Menu

జ్యోతిష్యము

jyothisham And Uses

jyothisham And Uses

జ్యోతిష్యం – ప్రయోజనాలు

మానవుడికి అందుబాటులో ఉన్న అన్ని శాస్త్రాలలోకి జ్యోతిష్య గొప్పది. జన్మించిన తేది, సమయం, ప్రదేశం.. ఈ మూడింటిని బట్టి మానవుని వ్యక్తిత్వం, అతడి భవిష్యత్ సంఘటనలు, ఆయు ప్రమాణం, ఇతర వివరాలు చూపించే విద్య జ్యోతిష్యం.

జ్యోతిష్య విద్యతో భవిష్యత్తును మార్చుకునే అవకాశం ఉంటుంది. అంటే కర్మ ఫలం అనేది స్థిరం కాదు. దానిని మార్చవచ్చు. జీవితంలో మానవుడు అనుభవించే మంచి, చెడు రెండూ గత జన్మలలో చేసుకున్న కర్మ ఫలితాలు. కనుక సరైన కర్మను ఇప్పుడు చేసి, దాని ద్వారా పూర్వం చేసిన చెడు కర్మ ఫలితాన్ని మార్చవచ్చు. భగవంతుని సృష్టిలో మార్పుకు ఎప్పుడూ వీలుంటుంది.

అయితే భవిష్యత్తు మొత్తాన్నీ మనం ఇష్టం వచ్చినట్టు మార్చగలమా? మార్చలేము. కర్మ 3 రకాలు. మొదటిది అనుభవించక తప్పని దృఢ కర్మ. రెండవది రెమెడీస్ కి లొంగే అదృఢ కర్మ. మూడవది గట్టి రెమెడీస్ కి లొంగే మిశ్ర కర్మ. జ్యోతిష చక్రాన్ని బట్టి ఏది ఏదో తెలుస్తూంది. ఉన్నత అంశ చక్రాలైన ఖవేదాంశ , అక్ష వేదాంశ, నక్షత్రాంశ, షష్ట్యంశ లు పూర్వ జన్మ దోషాలను చూపుతాయి. నాడీ అంశ గుర్తించగలిగితే పూర్వ జన్మలను అద్దంలో చూసినట్టు చూడవచ్చు. దోషాలన్నీ పూర్వ జన్మపు చెడు కర్మలు. మంచి యోగాలు మంచి కర్మలు. దోషాల పైన గురు దృష్టి లేదా పంచ విధ సంబంధాలలో ఏదో ఒకటి ఉంటే అది పరిహారాలకు లొంగుతుంది. శుభ గ్రహ సంబంధం లేకుంటే లొంగదు.

జ్యోతిష్య శాస్త్రం ద్వారా మనం జన్మించిన సమయానికి ఖగోళములోని గ్రహస్థితులను సూచిస్తూ వేయబడే చక్రాన్నే జాతకము అంటారు. దీనినే జాతకచక్రము, జన్మకుండలి, హోరోస్కోప్‌ ఇలా వివిధ రకాల పేర్లతో ఆయా ప్రాంతాలవారు సంబోధిస్తుంటారు. ఒక వ్యక్తి జన్మించిన సమయము, ప్రదేశం ఆధారంగా జాతకచక్రం గణించబడుతుంది. ఖగోళములోని గ్రహస్థితులను గణితాధారముగా లెక్కించి, ఆయా రాశి, నక్షత్ర, భావాలలో ఉన్న గ్రహాల ఆధారముగా భవిష్యత్తు చెప్పబడుతుంది. దీని గణనలో కాని, జన్మించిన సమయములో కాని తప్పు జరిగినట్లయితే అది ఆ నిర్దేశిత వ్యక్తి జాతకం కాక వేరే వారి జాతకం అవటమే కాకుండా, ఈ వ్యక్తికి చెప్పబడ్డ భవిష్య ఫలాలన్నీ తప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తు తెలుసుకోవలనుకుంటే జాతక చక్రం అత్యావశ్యమైనదిగా చెప్పబడింది. జ్యోతిషమనే మహా సముద్రములో జాతకము ఒక నీటి బిందువులాంటిది.

జ్యోతిష శాస్త్రం ప్రధానంగా 3 విభాగాలలో విస్తరించింది. సిద్ధాంత, సంహిత, హోరా విభాగాలు. సిద్ధాంత స్కంధాన్ని గణిత స్కంధం అని కూడా అంటారు. దీనిలో గ్రహ గణితానికి సంబంధించిన ముఖ్య విషయాలు ఉంటాయి. గ్రహాల మధ్యమ స్థితి, స్పష్ట స్థితి, సంవత్సర-ఆయన-మాసాది కాలనిర్ణయం, గ్రహణాదులు మొదలైన గణితాధార విషయాలను వివరిస్తుంది. దీనిలో మూడు విభాగాలుంటాయి. 1. కల్పారంభం నుంచి గ్రహగణితం కలిగిన దానిని సిద్ధాంతమని, 2. ఒక మహాయుగం నుంచి గ్రహగణితం కలిగిన దానిని తంత్రమని, 3. ఒక శక సంవత్సరం నుంచి గ్రహ గణితం కల దానిని కరణమని అంటారు.

సంహిత విభాగములో ఖగోళములో గ్రహభ్రమణాలు, తోకచుక్కలు, ఉల్కాపాతాలు, గ్రహణాలు మొదలైన వాటివలన ప్రపంచానికి జరిగే శుభాశుభాలకు సంబంధించిన విషయాలు, ముహూర్త సంబంధ విషయాలు ఉంటాయి. హోరా విభాగం మనిషి జన్మ సమయాన్ని ఆధారంగా చేసుకొని అతని జీవితంలో జరిగే శుభాశుభాలను వివరిస్తుంది. దీనికే జాతక స్కంధం అని పేరు. దీని ద్వారా మానవుడుజన్మించిన సమయం, ప్రదేశం ఆధారంగా అతని జాతకచ క్రాన్ని లిఖించి అయా గ్రహ, భావ, యోగాల అధారముగా అతని జీవితములో జరిగే శుభాశుభ ఫలాల్ని లెక్కించడం జరుగుతుంది.

సామాన్యులు కూడా తమ రాశి నక్షత్రాలను మరిచిపోకుండా ఉండే విధంగా ఆయా నక్షత్ర పాదాలు ఏయే అక్షరాలను ప్రభావితం చేస్తాయో వాటికి అనుగుణంగా ప్రతి నక్షత్ర పాదానికి ఒక అక్షరాన్ని ఇవ్వడం జరిగింది. ఆ నక్షత్రములో ఆ పాదములో జన్మించిన వ్యక్తులు ఆ నక్షత్రపాదానికి సూచించబడిన అక్షరముతో ఆరంభమయ్యే పేరును తమ జన్మ నామముగా పెట్టుకునే విధానాన్ని మన ప్రాచీనులు ఏర్పాటు చేశారు. జన్మనామాక్షరాలకు సంబంధించి పూర్తివివరాలను లఘు బ్రహ్మయామిళ గ్రంథములో పొందవచ్చు.

మీ జన్మనక్షత్రముద్వారా మీ జన్మ నామాన్ని తెలుసుకునే విధంగా నక్షత్రాలు వాటికి సూచించబడిన అక్షరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
అశ్విని – చు, చే, చో, లా
భరణి – లీ, లూ, లే, లో
కృత్తిక – ఆ, ఈ, ఊ, ఏ
రోహిణి – ఓ, వా, వీ, వు
మృగశిర – వే, వో, కా, కీ
ఆరుద్ర – కూ, ఘ, జ్ఞ, ఛ
పునర్వసు – కే, కో, హా, హీ
పుష్యమి – హూ, హే, హో, డ
ఆశ్రేషా – డీ, డూ, డే, డో
మఖ – మా, మీ, మూ, మే
పుబ్బ – మో, టా, టీ, టూ
ఉత్తర – టే, టో, పా, పీ
హస్త – పూ, షం , ణా, ఠా
చిత్త – పే, పో, రా, రీ
స్వాతి – రూ, రే, రో, తా
విశాఖ – తీ, తూ, తే, తో,
అనురాధ – నా, నీ, నూ, నే
జ్యేష్ఠ – నో, యా, యీ, యూ
మూల – యే, యో, బా, బీ
పూర్వాషాఢ – బూ, ధా, ఫా, ఢ
ఉత్తరాషాఢ – బే, బో, జా, జీ
శ్రవణం – జూ, జే, జో, ఖ
ధనిష్టా – గా, గీ, గూ, గే
శతభిషం – గో, సా, సీ, సూ
పూర్వాభాద్ర – సే, సో, దా, దీ
ఉత్తరాభాద్ర – దూ, శ్యం , ఝ, థ
రేవతి – దే, దో, చా, చీ

ఉదాహరణకు మీరు స్వాతి నక్షత్రం లో జన్మించారనుకోండి చిత్తా నక్షత్రానికి ఇవ్వబడిన అక్షరాలు రూ, రే, రో, తా మొదటి పాదములో జన్మించిన వారి జన్మనామం పే అక్షరముతో ప్రారంభమవుతుంది. అంటే.. రూప, రూపేశ్, ఈ విధంగా ఆయా నక్షత్ర పాదాలలో జన్మించిన వారికి ఆయా జన్మనామాలు ఏర్పడతాయి. పేరు మొదట్లో ద్వంద్వాక్షరం వచ్చినట్లయితే మొదటి అక్షరమును విడిచి రెండవదానినే జన్మనామాక్షరముగా గ్రహించవలెను.

Gochaaramu – Phalamulu

గోచారములు - ఫలితాలు

గోచారములు – ఫలితాలు

జ్యోతిష్య శాస్త్రంలో అనేక విధాల అధ్యయనాలున్నాయి. ఇందులో భాగంగా గోచారం ఉంది. గోచారము అంటే ప్రస్తుత గ్రహస్తితిని బట్టి వ్యక్తికి సంబంధించిన రాశి ఫలము. జాతకచక్రంలో వ్యక్తి జన్మించినప్రథమ భాగాన్ని లగ్నంగా తీసుకుంటారు. చంద్రుడున్న నక్షత్రాన్ని ఆ వ్యక్తి జన్మ నక్షత్రంగానూ, ఆ చంద్రుడున్న రాశిని ఆ వ్యక్తి రాశి గానూ చెబుతారు.

ఉదాహరణకు… 2014  సెప్టెంబర్‌ 25 తేదీన సూర్యోదయంలో(సుమారు 6 గంటలకి) జన్మించిన వ్యక్తి ఐతే, ఆ సమయానికి చంద్రుడున్న హస్త నక్షత్రం ఆ వ్యక్తి జన్మ నక్షత్రం, అలాగే చంద్రుడున్న రాశి కన్య ఆవ్యక్తి రాశి అవుతుంది. ఆ సమయంలో ఉదయిస్తున్న రాశి లగ్నము అవుతుంది. ఈ లగ్నాన్ని అనుసరించి జీవితంలోని స్వభావ, రోగ, వృత్తి, వివాహ, సంతాన, ప్రమాద మొదలైన అంశాలు నిర్ణయిస్తారు. గోచారానికి జాతకంతో ఉన్న సంబంధం ఒక వ్యక్తికి ఈ అంశాలకి సంబంధించిన పూర్తి సమాచారం అతని జాతకం చూసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. కాలాన్ని బట్టి వచ్చే మార్పులు పాప పుణ్యబలాల్ని సుఖ ఫలంగానూ దు:ఖ ఫలంగానూ చూపించే పట్టిక గోచారము. జాతకంలో ఉద్యోగంకానీ వివాహంగానీ యోగమున్నా గోచారంలో అనుకూల దశ లేకపోతే అవి వికటించవచ్చు. అలాంటప్పుడు పరిమితుల్లో ప్రవర్తనని ఉంచుకోవటం పుణ్యబలం పెంచుకోవటం అవసరం. అంటే జ్యోతిష జీవితాన్ని మార్చేది కాదు జీవితాన్ని సరిదిద్దుకునే సూచనలిచ్చేది అని తెలుసుకోవాలి.

కొన్ని ఉదాహరణలు… ఆదాయవ్యయాలు గమనించినప్పుడు.. వ్యయం ఎక్కువగా ఉన్నట్లైతే ఎలాగూ తప్పని ఖర్చు కనుక ఆ ఖర్చును పుణ్యకార్యాలకు ఖర్చుపెడితే మళ్లీ అది మనకు పుణ్యంరూపంలో ఉపయోగపడి కాపాడుతుంది. ఆదాయం ఎక్కువగా ఉంటే పుణ్యకార్యాలతో పాటు స్థలాలు, ఇంటి నిర్మాణాలు మొదలైనవి కొనే ప్రయత్నం చేయటం మంచిది. భవిష్యత్ ఫలితాలను జాతకాదులలోని యోగావయోగాలతో పోల్చి చూసుకోవటం ద్వారా కాలాన్ని జీవితాన్ని సద్వినియోగంచేసుకోవచ్చు.

గోచార రీత్యా జన్మరాశి నుంచి 12 రాశులలో నవగ్రహములు సంచరించేటప్పుడు కలుగు ఫలితాలు ఈ విధముగా ఉంటాయి.

సూర్యుడు
సూర్యుడు జన్మ రాశిలో సంచరింస్తున్నప్పుడు స్థాన మార్పిడి , 2 వ రాశికి వచ్చినపుడు భయమును ౩ సంపదను 4 మాన హానిని 5 విశేష భయమును 6 శత్రు నాశనం 7 దుఃఖము 8 రోగము 9 విచారమును 10 కార్య సిద్ధిని 11 ధన లాభమును 12 ధన వ్యయమును కల్గించును.

చంద్రుడు
చంద్రుడు 12 రాశులలో సంచరింస్తున్నప్పుడు 1 భోజన సౌఖ్యమును 2 ధన క్షయమును ౩ ద్రవ్యలాభమును 4 విశేష రోగ భయమును 5 కార్య నాశనము 6 ధనరాబడిని 7 ద్రవ్య లాభమును 8 మరణ సమాన ఫలితములను 9 రాజ కోపమును 10 సౌఖ్యమును 11 లాభమును 12 ధన నష్టమును కలిగిస్తున్నాడు.

కుజుడు
కుజుడు ద్వాదశ రాశులలో సంచరిస్తున్నప్పుడు 1 దుఃఖము 2 భాగ్య హాని ౩ సౌభాగ్యము 4 శత్రువుల వలన బాధలు 5 శత్రు భయము 6 ద్రవ్య సిద్ది 7 కార్య హాని 8 శస్త్రబాధ గాయములు ఏర్పడుట 9 ధన వ్యయము 10 దుఃఖ నాశనము 11 ధన యోగము 12 క్రూరత్వమును కలుగ జేయును.

బుధుడు
బుధుడు 12 రాశులలో సంచరిచు సమయములలో 1 బంధనము 2 సువర్ణ లాభము ౩ శత్రుభాధలు 4 శత్రువుల నాశనము 5 దరిద్రము 6 ఆభరణ లాభము 7 లాభములను 8 సంతోషము 9 ధన నష్టము 10 ప్రమోదము 11 మోదమును 12 నాశనము కలిగించును .

గురుడు
గురుడు ద్వాదశ రాశులలో సంచరించు సమయములో 1 దేశ త్యాగము 2 ధన లాభము ౩ కార్య హాని 4 ధన నాశనము 5 సంపద 6 దుఃఖము 7 ఆరోగ్యము 8 ధన హాని 9 ధనాగమము 10 ఆయాసము 11 లాభములను 12 నష్టములను కల్గించు చున్నాడు .

శుక్రుడు
శుక్రుడు ద్వాదశ రాశులలో సంచరించేటప్పుడు 1 ఆరోగ్యము 2 అలంకారము ౩ లాభము 4 రతిసౌఖ్యము 5 మిత్రదర్శనము 6 మానహాని 7 విశేష రోగము 8 భూలాభము 9 ధాన్యవృద్ధి 10 ప్రమోదము 11 ధనము 12 సంతోషముల ను కలుగ జేయును .

శని
శని 12 రాశులలో సంచారము చేయునపుడు 1 ఆపదలను 2 హానిని ౩ సంపదను 4 గర్భసంభంద రోగములను 5 సంతానమునకు కష్టములను , నాశనమును 6 మహా ఐశ్వర్యమును 7 మహా దరిద్రమును 8 మరణ సమాన ఫలితములను 9 దేహ శోషణమును 10 బంధనమును 11 లాభమును 12 అనేక విధాల నష్టములను కలిగించు చున్నాడు .

రాహు , కేతువులు
రాహు కేతు గ్రహములు జన్మరాశి నుంచి 12 రాశులలో సంచరించు సమయమున 1 భయమును 2 కలహాలను ౩ సౌభాగ్యమును 4  మానహానిని 5 ధన నష్టములను 6 మహా సుఖములను 7 శత్రువుల వలన భయమును 8 చొర భయమును 9 శత్రు వృద్ధిని 10 ధన క్షయమును 11 శుభ ఫలములను 12 భ్రుత్యునాశనమును కలిగించుదురు .