Menu

Gruha Santhi – Dosha Nivarana

గృహ శాంతి - దోషాలు నివారణ

గృహ శాంతి – దోష నివారణ

గృహమే కదా స్వర్గసీమ అన్నారు. మానవుడిపై అతడు నివసిస్తున్న గృహ వాస్తు ప్రభావం కూడా ఉంటుంది. గృహ ప్రవేశమునకు గ్రహ శాంతి హోమం చేస్తారు. కాని వాస్తు హోమం కాదు. అది స్వంత ఇల్లు అయిన అద్దె ఇల్లు అయిన గ్రహ శాంతి ఒకటే. వాస్తు పురుషుడు, వాస్తు హోమం ఇవన్ని కల్పితములు. గృహ నిర్మాణమునకు ముందు చేయునది స్థల శుద్ధి, స్థల పుణ్యః వచనము, శంఖు స్థాపన. ఇక హోమం అనగా వాస్తు హోమం కాదు, గ్రహాలకు శాంతి హోమం చేయాలి దీనినే వాస్తు హోమంగా చెపుతున్నారే  కాని ఇందులో నిజం లేదు.

ఇక శాంతి అంటే ఆ ఇంటి యజమానికి జనన లగ్నాత్ శుభ పాపగ్రహాలను తెలుసుకొని శుభులకు పూజ చేసి దానం తీసుకోవాలి, పాపులకు శాంతి చేసి దానం ఇవ్వాలి. వేద పండితులతో ఈ  స్థల శుద్ధి, స్థల పుణ్యః వచనము, శంఖు స్తాపన, శాంతి హోమం చేయించాలి. స్వతహాగా చేయరాదు.

పూజలు, హోమాలు కూడా వాస్తు దోషాలను బాగా నివారిస్తాయి. విఘ్నేశుడి పూజ, నవగ్రహ శాంతి, వాస్తు పురుష పూజ, హోమం, నవచండీయాగం, అగ్నిహోత్రయగ్నం, అనుష్టానాలు లాంటివి చేయవచ్చు. పండితుడి ఆధ్వర్యంలో వీటిని చేయించాలి.

వాస్తు పురుషుడి విగ్రహం, వెండితో చేసిన నాగ పడగ, రాగి తీగ, ముత్యం, పగడంలను ఎరుపు రంగు వస్త్రం చుట్టి తూర్పు దిక్కులో ఉంచాలి. ఎర్రమట్టి, జీడిపప్పు, పగడంలను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి పశ్చిమ దిక్కులో ఉంచాలి. మంగళవారం నాడు అగరుబత్తీలు వెలిగించి పూజ చేసిన తర్వాత ఈ పని చేయాలి.

ఇంటిని పడగొట్టాల్సి వస్తే వాస్తు పండితుడిని పూజించి ఆ తర్వాతే పడగొట్టాలి. పడగొట్టే సమయంలో మట్టి పాత్ర, నీరు, ఆసనం లాంటివి తీసుకోరాదు. ఇంటి ముందు తులసి మొక్కను ఉత్తర లేదా ఈశాన్య దిక్కుల్లో ఉంచడం మంచిది.

ఇంట్లో దోషాలున్నప్పుడు ఏ కారణం వల్లనైనా మరమ్మతులు చేయలేని పక్షంలో ఆ ఇంటి ఉత్తర దిక్కు గోడలోని ఈశాన్య భాగంలో మత్స్య యంత్రాన్ని ప్రతిష్ఠించి పూజించాలి. అలా చేయడం వల్ల చాలా వరకు దోషాలు నివారణ అవుతాయి.

ముఖద్వారానికి అభిముఖంగా ఉండే గోడలపై విఘ్నేశ్వరుడి చిత్రపటాన్ని గానీ, శ్రీ యంత్రాన్ని గానీ ఉంచాలి. ఆర్థిక పరిస్థితులు బాగుండకపోతే ఈశాన్య దిక్కులో నీటి తుంపరల (ఫౌంటెన్‌ లాంటిది) యంత్రాన్ని ఉంచాలి. అప్పుడు ధనాధాయం పెరుగుతుంది లేదా బంగారు రంగు చేపలు 9, నలుపు చేప ఒకటి ఉంచిన నీటి తొట్టెను (అక్వేరియం)ను ఈశాన్యం దిక్కులో ఉంచాలి.

గృహ యజమాని నామ నక్షత్రాన్ని బట్టి ఇంటికి సింహ ద్వారాలు ఎక్కడ ఉండాలి? ఎన్ని గుమ్మాలు ఉండాలి? ఎక్కడెక్కడ ఉండాలి? కిటికీలు ఎక్కడ ఉండాలి..? వంటి విషయాలన్నీ ముందే వాస్తు పండితులను సంప్రదించి నిర్ణయించుకోవాలి.

వాస్తు వినాయకుడు
భారతీయ సంస్కృతీలో విఘ్నేషుడికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. ఏ పని మొదలు పెట్టాలన్నా మొదట వినాయకుడికే తొలి పూజ చేయాలి.  వాస్తు విషయంలో కూడా వినాయకుడికే పెద్ద పీట. వాస్తు శాస్త్రంలో గణపతి పూజ అన్ని వేళలా ప్రాముఖ్యత వహిస్తుంది. గణపతి ప్రతిమ లేని ఇల్లు ఉండదు.

గృహ అలంకరణ విషయంలో కూడా గణపతి మూర్తిని వాడుతుంటారు. ఈ ప్రతిమలు రకరకాల రంగులలో, భిన్న ఆకృతులతో మనకి లభ్యమవుతున్నాయి. ఇలా లభ్యమైన గణపతుల్ని ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టం గా ఇళ్ళలో అలంకరించుకొంటారు, దానికే మనం కొద్దిగా వాస్తు కూడా జోడించి, ఈ ప్రతిమలను అలంకరించుకొంటే అన్ని విధాల మంచి జరుగుతుంది.

నిల్చుని ఉన్న గణేష్ ప్రతిమను షాప్స్, ఆఫీసులలో, పరిశ్రమలలో ఉపయోగించడం వలన అభివృద్ది ఉండదు. వినియోగదారుల కొనుగోల సంఖ్య తగ్గుతుంది. అటువంటి ప్రదేశాలలో కూర్చోని ఉన్న గణపతిని ఉంచడం మంచిది. ఇంట్లో నిల్చుని ఉన్న గణపతి ఉండడం వలన సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి.