కలిగి ఉంటారు. ఇతరుల ఆదరణను పొందే నేర్పు ఉంటుంది. తమ వ్యవహారములందుగాని, తాము చేయు వృత్తి, వ్యాపారముల యందు ఇతరులతో చక్కని చాతుర్యం కలిగి ప్రవర్తిస్తారు. ధన సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు. మితంగా వ్యయం చేస్తూ పనులు చక్కబెట్టుకొవడం వీరి సహజ స్వభావం. ప్రతిఫలం లేనిదే ఖర్చు పెట్టుట వీరికి గిట్టదు. కుటుంబ సభ్యులపై అనురాగం ఎక్కువ. వీరికి ప్రతి పనిలోను విఘ్నములు పొందుటకుగాని, ఆలస్యమగుట గాని జరుగును. వివాహ విషయంలో కొన్ని వివాదాలు ఎదురుకావచ్చు.
మకర లగ్నస్థ గ్రహ ఫలితాలు
సూర్యుడు
మకర లగ్నానికి సూర్యుడు అష్టమాధిపతి. అష్టమాధిపతి లగ్నంలో ఉండడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఎముకల నొప్పి, ఉదర సంబంధ వ్యాధులు కలిగే అవకాశాలుంటాయి. నేత్ర వ్యాధులు కలుగుతాయి. సూర్యుడు తన శత్రు స్థానమున ఉండడం వల్లల వీరి జీవితంలో కొన్ని సందర్భాల్లో కఠిన సమస్యలు ఎదుద్కోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో విజయం సాధించాల్సి ఉంటుంది. వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. వ్యాపారం చేయాలన్న కోరిక ఉద్యోగం చేయాలన్న ఆసక్తి కలగలుపుగా ఉంటాయి.
చంద్రుడు
మకర లగ్నంలో చంద్రుడు సప్తమాధిపతి. శత్రు రాశిలో లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి సౌందర్యం ఇస్తాడు. అయితే, చంద్రుడు శత్రు స్థానంలో ఉండటంతో వీరు విచిత్ర మనస్తత్వంతో కనిపిస్తారు. ఈ జాతకులకు కళ్లు, చెవుల వాటి వ్యాధులు ఏర్పడవచ్చు. చంద్రుడు లగ్నం నుంచి సప్తమ స్థానమును మీద దృష్టి పెట్టడం వల్ల జీవిత భాగస్వామి అందం, గుణం కలిగి ఉంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యం అనుకూలత కలిగి ఉంటారు.
కుజుడు
మకర లగ్నానికి కుజుడు సుఖాధిపతి, లాభాధిపతి. కుజుడు లగ్నంలో ఉంటే ఆ వ్యక్తి క్రోధ స్వభావం కలిగి ఉంటాడు. తండ్రి వైపు బంధువుల సహకారం లభిస్తుంది. తండ్రి వల్ల పేరు, ప్రఖ్యాతలు వస్తాయి. శని ప్రభావం కారణంగా తండ్రి వైపు ఆస్తులు త్యాగం చేయవలసిన పరిస్థితి సంభవించగలదు. లగ్నస్థ కుజుడు 4, 7, 8 స్థానాల మీద దృష్టి సారిస్తాడు. అందువల్ల ధార్మికత ఉంటుంది. వైవాహిక జీవితంలో కలతలు కలుగుతాయి. మకర లగ్నంలో కుజుడు ఉచ్చ స్థితి కారణంగా వ్యక్తి క్రోధ స్వభావం కలిగి ఉంటారు. తల్లి కూడా ఉద్రేక స్వభావం కలిగి ఉంటుంది.
బుధుడు
మకర లగ్నానికి బుధుడు షష్టమాధిపతి, నవమాధిపతి. మకర లగ్నస్థ బుధుడు వ్యక్తికి జ్ఞానం, బుద్ధికుశలత కలిగి ఉంటాడు. ఈ జాతకులు దైవ భక్తి, దయా స్వభావం, కళాభిరుచి కలిగి ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు, ధనం ప్రాప్తిస్తాయి. సప్తమ స్థానం మీద, బుధ దృష్టి ఫలితంగా జీవిత భాగస్వామి అందంగా సామర్ద్యశాలిగా ఉంటుంది. షష్టామాధిపతి దృష్టి కారణంగా వైవాహిక జీవితంలో కలహాలు ఏర్పడి భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటాయి. సంతానం కలగడంలో జాప్యం కలిగే అవకాశం.
గురువు
మకర లగ్నానికి గురువు తృతీయ వ్యయ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు. కనుక గురువు ఈ లగ్నానికి అకారక గ్రహం. లగ్నస్థ గురువు వ్యక్తికి జ్ఞానం, సుగుణం కలిగిస్తాడు. ఈ జాతకులకు క్షమాగుణం ఎక్కువ. ఇతరుల కలతలు వీరిని ప్రభావితం చేస్తాయి కనుక కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. లగ్నస్థ గురువు పంచమ, సప్తమ, నవమ స్థానాల మీద దృష్టి పెడతాడు కనుక వివాహానంతరం అదృష్టం వస్తుంది.
శుక్రుడు
మకర లగ్నానికి పంచమ, సప్తమ, దశమ స్థానాలకు కారకత్వం వహిస్తాడు. మకర లగ్నానికి శుక్రుడు శుభుడు. మకర లగ్నస్థ శుక్రుడి కారణంగా వ్యక్తి అందం, బుద్ధి కుశలత కలిగి ఉంటాడు. లగ్నస్థ శుక్రుడు వీరిని విలాసవంతులు, స్వార్ధపరులుగా చేస్తుంది. తమ అవసరానికి అనుగుణంగా తమ తీరును మార్చుకుంటారు. ఈ జాతకులు అవసరార్ధం మిత్రులను కలిగి ఉంటారు. స్త్రీలైన పురుషుల పట్ల, పురుషులైన స్త్రీల పట్ల సహజంగానే ఆకర్షితులు అవుతారు. సప్తమ స్థానమైన కటక రాశి మీద శుక్రుడి దృష్టి పడటం వల్ల వీరి మీద జీవిత భాగస్వామి ప్రేమను అప్యాయతను కలిగి ఉంటారు. జీవిత భాగస్వామి సుఖదుఃఖంలో సహాయ సహకారాలను అందిస్తారు.
శని
మకర లగ్నస్థ శని లగ్నాధిపతి, ద్వితీయ స్థానాలకు ఆధిపత్యం వహించే కారక గ్రహం. దీంతో ఈ జాతకుడు భాగ్యశాలి కాగలడు. ఆకర్షణీయమైన శక్తివంతమైన శరీరాకృతి కలిగి ఉంటాడు. ఉద్యోగ వ్యాపారాలలో సాఫల్యం లభిస్తుంది. ఆకర్షణీయంగా మాట్లాడ లేరు. ప్రభుత్వ సేవారంగంలో పని చేసే అవకాశాం లభిస్తుంది. తల్లితో చక్కని సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. శని తృతీయ, సప్తమ, దశమ దృష్టి కారణంగా జీవిత భాగస్వామికి కష్టాలు ఎదురవుతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం.
రాహువు
మకర లగ్నంలో రాహు స్థితి కారణంగా అనవసర హడావిడి ఎక్కువే. కార్య హాని జరిగే అవకాశాలున్నాయి. అనుకున్న పనులు సాధించడంలో తరచూ ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో ఆసక్తి ఉన్నా ఉద్యోగమే లాభదాయకంగా ఉంటుంది. లగ్నస్థ రాహువు సప్తమ దృష్టి కారణంగా సంసార జీవితంలో జీవిత భాగస్వామి నుంచి, మిత్రుల నుంచి తగిన సహకారం లభించదు.
కేతువు
మకర లగ్నంలో ఉన్న కేతువు ఆరోగ్య సమస్యలకు హేతువు. తరచూ ఊహించని సమస్యలు ఎదురవుతారు. శత్రువుల వల్ల సమస్యలు ఏర్పడే అవకాశాలున్నాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టల కొరకు అనుచిత కార్యముల చేసి అపజయం పాలవుతారు. లగ్నస్థ కేతువు స్ర్తీలకు పురుషుల యందు, పురుషులకు స్త్రీల యందు విపరీత ఆకర్షణ కలిగి ఉంటారు. సప్తమ స్థానం మీద కేతు దృష్టి కారణంగా భాగస్వామికి కష్టాలు కలుగుతాయి.