Menu

Subhayogaas

Shubhayogas

శుభ యోగములు

జ్యోతిష్య శాస్త్రంలో అనేక యోగాలు ఉన్నాయి. రాశి, అంశ చక్రాలలో ఉన్న గ్రహస్థానలను పరిశీలిస్తూ ఈ యోగాలు ఉంటాయి. యోగాలను అనుసరించి శుభయోగములను, అవయోగములను విపులంగా చర్చించబడింది. ఈ యోగములు శుభాశుభ గ్రహములు తామున్న రాశుల స్థితిని బట్టి గ్రహముల కలియికను బట్టి దృష్టిని బట్టి ఏర్పడతాయి. దాని వల్ల వాటి బలములను అనుసరించి యోగముల బలములు నిర్ణయించాలి.

భాగ్య యోగము
భాగ్య స్థానమును అనగా లగ్నం నుంచి 9వ ఇంట శుభ గ్రహము ఉన్నానూ లేదా శుభ గ్రహం చూసినానూ.. ఆ భాగ్యధిపతి తన స్వ, మిత్ర, ఉచ్చ స్తానములో ఉన్న కూడా ఈ భాగ్య యోగం కలుగుతుంది. ఈ యోగమున జన్మించిన వాడు శాశ్వత ఐశ్వర్యవంతుడు, రాజ పూజితుడు, ధర్మమార్గపరుడు స్వకులాచార తత్పరుడు మొదలగు శుభ గుణములు కలిగి వుండును.

పారిజాత యోగము
లాభ స్థానమున (లగ్నము నుంచి 11వ భావమున) శుభగ్రహ ఉంటే ఆ స్థానమును శుభగ్రహము చూసినా, లేదా లాభాధిపతి స్వ, మిత్ర ఉచ్చ క్షేత్రమునందున్ననూ ఈ యొగము కలుగును. విపరీత రాజయోగముగా చెప్పుకునే ఈ యోగము చాలా అరుదుగా జాతకములలో కనిపించును. లగ్నాధిపతి ఉన్న రాశ్యాధిపతి, ఆ రాశ్యాధిపతి ఉన్న లగ్నాధిపతి, లేదా లగ్నాధిపతి ఉన్న రాశ్యాధిపతి, రాశ్యాధిపతి ఉన్న నవాంశాధిపతి కేంద్రములందు కానీ కోణమందుకాని, ఉచ్చస్థితిపొంది దిగ్బలము పొంది ఉండాలి. ఇట్టి జాతకులు బాల్యంలో సాధారణ జీవితంతో ప్రారంభించి తరువాతి కాలంలో మధ్య వయసు నుంచి అపారమైన గౌరవం, ప్రభువులతో, ధనికులతో సకల మర్యాదలు పొందినవారు, విశేష ధన, వాహనములు, ప్రబల కీర్తి కలిగి ఉందురు.

త్రిలోచనయోగము
త్రిలోచనయోగములో ఆయుర్దాయము, శత్రువులపై విజయము, వంటి శుభ ఫలములతో, పాటు సంపద కీర్తి మేధాశక్తి కలిగి ఉందురు. రవి చంద్ర, కుజులు ఒకరికొకరు కోణములలో ఉండును. దీనివల్ల వీరి జీవితం ఏ ఒడుదొడుగులు లేకుండా నల్లేరు మీద బండి వలె సాఫీగా సాగును. ఇదియు నొక శుభయోగమే.

ఖ్యాతి యోగము
లగ్నము నుంచి దశమ స్థానమందు శుభ గ్రహము ఉంటే, శుభ గ్రహ వీక్షణ కలిగినను, దశమాధిపతి తన స్వ, మిత్ర, ఉచ్చ స్థానంలో ఉంటే,  ఈ యోగము కలుగును. ఈ జాతకులు ధన, మిత్ర, సతీ సుతులతో, సకల సంపదలు కలిగి ప్రజాదరణ, కీర్తి ప్రతిష్టలు కలుగును.

గజకేసరి యోగము
గురుడు లగ్నము నుంచి కానీ చంద్రుని నుంచి కానీ కేంద్రంలో ఉంటే గజకేసరి యోగం అవుతుంది. ఈ గురుడు నీచను పొందక, అస్తంగతుడు కాక, శతృ క్షేత్ర స్థితిని పొందక, మరొక శుభ గ్రయుపతిగానీ వీక్షణ గాని పొంది ఉండాలి. ఇక ఈ యోగము శుభ ఫలితములిచ్చును. జాతక చక్రములో గురు, చంద్రుల ఉనికి వలన ఈ యోగము ఏర్పడుతుంది. చంద్రుని నుంచి గురుడు కేంద్రముల యందు ఉన్నప్పుడు అనగా గురుడు 4, 7, 10 స్థానములలో వున్నప్పుడు ఈ యోగబలము 4 కన్నా 7 లోనూ, 7 కన్నా 10 లోను అధికముగా వుంటుంది. ఈ యోగముల వారు సభ్యత, ఉదారము, సంపద, దానగుణము, ఉన్నతాధికారము మొదలగు సకల శుభ లక్షణములు కలిగి ఉందురు. గురు చంద్రుల బలములు, గురుడు చంద్రుని కంటే ఎక్కువ బలం పొందిన ఆ జాతకులు విశేష ధన కీర్తి, సుఖమయ జీవితం జీవితాంతం గడపగలరు.

ఈ యోగములలొ ఉన్న సర్వ శుభములు కనుపించుటకు ఆ గ్రహములన్ని అస్థంగత దోషం లేకుండా ఉండాలి. ఆ గ్రహములకు షడ్బలము దిగ్మలము కలిగి ఉండవలెను.