Vastu Shastra – Interior- 2
వాస్తు – గృహాలంకరణ -2
నూతనంగా నిర్మించుకున్న గృహానికి అలంకరణ విషయంలో వాస్తు శాస్త్రం సలహాలను, సూచనలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల ఆ గృహం సంపూర్ణంగా వాస్తుకు లోబడి ఉండటంతో ఆ గృహం మంచి అభివృద్ధిని సాధించి, నిరంతరం సుఖసంతోషాలను తనలో ఇముడ్చుకుంటుంది.
గృహంలో బీరువాను దక్షిణ గోడకుకానీ పడమర గోడకుగానీ ఆనించి ఉంచాలి. మూలలకు ఆనించి ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. ద్వారం తలుపులు పువ్వులతోనూ, గంటలతోనూ అందంగా ఉండేటట్లు అలంకరించుకోవాలి.
అలాగే డైనింగ్ టేబుల్ అలంకరణ విషయంలో తూర్పు వైపు తిరిగి భోంచేసే విధంగా అమరిక ఉండాలి. ఇంట్లో ప్రతి గదిలోనూ ఈశాన్యం మూల ఖాళీగా ఉండేటట్లు చూసుకోవాలి.
అలాగే అన్ని గదులు సర్దిన తరువాత పడక గదిని కూడా వాస్తు సలహాల మేరకు అలంకరించుకోవాలి. వాస్తు ప్రకారం పడుకునేటప్పుడు ఉత్తరం వైపున తలపెట్టి పడుకునే విధంగా ఉండకూడదు. అలాగే ముఖద్వారానికి ఎదురుగా, దూలానికి వెన్ను కింద భాగంలో కూడా తలపెట్టి పడుకునే విధంగా ఉండకూడదు. అలాగే గృహ ఆవరణలో చెట్లు పెంచదలచుకుంటే వాటి నీడ ఇంటిపైన పడకుండా విధంగా జాగ్రత్తలు తీసుకొని పెంచుకోవాలి.
ఇక సాధారణంగా నివాస గృహాలు, కార్యాలయాలు, దేవాలయాల్లో అలంకరణ ప్రాయంగా చిత్రించే చిత్ర పలకముల ద్వారా కొన్ని దోషములు ప్రాప్తించగలవని వాస్తు చెబుతోంది. శాస్త్ర ప్రకారం కాకుండా రాక్షసులు, గ్రహ, నక్షత్ర, యక్ష, గంధర్వలు వంటి చిత్రాలు నివసించే గృహాల్లో ఉంటే దోషము సంభవిస్తుంది. అదే విధంగా ఉయ్యాలలూగుచున్నట్లు, ఏనుగులను పట్టుచున్నట్లు, జంతు యుద్ధ చిత్రములు, రాజవిగ్రహములు, దేవరాక్షస యుద్ధము, వేట, ప్రాణహింస, దేవాలయ విమాన గోపరములు మొదలగు చిత్రములు గృహమందుంచితే దోషప్రదము.
గృహావరణలో చెట్లను పెంచాలనుకున్నప్పుడు ఆ చెట్టు నీడ తన ఇంటిపై పడనంత దూరంగా వాటిని పెంచాలి. పూల మొక్కలను ఈశాన్య మూల మినహాయించి అన్ని దిక్కుల్లోనూ పెంచవచ్చు. ఇక తీగ చెట్లను ఇంటి మీదకు పాకించటం ఫ్యాషన్ అనుకుంటారు కానీ వాస్తు ప్రకారం వాటిని అలా ఇంటిపైకి పాకించకూడదు.
ఇంటి రంగులు
గృహ అలంకరణలో ముఖ్యమైనవి ఈ ఇంటికి అందం తెచ్చే రంగులు. నిర్మాణం పూర్తయిన గృహాలకు చక్కటి రంగులను నచ్చే విధంగా వేస్తే ఆ ఇల్లు చూడముచ్చటగా ఉంటుంది. అయితే ఈ రంగుల ఎంపిక కూడా వాస్తుకు లోబడి ఉంటే మంచిది. లేత రంగుల పెయింట్లు వాస్తు ప్రకారం మంచిది. లేత నీలం, ఆకుపచ్చ, పింక్, క్రీమ్ కలర్లను గదులకు వాడడం మంచిది. ఇంట్లో ఎరుపు, నలుపు రంగులను వాడకపోవడమే మంచిది. వాస్తు ప్రకారం ఇంటికి తెల్ల సున్నం వేయించటంలో తప్పులేదు. కాని ఇంటి పెద్ద జాతక రీత్యా లగ్నాధిపతి ఏ గ్రహముతో కలసి ఉంటాడో చూసుకుని రంగులు వేయించడం మంచిది. ఇలాంటి సమయాల్లో కొన్ని జాగ్రత్తలతో సున్నం వేస్తే సరిపోతుంది. అలాగే తూర్పు వైపు గృహానికి తెల్ల రంగు, దక్షిణ వైపున అయితే ఎరుపు రంగు, పశ్చిమ వైపున అయితే నీలి రంగు, ఉత్తరం వైపు ఆకుపచ్చని రంగులు వేస్తే మంచిది.
ఇక విద్యుత్ పరికరాలను కూడా సరైన దిక్కున ఉంచాలి. విద్యుత్ ఉపకరణాలను ఈశాన్య దిక్కున పెట్టకుండా చూసుకోవడం మంచిది. గ్యాస్, ఓవెన్‌ల, మైక్రోవేవ్ వంటి వేడిచేసే పరికరాలు ఆగ్నేయం దిశల్లో అమర్చుకోవాలి. గీజర్ కూడా బాత్‌రూమ్‌లో ఆగ్నేయ దిశలో అమర్చుకోవాలి. కూలర్, ఏసీ, ఫ్రిజ్.. గదిలో వాయవ్యంలో అమర్చుకోవాలి. గదిలో ఉత్తరం, తూర్పు లేక ఆగ్నేయంలో టివీ పెట్టుకోవచ్చు. గది ఈశాన్యంలో విద్యుత్ పరికరాలు ఉంచవద్దు. ఇక ఇంట్లో వెలుతురు ధారాళంగా ఉండాలి. ఇంట్లో మసక వెలుతురు ఉండడం అక్కడ నివసించే వారికి మంచిది కాదు.
స్టడీ టేబుల్‌ను గదికి ఉత్తర లేదా తూర్పు దిక్కున వేసుకోవాలి. అలాగే డ్రాయింగ్ రూంలో పెట్టుకునే అక్వేరియంను ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య దిక్కులలో పెట్టుకోవాలి. ఎందుకంటే అందులో నీరు ఉంటుంది కనుక.. పైన చెప్పిన దిక్కులు నీటికి సంబంధించినవి కనుక.