Menu

Did You Know ?

Miku-Telusaa

 

1. మూఢము:గురు, శుక్ర గ్రహములు రివితో కలసివుండే వేళను మూఢము లేదా మౌఢ్యము అందురు. ఈ కాలంలో వారు శుభఫలాలనీయరు. కావున వివాహాది ఎట్టి శుభకార్యాలు చేయరాదు.(ఆశ్రేషాది గండ నక్షత్రములకు శాంతి, హోమ, జప, అభిషేకాలు వంటివి మాత్రమే చేయవలెను.)

2. గోధూళికా ముహూర్తం:సూర్యుడున్న ముహూర్తం నుండి 7వది గోధూళిక అనబడును. మేతకు వెళ్ళిన గోవులు మరలివచ్చే-సూర్యాస్తమయ పూర్వవేళ అన్ని ప్రయాణాలకు మంచివి.

3. వివిధ యాత్రలకు:స్త్రీ యాత్రకు వృషభ కన్యా మిథునరాశులు, గోయాత్రకు తులా, వృషభ, మేష, సింహ, మకర లగ్నములు – ధనార్థులకు కుంభ, కటక,మీన, మకర రాశులు. యుద్ధయాత్రకు వృషభ, సింహ, ధనుర్మేష లగ్నములు జయప్రదములు.

4. తిథిసంధి:అమావాస్యకు శుద్ధపాడ్యమికి నడుమ పంచమి, షష్ఠీల మధ్య దశమీ ఏకాదశుల నడుమ 4 ఘడియల కాలం తిథి సంధి.

5. నక్షత్రసంధి:రేవతి – అశ్వినుల మధ్య, ఆశ్రేషా -మఖానడుమ, జ్యేష్ఠా-మూల తారలు మధ్యన 4 ఘడియలు కాలం నక్షత్రసంధి.

6. లగ్నసంధి: మీనమేషములు, కటక, సింహములు, వృశ్చిక, ధనుస్సు-వీటినడుమ 1 ఘడియ లగ్నసంధి.

7. కనుమలు: మరణం, శవదహనం, సపిండీకరణం, జాతర, సంక్రమణం, గ్రహణం – ఇవి జరిగిన మరుసటి రోజును కనుమ అంటారు.

8. నిషిద్ధనవమీత్రయం:ఏదైనా ఒక ప్రయాణం చేసిన 9వరోజునగాని, ఆ తిథికి 9వ తిథికిగాని, ప్రవేశము చేయరాదు. ప్రవేశించిన నాటి 9వ నాడుగాని 9వ తిథిగాని- అటునుండి బయలుదేరరాదు. వీటినే ప్రయాణనవమి, ప్రవేశనవమి, ప్రత్యక్షనవమి అంటారు. ఈ మూడు నవములు నిషిద్ధములు.

9. సిద్ధియోగములు: శుక్రవారం 1,6,11 తిథులు- బుధవారం 2,7,12 తిథులు-మంగళవారం 3,8,13 తిథులు-శనివారం 4,9,14 తిథులు- గురువారం 5,10,15 తిథులు – వీటిని సిద్ధయోగములంటారు.

10. అధికమాసము: సూర్యుడు నెలకు 1 రాశి చొప్పున సంవత్సరమునకు 12రాశులలో సంచరించును. ఆయన యొక్క రాశి ప్రవేశమునకే సంక్రమణమని పేరు. అలా సూర్య సంక్రమణం జరుగని శుద్ధపాడ్యమి నుండి అమావాస్య వరకు గల మాసం అధికమాసంగా చెప్పబడుచున్నది.

11.పక్షచ్ఛిద్ర తిథులు : 4,6,9,12,14 తిథులు

12. క్షయ మాసము: చాంద్రమాసమునందలి ఏ మాసమున సూర్యుడు రెండు రాశులలో ప్రవేశించునో – ఆ మాసమును క్షయమాసమందురు.

13. శూన్యమాసము: సూర్యుడు మీనంలో వున్న చైత్రమాసం, మిథునంలో వున్న ఆషాఢం, కన్యలో వున్న భాద్రపదం, ధనుస్సులో వున్నపుష్యమాసం -ఇవి శూన్యమాసములు అనబడును.

14. త్రిసోష్టకములు :మార్గశిర, పుష్య, మాఘ, ఫాల్గునము 4 మాసముల్లోనూ కృష్ణపక్షాన వచ్చే 7,8,9 తిథులతో కూడిన దినములకుత్రిసోష్టకములందురు. ఇవి అనధ్యాయములు.

15. విసర్జించవలసిన వేళలు :గ్రహణాది 7రోజులు, లగ్నాంత 1/2 ఘడియ, నక్షత్రాంత 21/2 ఘడియలు మాసాంత 3రోజులు, సంవత్సరాంతమున 15రోజులు వర్జనీయాలు. శుభకార్యాలు చేయరాదు.

16. కర్తరులు : సూర్యుడు భరణి 3,4 పాదాలు సంచరించడం డొల్లుకర్తరి, పెద్దదోషం లేదు. కృత్తికలో సంచరించడం అగ్ని కర్తరి. కర్తరీకాలంలో చెట్లు నరకడం,కృష్యారంభం, విత్తుజల్లుట, వాసీకూపతటాక గృహనిర్మాణాదులు, క్రొత్త వాహనములు వాడకము ప్రారంభించుట చేయరాదు. ఉపనయనం, వివాహ,గృహప్రవేశం, యజ్ఞయాగాదులు మొదగులనవి చేయవచ్చును.

17. జన్మనక్షత్ర విధులు: జన్మనక్షత్రములో వ్యవసాయ, నిషేక, యజ్ఞాదులు, చెవులు కుట్టుట, అన్నప్రాశన, ఉపనయనం, భూసంపాదన, అక్షరాభ్యాసం,చేయవచ్చును. గర్భాదానం, పుంసవనసీమంతాలు, ప్రయాణం, వివాహం, ఔషధసేవ, శ్రాద్ధం, క్షౌరం, మొదగులనవి చేయరాదు.

18. పాము శకునం :రైతు తనమానాన తాను పోతుండగా పడగఎత్తి ఆడుచున్న పాము కనబడితే పొలం బాగా పండును. చచ్చినపాము కనబడితే మరణవార్త వినును. పాముపారిపోతే ఫలితం శూన్యం.

19.చుక్కెదురుదోషము: శుక్రమూఢములో ప్రయాణమునే చుక్కెదురు దోషమందురు. నవవధువు, గర్భిణీ బిడ్డతో కలసి బాలెంత-వీరు ముగ్గురునూ శుక్రాభిముఖముగ అస్సలు ప్రయాణంచేయరాదు.

20. కొత్తకాపురం:ఆడపిల్లను క్రొత్తగా కాపురమునకు పంపుటకు ఆది, మంగళ, శుక్రవారాలు పనికిరావు. పునర్వసు నక్షత్రము దోషభూయిష్ఠము.