Menu

జ్యోతిష్యము

Subhayogaas

Shubhayogas

శుభ యోగములు

జ్యోతిష్య శాస్త్రంలో అనేక యోగాలు ఉన్నాయి. రాశి, అంశ చక్రాలలో ఉన్న గ్రహస్థానలను పరిశీలిస్తూ ఈ యోగాలు ఉంటాయి. యోగాలను అనుసరించి శుభయోగములను, అవయోగములను విపులంగా చర్చించబడింది. ఈ యోగములు శుభాశుభ గ్రహములు తామున్న రాశుల స్థితిని బట్టి గ్రహముల కలియికను బట్టి దృష్టిని బట్టి ఏర్పడతాయి. దాని వల్ల వాటి బలములను అనుసరించి యోగముల బలములు నిర్ణయించాలి.

భాగ్య యోగము
భాగ్య స్థానమును అనగా లగ్నం నుంచి 9వ ఇంట శుభ గ్రహము ఉన్నానూ లేదా శుభ గ్రహం చూసినానూ.. ఆ భాగ్యధిపతి తన స్వ, మిత్ర, ఉచ్చ స్తానములో ఉన్న కూడా ఈ భాగ్య యోగం కలుగుతుంది. ఈ యోగమున జన్మించిన వాడు శాశ్వత ఐశ్వర్యవంతుడు, రాజ పూజితుడు, ధర్మమార్గపరుడు స్వకులాచార తత్పరుడు మొదలగు శుభ గుణములు కలిగి వుండును.

పారిజాత యోగము
లాభ స్థానమున (లగ్నము నుంచి 11వ భావమున) శుభగ్రహ ఉంటే ఆ స్థానమును శుభగ్రహము చూసినా, లేదా లాభాధిపతి స్వ, మిత్ర ఉచ్చ క్షేత్రమునందున్ననూ ఈ యొగము కలుగును. విపరీత రాజయోగముగా చెప్పుకునే ఈ యోగము చాలా అరుదుగా జాతకములలో కనిపించును. లగ్నాధిపతి ఉన్న రాశ్యాధిపతి, ఆ రాశ్యాధిపతి ఉన్న లగ్నాధిపతి, లేదా లగ్నాధిపతి ఉన్న రాశ్యాధిపతి, రాశ్యాధిపతి ఉన్న నవాంశాధిపతి కేంద్రములందు కానీ కోణమందుకాని, ఉచ్చస్థితిపొంది దిగ్బలము పొంది ఉండాలి. ఇట్టి జాతకులు బాల్యంలో సాధారణ జీవితంతో ప్రారంభించి తరువాతి కాలంలో మధ్య వయసు నుంచి అపారమైన గౌరవం, ప్రభువులతో, ధనికులతో సకల మర్యాదలు పొందినవారు, విశేష ధన, వాహనములు, ప్రబల కీర్తి కలిగి ఉందురు.

త్రిలోచనయోగము
త్రిలోచనయోగములో ఆయుర్దాయము, శత్రువులపై విజయము, వంటి శుభ ఫలములతో, పాటు సంపద కీర్తి మేధాశక్తి కలిగి ఉందురు. రవి చంద్ర, కుజులు ఒకరికొకరు కోణములలో ఉండును. దీనివల్ల వీరి జీవితం ఏ ఒడుదొడుగులు లేకుండా నల్లేరు మీద బండి వలె సాఫీగా సాగును. ఇదియు నొక శుభయోగమే.

ఖ్యాతి యోగము
లగ్నము నుంచి దశమ స్థానమందు శుభ గ్రహము ఉంటే, శుభ గ్రహ వీక్షణ కలిగినను, దశమాధిపతి తన స్వ, మిత్ర, ఉచ్చ స్థానంలో ఉంటే,  ఈ యోగము కలుగును. ఈ జాతకులు ధన, మిత్ర, సతీ సుతులతో, సకల సంపదలు కలిగి ప్రజాదరణ, కీర్తి ప్రతిష్టలు కలుగును.

గజకేసరి యోగము
గురుడు లగ్నము నుంచి కానీ చంద్రుని నుంచి కానీ కేంద్రంలో ఉంటే గజకేసరి యోగం అవుతుంది. ఈ గురుడు నీచను పొందక, అస్తంగతుడు కాక, శతృ క్షేత్ర స్థితిని పొందక, మరొక శుభ గ్రయుపతిగానీ వీక్షణ గాని పొంది ఉండాలి. ఇక ఈ యోగము శుభ ఫలితములిచ్చును. జాతక చక్రములో గురు, చంద్రుల ఉనికి వలన ఈ యోగము ఏర్పడుతుంది. చంద్రుని నుంచి గురుడు కేంద్రముల యందు ఉన్నప్పుడు అనగా గురుడు 4, 7, 10 స్థానములలో వున్నప్పుడు ఈ యోగబలము 4 కన్నా 7 లోనూ, 7 కన్నా 10 లోను అధికముగా వుంటుంది. ఈ యోగముల వారు సభ్యత, ఉదారము, సంపద, దానగుణము, ఉన్నతాధికారము మొదలగు సకల శుభ లక్షణములు కలిగి ఉందురు. గురు చంద్రుల బలములు, గురుడు చంద్రుని కంటే ఎక్కువ బలం పొందిన ఆ జాతకులు విశేష ధన కీర్తి, సుఖమయ జీవితం జీవితాంతం గడపగలరు.

ఈ యోగములలొ ఉన్న సర్వ శుభములు కనుపించుటకు ఆ గ్రహములన్ని అస్థంగత దోషం లేకుండా ఉండాలి. ఆ గ్రహములకు షడ్బలము దిగ్మలము కలిగి ఉండవలెను.

Jyothishayam

Astrology In Telugu

జ్యోతిష్య రహస్యము

మానవజాతి అవతరించిన తర్వాత ఎన్నో శాస్త్రాలు పుట్టాయి. మన ఋషులు ప్రజా శ్రేయసు కోసం అందించిన శాస్త్రాలలో అన్నిటికంటే అతి ప్రాచీనమైనది జ్యోతిష్యం. జీవి జీవితంలో జరిగింది, జరగబోతుంది, జరగబోయేది జననకాల గ్రహస్థితి ప్రకారము, శరీర లక్షణాలు, అర చేతులు, మొదలైన అంశాలను ఆధారం చేసుకుని చెబుతుంది జ్యోతిష్యం.

జ్యోతి అన్న పదానికి సంస్కృతం లో వెలుగు, నక్షత్రము, నేత్రం,సూర్యుడు అనే అర్ధాలు ఉన్నాయి. అనంత విశ్వంలో మన కంటికి ఆకాశంలో కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కొన్ని గ్రహాలు, తోకచుక్కలు, గ్రహణాలు ఇవన్నీ ఆకాశంలో చూసి ఆనందించటంతో పాటు పూర్వకాలం వారికీ ఆశ్చర్యం కూడా కలిగేది, ఎంతో ఉత్సాహంగా కూడా ఉండేది.

కాంతి గోళాలైన నక్షత్రాలు, గ్రహాలు, సూర్య, చంద్రులు భూ వాతావరణంపై, ప్రాణులపై చూపించే ప్రభావాలను, మానవ జీవితంతో వాటికున్న సంబంధాలను అధ్యయనం చేసేదే జ్యోతిష శాస్త్రం. అయితే ఈ కాంతి రెండు రకాలు. 1. నక్షత్రాలు, సూర్య, చంద్రులకు సంబంధించిన బయటి కాంతి, 2. ఆత్మకు సంబంధించిన లోపలి కాంతి. బయటి కాంతి స్పష్టం అవుతున్న కొద్ది లోపలి జ్యోతి స్వరూపమైన ఆత్మ తత్వం బోధపడుతుంది. కాబట్టి జ్యోతిష్య శాస్త్ర ముఖ్య లక్ష్యం భవిష్యత్తు గురించి తెలుసుకోవడమే కాక మానవుల ఆధ్యాత్మిక పరిణామం కోసమని కూడా తెలుస్తోంది. అందుకే జ్యోతిష్య శాస్త్రాన్ని ‘వేద చక్షువు’ అంటారు. అంటే జ్ఞాన నేత్రం అని అర్థం.

భూమి గుండ్రంగ ఆఉందని గ్రీకు శాస్త్రవెత్త టాలెమి కనిపెట్టడానికి ఎన్నో వేల సంవత్సరాల పూర్వం నుంచే మన దేశంలో ఖగోళం అనే పదము వాడుకలో ఉంది. జ్యోతిష్య శాస్త్రం పూర్తిగా భారతీయ విద్య. గ్రీకులు, బాబిలోనియా వారు మన దేశంలో జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రవేశపెట్టారనే విదేశీయుల వాదన పూర్తిగా సత్యదూరమైంది. ఆయా దేశాలు కళ్లు తెరవక ముందే రుగ్వేదం, యజుర్వేద, సామ, అధర్వణ వేదాదులలో జ్యోతిష్య శాస్త్ర విషయాలు, రహస్యాలు అనేక చోట్ల ప్రస్తవించడం జరిగింది. ఇంతటి విశేషఖ్యాతి వహించిన జ్యోతిష్య శాస్త్రం బ్రహ్మ దేవునిచే నిర్మించబడినదిగా తెలుస్తోంది. ఆ తర్వాత ఈ శాస్త్రానికి సూర్యుడు, నారదుడు, కశ్యప, అత్రి, గర్గ, మరీచి, మనువు, అంగీరస, పౌలిష, చ్యవన, శైనక, వశిష్ఠుడు, పరాశరుడు, వ్యాసుడు మొదలైన  గురు తుల్యులైన మహర్షి పరంపర ప్రవర్తకులుగా నిలిచారు. ప్రవర్తకులు అంటే శాస్త్ర విషయాలు నిత్య జీవితంలో ఆచరణ స్థానాన్ని కల్పించి ప్రజా బాహుళ్యానికి అందుబాటులో ఉంచిన వారు అని అర్థం.

ప్రస్తుత ఆధునిక కాలంలో టెలిస్కోప్, ఇంటర్నెట్ లో అన్ని విషయాలు సులువుగా తెలుసుకుంటున్నాం కాబట్టి మనకు విశ్వ విషయాలు అద్భుతంగా అనిపించక పొవచ్చు. కానీ పూర్వ కాలం లో వారికీ అన్ని వింతగా, విశేషంగా అందరిని ఆకర్షించి తెలుసుకోవాలన్న కుతూహలాన్ని పెంచేవి. ఆ గ్రహాల గురించి కుతూహలం పరిశీలనా, ప్రాణులపై వాటి ప్రభావం వాతావరణంలో క్రమబద్ధమైన మార్పులు, వాటికీ మనవ జీవితంతో వున్నా సంబంధము మొదలైనవి జ్యోతిష్య శాస్త్ర ఆవిర్భావానికి కారణం అయ్యాయి.

భారతీయ జ్యోతిష్యానికి మూలం 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాశులు, 108 పాదాలు, పుట్టుక కాలం.

జ్యోతిష్యంతోనే వేద కార్యకలాపాలు

జ్యోతిష్యం వేదాంగాలలో చివరిది. వేదాన్ని అనుసరించి మనం చేసే యజ్ఞ, యాగాదికాలు ఉంటాయి. వాటిని నిర్వహించడానికి కొన్ని ప్రత్యేక సమయాలు ఉంటాయి. వాటినే శుభ సమయం లేదా ముహూర్తం అంటారు. ఈ ముహుర్తాలను అనుసరించి, వైదిక కార్యకలాపాలు చేస్తుంటారు. శుభ సమయాలు సౌరకుటుంబంలోని గ్రహాలు, నక్షత్రాల గమనం మీద ఆధారపడి వుంటాయి. నక్షత్ర, గ్రహ సంబంధమైన విషయాలను అధ్యయనం చేసి వివరించేదే జ్యోతిష్యశాస్త్రం. ఇది లేకుండా వేద కార్యకలాపాలు నిర్వహించడం కుదరదు.

జ్యోతిష్యం కర్మసిద్ధాంతము
భవిష్యత్తులో జరుగబోయే పరిణామాల గురించి ముందుగానే చెప్పి, మనం మానసికంగా వాటిని ఎదుర్కోడానికి తగిన ఉపాయాలను సూచిస్తూ జ్యోతిషశాస్త్రం సహాయకారిగా ఉంటుంది. జ్యోతిష శాస్త్రం మనకు మార్గదర్శకమై బాధల నుంచి విముక్తి పొందే మార్గాన్ని సూచిస్తుంది. కర్మ సిద్థాంతం 3 రకాలైన కర్మలను గురించి చెబుతోంది. అవి..

1. ప్రారబ్దకర్మ
గత జన్మలో మానవుడు చేసిన కర్మల ఫలితాన్ని ఈ జన్మలో అనుభవించడామే ప్రారబ్ద కర్మ.

2. సంచితకర్మ

గతజన్మలో మిగిలిపోయిన కర్మఫలాలను ఈ జన్మలో అనుభవించడమే సంచితకర్మ.

3. ఆగామికర్మ
ఈ జన్మలో మానవుడు చేస్తున్న కర్మల ఫలాన్ని వచ్చే జన్మలో అనుభవించేదిగా మారడమే ఆగామికర్మ.

అంటే మానవునికి తాను చేసిన కర్మల ఫలితాన్ని అనుభవించడానికి ఒక జన్మచాలదు. మానవుడు చేసే ఏ కర్మ అయినా తనకు అంటకుండా, భగవంతునికి సమర్పణ భావంతో చేయాలని, దీనివల్ల మానవునికి తక్కువ జన్మలలో మోక్షప్రాప్తి సుగమమై, జనన మరణ చక్రాల నుంచి తప్పుకోవడం జరుగుతుందని శ్రీకృష్ణ భగవానుడు చెబుతాడు.

గడిచిన జన్మలో చేసిన పాప కర్మల ఫలితాల ప్రభావాన్ని పూర్తిగా తుడిచి వేయడానికి జపం, ధర్మం, హోమం వంటి మార్గాలను జ్యోతిష శాస్త్రము సూచించింది. ఈ జన్మలో మనం చేసే మంచి కర్మల ఫలితాలు గత జన్మలో చేసిన పాపకర్మల ప్రభావాన్ని తగ్గించి మానవుడికి తక్కువ దు:ఖాన్ని కలుగజేస్తుంది. భగవంతుని ప్రగాఢంగా నమ్ముకున్నట్లయితే జ్యోతిష్య శాస్త్ర జ్ఞానం అనాయాసంగా మనిషిని చేరుతుంది.

బ్రహ్మరాత మన పూర్వ జన్మ కర్మను అనుసరించే ఉంటుంది. ఆ పూర్వ కర్మ మనం చేసిందే, దాని మీద అధికారం కూడా మనదే. కర్మ సంకల్పం నుంచి పుడుతుంది.ఆ సంకల్పం కూడా మనదే కదా! సత్కర్మల ద్వారా దోషాన్ని ఎలా పరిహరించాలో జ్యోతిష శాస్త్రం తెలుపుతుంది. పూర్వ జన్మలో చేసిన శుభ, పాప కర్మల యొక్క ఫలానుభవ కాలాన్ని జ్యోతిష శాస్త్రం సూచిస్తుంది. చీకటిలోని వస్తువులను దీపం సహాయంతో చూసినట్లుగా జ్యోతిష శాస్త్ర సహాయంతో జీవితంలో జరుగబోయే శుభాశుభ సంఘటనలను ముందుగా గుర్తించి.. దాంతో మంత్ర, ఔషధ, జప, దాన, హోమ, రత్న ధారణాది శాంతి ప్రక్రియల ద్వారా వ్యతిరేక ఫలితాలను నివారించుకోవచ్చని వరాహమిహిరుల వారి సందేశం మనకు లఘు జాతకం అనే గ్రంథంలో కనిపిస్తోంది.