Menu

గృహంలో బ్రహ్మస్థానం ప్రాధాన్యత

Vasthu

Vasthu

వాస్తులో భాగంగా ఇప్పుడు బ్రహ్మస్థానం గురించి తెలుసుకుందాం. వాస్తులో నాలుగు దిక్కులు, నాలుగు మూలలులాగానే స్థలం మధ్యలో గత ప్రదేశాన్ని బ్రహ్మస్థానం అంటారు. స్థలానికి మధ్యలో గల ఒక ‘చుక్క’ ప్రాంతాన్ని బ్రహ్మస్థానం అని గుర్తించవచ్చు. కాని దిక్కులను విభజించినట్టుగానే ‘ఎకాశీత పదవాస్తు’ అని స్థలాన్ని అనేక భాగాలు చేసి దిక్కులకు పోను మిగిలిన మధ్యలో గల భాగాలను బ్రహ్మస్థానంగా గుర్తించారు.

ఈ మధ్య పట్టణాలో బ్రహ్మస్థానం గురించి విశేష పరిశోధనగా వివరిస్తూ బ్రహ్మస్థానంలో ఎత్తు చేయడం. పల్లం చేయడం, యంత్రాలు స్థాపించడం, అక్కడ బరువులు వుంచరాదని చెప్పడం, అక్కడి నుంచే కాస్మిక్ పవర్ వస్తుందనడం.. ఇలా లేనిపోనివి చెబుతున్నారు.

అసలు బ్రహ్మస్థానం గురించి ఒక్కమాటలో చెప్పాల్సిన అంశం ఏంటంటే ‘బ్రహ్మస్థానంలో, అదే పారులో గోడలు నిర్మించరాదు.’ ఆ విధంగా నిర్మిస్తే గృహం ప్లాన్ తప్పిందని అర్థం. బ్రహ్మస్థానం లైనులో గోడలు వస్తే గోడలు పారు తప్పడం లేదా గదుల కొలతలు వాస్తు దోషంలో రావడం జరుగుతుంది. కాబట్టి ఇవి వివరించకుండా పూర్వం బ్రహ్మస్థానం అని వివరించారు. అది అర్థం కాని కొద్ది మంది తాము ఏదో కనుగొన్నట్లు చెబుతూ ఉంటారు. అంతేకాదు బ్రహ్మస్థాన దోషానికి వారు చెప్పే సూచనలకు బతికి ఉంటే మహర్షులు కూడా ఆశ్చర్యపోవాల్సిందే.

బ్రహ్మస్థానంలో శంకుస్థాపన చేసుకొనవచ్చును. ఏదైనా అవసరార్థం(మిషనరి ఫిట్టింగ్ వంటివి) మేకులు, బోల్టులు, ఏర్పాటు చేయవద్దు. సాధారణంగా ఇంటిలో కదిలే ఫర్నిచర్ ఏవి వుంచుకొన్నా దోషం లేదు.

ఒకవేళ బ్రహ్మస్థానంలో గోడ వచ్చినచో ఉత్తరం, తూర్పులలో వాలువసారాలు నిర్మించి సరి చేసుకొనవచ్చును. లేదా ఆ ఇంటి ప్లానును అనుసరించి సరి చేసుకోవచ్చు. అంతేకాని ఇదేదో బ్రహ్మరహస్యం అని ఏవేవో చేసుకోవద్దు.

సెంటర్ లో ఒక వాసంపాతి నిర్మించే ఒంటినిట్టాడు పాకకు మరియు వెన్నువేసి నిర్మించినప్పుడు సెంటర్ లో వాసం వేసినా బ్రహ్మస్థాన దోషం లేదు. కాని వెన్నుకు నిలువుగా(సమంగా) గోడ నిర్మించరాదు.

గుడులలో బ్రహ్మస్థానం, గోపురం తూకం గుండుకు సమంగా వుండాలి. ఇవి ఇక్కడే సాంకేతికపరమైన విషయమే తప్పా వస్తు పాయింట్ కాదని గ్రహించండి.

గర్భ గుడిలో బ్రహ్మస్థానంలో విగ్రహ ప్రతిష్ట చేసుకోవచ్చు. ఇక్కడ బరువు అన్న దోషం వర్తించదు.

చుట్టూర గదులు వుండి మధ్యలో పల్లంగా వుండి అందు వర్షము నీరు పడే విధంగా ఉన్న ఇళ్లకు(మండువా ఇళ్లు) మధ్యలో గల పల్లం బ్రహ్మస్థానం అవుతుంది. ఇక్కడ పల్లం వుండటం వాస్తు దోషమే. కాని బ్రహ్మస్థానం పల్లం అయింది అనడం కన్నా ‘నట్టిల్లు పల్లం – వనవాసం’ అన్నారు పెద్దలు. అంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి భార్యాభర్తలు దూరదూరంగా వుండటం, నక్సలైట్లలాగా అడవులు పట్టుకుని తిరగడం, అడవిలో అక్రమ జీవనం కొనసాగించడం వంటివని అర్థం చేసుకోవాలి. లేదా ఇళ్లు వదిలి వెళ్లిపోవడం కూడా ఈ దోషంలోకే వస్తుంది.

పూర్వగ్రంధాలలో కూడా బ్రహ్మస్థాన ప్రస్థావన తక్కువగా వుందేగానీ, కనీసం మూలలు, దిక్కులకు ఇచ్చినంత వివరణ కూడా లేదు. అలాగని అసలు ప్రాధాన్యత లేదని చెప్పలేం.