వాస్తు- Vasthu
వాస్తు- Vasthu
గృహాన్ని ఎక్కడ ఎలా నిర్మించుకోవాలి..?
‘గృహమే కదా స్వర్గసీమ’ అన్నారు పెద్దలు. జీవితాంతం నివసించడానికి కావాల్సిన గృహాన్ని నిర్మించుకోవడంలో చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. అయితే గ్రామాల్లోగానీ, పట్టణాల్లో, నగరాల్లో నిర్మించుకునే గృహం ఎలా ఉండాలో వాస్తుశాస్త్రం చెబుతుంది. నిజానికి గ్రామంలోగానీ, పట్టణాల్లో గానీ నైరుతి మూల ధనవంతులు, అధికారవంతులు నివసించడం, ఆగ్నేయ మూలలో చిన్న జీవితాలను గడిపే వారు వుండటం అనేక ప్రాంతాల్లో మీరు గమనించవచ్చు. ఊరికి ఆగ్నేయంలో శాస్త్రసమ్మతంగా గృహము నిర్మించిన ఐశ్వర్యవంతులుగా వుందురేగాని.. నైరుతి మూల గలవారిపై పెత్తనం చేయుట కష్టతరము.
ఇటీవల పట్టణాల వైశాల్యం పెరిగిపోవటం వలన, పట్టణానికి ఎక్కడ, ఏ మూలో గమనించి చెప్పడం కష్టతరమే. అందుకని పట్టణవాసులు వారు గృహము నిర్మించు ప్రాంతాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోవాలి.
మరో ముఖ్యవిషయం.. ఊరికి ఈశాన్యం ఎత్తైన కొండలుండిగాని, ఊరికి ఈశాన్యం తెగిపోవటం వలన గాని, ఈశాన్యం భ్రస్టు పట్టిన యెడల ఆ ఊరికి నైరుతి ఉచ్ఛము అవుతుంది. ఇటువంటి ఊళ్లలో కొత్తగా గృహము నిర్మించదలుచుకొన్నచో మొత్తం ఊరికి దక్షిణ, పశ్చిమ భాగాల వైపు ఏదైతే ప్రధాన వీధిచే గాని కాలువచేగాని వేరు చేయబడి వుంటుందో ఆ భాగం ఊరికి ఉచ్ఛం అని గ్రహించండి. అంటే మొత్తం ఊరిని వదిలి, పూరిని వేరు చేసిన కాలువకు, ప్రధాన వీధికి రెండవ వైపు (ఊరి వైపు కాకుండా) గృహాన్ని నిర్మించుకోవాలి. అయితే ఈ ప్రాంతం కూడా దక్షిణ, పశ్చిమాలు వాలుగా పల్లంగా వుండకూడదు. ఆ విధంగా వున్న వాయవ్య ఈశాన్యాలలో తూర్పు, ఉత్తరాలు పల్లంగా వున్న స్థలాలు రాణిస్తాయి.
ఈశాన్యం భ్రస్టు అయిన గ్రామంలో కొత్తగా గృహము నిర్మించదలచుకొన్న ఒక మంచి వాస్తు శాస్త్రవెత్త సలహాలను పొందడం ఉత్తమమైన పద్ధతి.
గృహ నిర్మాణం
గృహనిర్మాణానికి ముందుగా స్థలం కొనడం జరుగుతుంది. స్థలాన్ని ఎన్నుకోవడంలోను, స్థలం యొక్క భౌగోళిక పరిస్థితులు మార్పు చేయుటలోను వాస్తు శాస్త్రాన్ని తు.చ. తప్పకుండా పాటించాలి. ముందుగా స్థలం వాస్తు సమ్మతం అయితే అందు వాస్తు ప్రకారం గృహం నిర్మిస్తే గొప్పగా రాణిస్తుంది. గృహం నిర్మించడానికే వాస్తు శాస్త్రం అనుకోకుండా, స్థలం కొనే ముందు వాస్తుశాస్త్ర సమ్మతమైన స్థలాన్నే కొనాలని నిర్ణయించుకోవాలి. స్థలం శాస్త్ర విరుద్ధంగా వుంటే శాస్త్ర ప్రకారం సరి చేసుకోవాలి.
గృహము నిర్మించబోవు స్థలం తూర్పు, ఉత్తరాలకు వాలు కలిగి వుండాలి. తూర్పు, ఉత్తర ఈశాన్యాలు తప్ప మరే ఇతర మూలలు పెరగకుండా వుండాలి. దక్షిణ, ఉత్తర ఈశాన్యాలు తప్పా.. మరే ఇతర మూలలు పెరగకుండా వుండాలి. దక్షిణ, పశ్చిమ హద్దులు ఖచ్చితంగా 90 డిగ్రీలు వుండాలి. ఈశాన్యం మూల తప్ప మరే ఇతర దిక్కులలోగాని, మూలలోగాని గుంటలు, బావులు వున్నచో పూడ్చివేయాలి.
స్థలం యొక్క దక్షిణ, పశ్చిమాలను మూల మట్టానికి సరిపెట్టి తూర్పు ఉత్తర ఈశాన్యాలు కొంత పెరుగునట్లు ప్రహరీ గోడలు నిర్మించాలి. ప్రహరీలు లేకుండా గృహము నిర్మించడం మంచిది కాదు. కనీసం దక్షిణ, పశ్చిమాలలో అయినా సరిహద్దు గోడ నిర్మించి తీరాలి. ప్రహరీలు నిర్మించిన వెంటనే ఈశాన్య భాగంలో నుయ్యి గాని, బోరింగ్ గాని వేయించాలి. ఇవి రెండూ కాని పక్షంలో కనీసం ఆరడుగుల గొయ్యి అయినా ఈశాన్య భాగంలో తవ్వండి. ఈ పని ప్రహరీ నిర్మాణం కన్నా ముందుగా జరిగినా తప్పు లేదు.
ప్రహరీ నిర్మాణం అయిన వెంటనే, ప్రహరీకి గేటును ఉచ్ఛస్థానంలో ఏర్పాటు చేసికొనుటకు వీలుగా కొంత స్థలం వదలాలి. స్థలం ఎత్తు పల్లాలు శాస్త్ర ప్రకారం సరిచేసుకోవాలి. అటు తర్వాత ప్లాన్ గీయించిన విధంగా మీ ఇంటి కొలతలను అనుసరించి సున్నముతో ఖాళీ స్థలంలో ‘మార్క్సు'(గుర్తులు) వేయించాలి. సున్నం మార్కింగ్ వేయునప్పుడు ఏ మూల పెరుగకుండా మూల మట్టం ఉపయోగించి మార్కింగ్ వేయాలి.
స్థలానికి నైరుతిలో గృహాన్ని నిర్మించాలి. ఈ విషయం అందరికి తెలిసినా గృహ నిర్మాణంలో అనేకం చేయకూడని తప్పులు చేస్తున్నారు. గృహము స్థలానికి నైరుతి మూలలో చతురస్రంగా గాని, దీర్ఘచతురస్త్రంగా గాని వుండాలి. కాని, ఏ విధంగా కూడా మూలలు పెరగటం జరుగకూడదు. మూలలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగకూడదు. గృహానికి తూర్పు – ఉత్తరాలలో, దక్షిణ – పశ్చిమాలలో గల ఖాళీ స్థలం కన్నా రెట్టింపు స్థలం ఉండునట్టు గృహాన్ని రూపొందించుకోవడం ఉత్తమం. ఆ విధంగా వీలుకాని పక్షంలో పశ్చిమం కన్నా తూర్పు భాగంలో ఎక్కువ ఖాళీ స్థలం, దక్షిణంకన్నా ఉత్తర భాగంలో ఎక్కువ ఖాళీ స్థలం వచ్చే విధంగా గృహాన్ని రూపొందించుకోవాలి.
సున్నం మార్కింగ్ అయిన వెంటనే గృహానికి ఈశాన్య భాగం నుంచి పునాదుల తీయడం మొదలు పెట్టాలి. మీరు నిర్మించేది పూరిపాక అయినా అందుకు గాను పాతు కర్రల గుంటలలో మొదట ఈశాన్యం గుంటనే తవ్వాలి. ఈశాన్యంలో మొదలు పెట్టిన పునాది తవ్వకం తూర్పు, ఉత్తరముల నుంచి దక్షిణ, పశ్చిమాల మీదుగా పయనించి నైరుతిలో చివరిగా పునాదిని తవ్వాలి.
పునాది తవ్వకం పూర్తయిన తరువాత పునాది నిర్మాణం నైరుతి నుంచి మొదలు కావాలి. నైరుతిలో మొదలు అయిన కట్టడం దక్షిణ, పశ్చిమాల నుంచి తూర్పు ఉత్తరాల మీదుగా పయనించి ఈశాన్యంలో కట్టడం ఆగాలి. ఈశాన్యం నుంచి కట్టడం ఎప్పుడూ మొదలు పెట్టకూడదు.
ఇప్పటి వరకు చెప్పిన విధంగా పునాది నిర్మాణము పూర్తి అయిన తరువాత గృహము ఫ్లోరింగ్ లెవల్ కు (బేస్ మెంట్ లెవెల్ కు) వస్తుంది. నిర్మాణంలో ఈ మేస్ మెంట్ లెవెల్ వద్ద వాస్తు పొందించడంలోనే నేర్పు ఉంటుంది. ఇక్కడ తప్పు చేస్తే గృహము ఎన్ని అంతస్తులు నిర్మించినా అదే తప్పు ప్రతి అంతస్తులోనూ జరిగి తీరుతుంది. అందుకని బేస్ మెంట్ లెవెల్ కు గృహము చేరిన వెంటనే గృహస్తుడు తనకు వాస్తు సలహాలు ఇచ్చిన శాస్త్రవెత్తను తీసుకొని చూపించడం మంచిది. ఆ విధంగా వీలు కానిచో మీరు గృహము ప్రారంభించింది మొదలు పూర్తి అయ్యే వరకు వివిధ రకాల పనులు ఏ విధంగా చేయాలి అనే విషయాల గురించి, అందుకు సంబంధించిన అంశాలు మీకు మేము అందిస్తాము.
గృహానికి ద్వారాలు, కిటికీలు, అలమరాలు వంటి ఇతర నిర్మాణాలకు మార్కింగ్ వేయాలి. ద్వారాలకు ఎదురుగా కిటికీలు వుండునట్లు చేసుకోవాలి. అలమరాలు మీ అవసరాన్ని బట్టి గదిలో దక్షిణ, పశ్చిమ గోడలలో వచ్చునట్లుగా ఏర్పాటు చేసుకొండి.
గృహ నిర్మాణం కిటికీల ఎత్తుకు రావటాన్ని ‘లింటర్ లెవెల్’ అంటారు. గృహము లింటల్ లెవెల్ కు వచ్చినప్పుడు సన్ షేడ్స్ సామానులు వుంచుకొనుటకు అటకలు నిర్మించడం జరుగుతుంది. అటకలు గదిలో దక్షిణ, పశ్చిమ గోడల వైపు మాత్రమే వుండాలి. ఇంటి చుట్టూ తలుపుల, కిటికీల మీద వేయు సన్ షేడ్స్ వలన ఈశాన్యం తెగిపోకుండా జాగ్రత్త పడాలి.
వింటల్ లెవెల్ పైన కొంత ఎత్తులో పైకప్పు వేయటం జరుగుతుంది. కప్పు కింద వెంటిలేటర్సు వదలాలి.
ఇంటి కప్పు నైరుతి నుంచి ఈశాన్యంకు వాటం ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. పై కప్పు పని పూర్తి అయిన వెంటనే గృహము లోపలి పని మొదలు పెడతారు. గృహము లోపలి ఫ్లోరింగ్ లెవెల్ నైరుతి నుంచి ఈశాన్యంకు వాటం ఉండే విధంగా చూసుకోవాలి.
వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం, ఈ శాస్త్రాన్ని నాలుగు విధముల చూడగా భూమి వాస్తు.హర్మ్య వాస్తు, శయనాసన వాస్తు, యాన వాస్తుగా విభజింపబడి వున్నవి. శివ లలాటము నుండి రాలిన చెమటబిందువు భూతముగా భూమిని అక్రమించినప్పుడు బ్రహ్మ దేవుని ఆజ్ఞను అనుసరించి దేవతలు శిరస్సున – శిఖి(ఈశ) దక్షిణ నేత్రమున – సర్జన్య వామనేత్రమున – దితి దక్షిణ శోత్రమున – జయంతి వామ శోత్రమున – జయంతి ఉరస్సున (వక్షమున) – ఇంద్ర, అపవత్స, అప, సర్ప దక్షిణ స్తనమున – అర్యమా వామ స్తనమున – పృధ్వీధర దక్షిణ భుజమున – ఆదిత్య వామ భుజమున – సోమ దక్షిణ బాహువున – సత్య, భృశ, ఆకాశ, అగ్ని, పూషా వామ బాహువున – పాప యక్ష, రోగ, నాగ, ముఖ్య, భల్లాట దక్షిణ పార్శ్వకామున – వితధి, గృహక్షత వామ పార్శ్వకామున – అసుర, శేష ఉదరమున – వినస్వాన్, మిత్ర దక్షిణ ఊరువున – యమ వామ ఊరువున – వరుణ గుహ్యమున – ఇంద్ర జయ దక్షిణ జంఘమున – గంధర్వ వామ జంఘమున – పుష్పదంత దక్షిణ జానువున – భృంగరాజ వామ జానువున – సుగ్రీవ దక్షిణ స్పిచి – మృగబు వామ స్పిచి – దౌవారిక పాదములయందు – పితృగణము
దేవతల తేజస్సముదాయంతో వున్నా భూత ఆకారమును బ్రహ్మదేవుడు ‘వాస్తు పురుషుడూ గా సృష్టిగావించాడు.
Leave a Reply
You must be logged in to post a comment.