Menu

దానాలు – శుభ ఫలితాలు

దానాలు - శుభ ఫలితాలు

ప్రస్తుత జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగ పడుతుంది.. అనే మాటలు మనం వింటూ ఉంటాము. పురాణాలు కూడా దానం చేయడం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని చెబుతున్నాయి. ఈ కారణంగానే దైవ దర్శనం పూర్తి చేసుకున్న తరువాత చాలా మంది, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని మాత్రమే అర్హులుగా భావించి తమకి తోచిన విధంగా దానధర్మాలు చేస్తుంటారు.

నవగ్రహ పూజ – దానాలు, ఫలితాలు

నవగ్రహ శాంతికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చేసేవారు గ్రహ శాంతికి దోష నివారణకు దానాలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన వారకి దోష నివారణ జరిగి జీవితాన సకల శుభాలు కలుగుతాయి. కోరిన కోర్కెలు నెరవేరుతాయి. సూర్య గ్రహ పూజ చేసేవారు గోధుమలను దానము చేయాలి. చేతికి కెంపు ఉంగరాన్ని ధరించటం వల్ల రోగాదులు, మానసిక బాధలు తొలగి మనశ్శాంతి కలుగుతుంది.

గురుగ్రహ పూజను నిర్వహించేవారు శనగలను దానము చేయాలి. చంద్రుని పూజకు బియ్యాన్ని దానం చేస్తే సరిపోతుంది. ఇక కుజ గ్రహ పూజలో కందులను దానం చేయాలి. పగడపు ఉంగరాన్ని ధరించటం వల్ల రుణ విముక్తి కలిగి శత్రు సమస్య నశిస్తుంది. బుధ గ్రహ పూజలో పెసలను దానం చేయాలి. శుక్రుని పూజలో అలచందల దానము చేయాలి. రాహు పూజకు మినుములను దానం చేయాలి. కేతువు పూజలో ఉలవల దానం చేయాలి. శని పూజలో నువ్వులను దానం చేయాలి.

దానాల్లో పలు రకాలు:

చతుర్విద దానాలు
చతుర్విద దానాలు చేసిన వారికి పూర్వ జన్మ పాపాలు నశించి, ఈ జన్మలోనే సుఖిస్తారు.
చతుర్విద దానాలు నాలుగు. అవి..
1. మరణ భయంతో భీతిల్లే వారికి ప్రాణ అభయం ఇవ్వడం
2. వివిధ వ్యాధులతో నరక యాతన పడే రోగులకు వైద్యం చేయడం
3. పేదవారికి ఉచిత విద్యను అందించడం
4. క్షుద్భాదతో అల్లాడే వానికి అన్నదానం చేయడం

దశ దానాలు
పేదవానికి మీ శక్తి కొలది చేసే ద్రవ్యసహాయము కానీ, వస్తు సహాయమును కానీ..‘ధర్మం’ అంటారు. ఇలా ‘ధర్మం’ చేయడం వల్ల వచ్చినపుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది.
మంత్రపూర్వకంగా ఓసద్బ్రాహ్మణునకు చేసినదానఫలం, పరలోక సుఖాలను అందించడమే కాకుండా, ఉత్తమ జన్మ సంప్రాప్తించడానికి ఉపయోగపడుతుంది. ‘ధర్మం’ చేయడానికి పరిధులు లేవు. నీకు తోచినది ఏదైనా ధర్మం చేయవచ్చు. కానీ, ‘దానం’ చేయడానికి కొన్ని పరిధులు ఉన్నాయి. ఏదిపడితే అది దానం చేయడానికి వీలులేదు. శాస్త్రనియమానుసారం దాన యోగ్యమైనవి కొన్నే ఉన్నాయి. వాటిని మాత్రమే దానం చేయాలి. వాటినే ‘దశ దానాలు’ అంటారు.

ఇవి మొత్తం 10 దానాలు
దూడతో కూడుకున్న ఆవు, భూమి, నువ్వులు, బంగారము, ఆవు నెయ్యి, వస్త్రములు, ధాన్యము, బెల్లము, వెండి, ఉప్పు…ఈ పదింటిని దశ దానములుగా శాస్త్రం నిర్ణయించింది. వీటినే మంత్రపూర్వకంగా దానం చేయాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. ఏయే దానం వల్ల ఏయే ఫలం సిద్ధిస్తుందో తెలుసుకుందాం.

గోదానం
గోవు అంగములందు పదునాలుగులోకాలు ఉన్నాయి. బాగా పాలు ఇచ్చేది, మంచి వయసులో ఉన్నది, దూడతో కూడుకున్నది అయిన ఆవును బంగారు కొమ్ములు, వెండి డెక్కలు, కంచు మూపురము, రాగి తోక, నూతన వస్త్రములతో అలంకరించి, ఆ ఆవుతో పాటు పాలు పితుక్కునే పాత్రను ఇస్తూ, ఫల, దక్షిణ, తాంబూలములతో యథావథిగి దానం చేయాలి. గోవుకు కనీసం 6 నెలల గ్రాసాన్ని కూడా ఇవ్వాలి. ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై, దాతకు స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తాడు.

భూదానం
కృతయుగంలో హిరణ్యాక్షుని కారణంగా శూన్యంలోకి దొర్లిపోతుంటే.. శ్రీహరి వరాహావతారం ధరించి, ఆ భూమిని తన దంష్ట్రాగ్రంపై నిలిపి ఉద్ధరించాడు. సుక్షేత్రం, సమస్త సస్యసమృద్ధం అయిన భూమిని దానం చేయడం వల్ల అనంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ దానంతో శంకరుడు సంప్రీతుడై, దాతకు శివలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

తిలదానం
తిలలు అంటే నువ్వులు.శ్రీమహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చేయడం వల్ల సమస్త పాపములు నశిస్తాయి. ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై, దాతకు విష్ణులోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

హిరణ్య (బంగారం) దానం
హిరణ్యం అంటే బంగారం. బ్రహ్మదేవుని గర్భం నుంచి పుట్టిన బంగారాన్ని దానం చేయడం వల్ల, దాత సమస్త కర్మల నుంచి విముక్తుడు అవుతాడు. ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీతుడై, దాతకు అగ్నిలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

ఆజ్య(నెయ్యి) దానం
ఆజ్యము అంటే ఆవు నెయ్యి. ఈ నెయ్యి కామధేనువు పాల నుంచి ఉద్భవించింది. ఈ నెయ్యినే యఙ్ఞ, యాగాదులందు సకల దేవతలకు ఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తారు. అలాంటి ఆజ్యాన్ని దానం చేయడం వల్ల సకల యఙ్ఞఫలం లభిస్తుంది. ఈ దానంతో మహేంద్రుడు సంప్రీతుడై, దాతకు ఇంద్రలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

వస్త్రదానం
చలి నుంచి శరీరానికి రక్షణ కలిగించే వస్త్రం.. కేవలం అలంకారినికే కాకుండా, మాననాన్ని కూడా కాపాడుతుంది. అట్టి వస్త్రాలను దానం చేయడం వలన, సర్వ దేవతలు సంతోషించి, సకల శుభాలు కలుగాలని దాతను దీవిస్తారు.

ధాన్యదానం
జీవి ఆకలిని తీర్చేది ఈ ధాన్యం. జీవి ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణం. అట్టి ధాన్యాన్ని ఓ బండెడు దానం చేయుట వల్ల, సకల దిక్పాలకులు సంతృప్తి చెంది, దాతకు ఇహలోకమందు సకలసౌఖ్యం అనుగ్రహించి, పరమందు దిక్పాలకలోక ప్రాప్తిని అనుగ్రహిస్తారు.

గుడ(బెల్లం)దానం
రుచులలో మధురమైనది బెల్లం. ఈ బెల్లం చెరుకురసం నుంచి పుట్టింది. ఈ బెల్లం అంటే వినాయకునకు, శ్రీమహాలక్ష్మీదేవికి ఇష్టం. ఈ దానంతో లక్ష్మీ, గణపతులు సంప్రీతులై, దాతకు అఖండ విజయాలను, అనంత సంపదలను అనుగ్రహిస్తారు.

రజత(వెండి)దానం
అగ్నిదేవుని కన్నీటి నుంచి ఉత్పన్నమైనది ఈ వెండి. ఈ దానంతో శివ, కేశవులు, పితృదేవతలు సంప్రీతులై, దాతకు సర్వ సంపదలను, వంశాభివృద్ధిని అనుగ్రహిస్తారు.

లవణ(ఉప్పు)దానం
రుచులలో ఉత్తమమైనది ఉప్పు. ఈ దానంతో మృత్యుదేవత సంప్రీతుడై, దాతకు ఆయుర్దాయమును, బలాన్ని,ఆనందాన్ని అనుగ్రహిస్తాడు.

ఇవి దశ దానాలు. ఈ దానాలను గ్రహణ సమయాల్లో, పర్వదినాల్లో, సంక్రమణాల్లో చేస్తే దాని ఫలం పదింతలు అవుతుంది. ఈ దానాలనుభక్తి, శ్రద్ధలతో చేయాలిగాని, దానగ్రహీతకు ఏదో ఉపకారం చేస్తున్నామనే భావనతో చేయరాదు.

షోడశ దానాలు  – ఫలితాలు

1. కన్యా దానం – దీనివల్ల బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది.
2. సువర్ణ దానం – దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.
3. దాసీజనం దానం – దీనివల్ల ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుంది.
4. వాహన దానం – దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.
5. అశ్వ దానం – దీనివల్ల గంధర్వలోక ప్రాప్తి కలుగుతుంది.
6. గజ (ఏనుగు) దానం – దీనివల్ల శివలోక ప్రాప్తి కలుగుతుంది.
7. గ్రుహ దానం – దీనివల్ల విష్ణులోకం ప్రాప్తి కలుగుతుంది.
8. నాగలి దానం – దీనివల్ల క్రుష్ణ ప్రీతి కలుగుతుంది.
9. కాలపురుష దానం – దీనివల్ల కోరికల సిద్ధి కలుగుతుంది.
10. కాలచక్ర ప్రతిమ – దీనివల్ల ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది.
11. భూ దానం – దీనివల్ల శివలోకం నివాసం కలుగుతుంది.
12. మేక దానం – దీనివల్ల శివ ప్రీతి కలుగుతుంది.
13. వృషభ దానం – దీనివల్ల మృత్యుంజయం కలుగుతుంది.
14. పాన్పు దానం – దీనివల్ల గోలోక ప్రాప్తి కలుగుతుంది.
15. గో దానం – దీనివల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.
16. నువ్వురాశి దానం – దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.